
కృష్ణాజిల్లాలో మైనర్ పై గ్యాంగ్ రేప్
సెల్ ఫోన్ల మహిమో లేక యూట్యూబ్ ప్రభావమో గాని ఇటీవలి కాలంలో ఆడపిల్లలపై ఆగడాలు పెచ్చరిల్లాయి. అమ్మాయి కనబడితే చాలు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.
సెల్ ఫోన్ల మహిమో లేక యూట్యూబ్ ప్రభావమో గాని ఇటీవలి కాలంలో మైనర్ల ఆగడాలు పెచ్చరిల్లాయి. ఆడపిల్ల కనబడితే చాలు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ గ్యాంగ్ రేప్ లో ఇద్దరు మైనర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం ఏడుగురు ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
కృష్ణా జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక పక్కింటి మహిళతో కలిసి వీరపనేని గూడెంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ నాలుగు రోజులున్న తర్వాత ఏమైందో గాని ఆ బాలిక ఒంటరిగా సొంతూరు జి.కొండూరుకు బయలుదేరింది. ఈ విషయాన్ని పసిగట్టిన ఓ మైనర్ బాలుడు బండిపై ఆమెను అనుసరించాడు. తాను ఇంటి దగ్గర వదిలేస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత ఆ బాలుడు తన స్నేహితుడైన రజాక్ కు ఈ విషయాన్ని ఫోన్ లో చెప్పాడు. ఆ ఇద్దరు కలిసి ఆ బాలికను తీసుకుని మోటారు బైకుపై బయల్దేరి ఓ మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని అనిల్, జితేంద్ర అనే వారి వద్దకు తీసుకువెళ్లారు. ఇదే అదునుగా ఆ ఇద్దరు కూడా ఆ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ బాలిక ఏడుస్తున్నా వినకుండా అక్కడకు దగ్గర్లోని కేసరపల్లి తీసుకువెళ్లారు. అక్కడ ఆ బాలికపై అనిత్, హర్షవర్ధన్, మరో మైనర్ బాలుడు అఘాయిత్యం చేశారు. ఇలా ఒకే రోజు ఆమెపై ఏడుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ రోజు రాత్రి ఓఇంట్లో నిర్బంధించి విడతల వారీగా ఆమెపై లైంగిక దాడి చేశారు. చివర్లో లైంగిక దాడికి పాల్పడిన యువకుడొకరు మార్చి 17వ తేదీ సోమవారం మధ్యాహ్నం మాచవరం గ్రామ సమీపంలోని పొదల వద్ద వదిలేశాడు. తీవ్ర రక్తస్త్రావంతో అల్లాడుతున్న ఆ బాలిక ఆ పొదల వద్ద రెండు మూడు గంటల పాటు పడి ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఓ ఆటో డ్రైవర్ ఆమెను గమనించి అసలు ఏమైందో కనుక్కున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సూచన మేరకు ఆ ఆటో డ్రైవరు ఆ అమ్మాయిని పోలీసు స్టేషన్ కు తీసుకుపోయి అప్పగించారు. బాలిక మాట్లాడలేని స్థితిలో ఉండడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికి నలుగురు దొరికారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
నిందితులందరూ ఒకరి కొకరు ఫోన్లలో మాట్లాడుకుంటూ ఈ అఘాయిత్యానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
Next Story