కేంద్ర ప్రభుత్వం గన్నవరం (విజయవాడ) ఎయిర్‌పోర్టు భద్రతను తన పరిధిలోకి తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ ఎయిర్‌పోర్టులో ఉండేది.


ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం (విజయవాడ) విమానాశ్రయం భద్రత జులై 2వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి పోతుంది. ఈ మేరకు రక్షణ వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ చూసుకుంటుందని, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని వెనక్కు తీసుకోవడంతో పాటు బ్యారెక్‌లను ఖాళీ చేయాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ అండ్‌ ఐజీపీకి లేఖ రాసింది. దీంతో సెక్యూరిటీ విషయాలన్నీ ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పోలీసు (ఎస్‌పీఎఫ్‌)తో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) చూసుకుంటుంది. ఇటీవల వరకు ఎయిర్‌పోర్టు రాష్ట్ర ప్రభుత్వ కార్యాకలాపాలకే పరిమితమైంది. అయితే కేంద్రం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా ప్రకటించడంతో విమానాశ్రయం నుంచి నేరుగా విదేశాలకు కొన్ని విమానాలు వెళ్తున్నాయి. గతంలో చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వరకు వెళ్లి అక్కడ మరో విమానం మారి విదేశాలకు వెళ్లాల్సి వచ్చేంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి విజయవాడ ఎయిర్‌పోర్టు ప్రధానమైనది కావడంతో ఇక్కడి నుంచి విదేశాలకు చాలా చోట్లు విమానాలు మారాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా మారడంతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌ దిగేందుకు కావాల్సిన సౌకర్యాలన్నీ విజయవాడలో కల్పించారు.

స్మగ్లర్లను అరికట్టడంలో ప్రధాన భూమిక
ఇటీవల కాలంలో గల్ఫ్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు స్మగుల్డ్‌ వస్తువులను తీసుకరావడం ఎయిర్‌పోర్టు అథారిటీ సిబ్బంది గుర్తించారు. తనిఖీల్లో రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని వారి దృష్టికి వెళ్లింది. ఎక్కువగా మత్తు పదార్థాలు, బంగారం స్మగ్లింగ్‌ ద్వారా దిగుమతి అవుతున్నాయి. ఇప్పటికే చాలాసార్లు ఎయిర్‌పోర్టులో పట్టుకొని పలువురిపై కేసులు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో కృష్ణా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఎయిర్‌పోర్టులో తచ్చాడుతూ పోలీసులకు దొరికాడు. అదే సమయంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలు ముగిసిన తర్వాత లండన్‌ వెళ్తున్నాడు. అప్పుడు ఎయిర్‌పోర్టు పరిధిలోనూ సెక్యూరిటీ కారణాల దృష్ట్యా సీఎం సెక్యూరిటీ జామర్లను ఆన్‌ చేసింది. అయినప్పటికీ ఎయిర్‌పోర్టులో తచ్చాడుతూ తిరుగుతున్న వ్యక్తి సెల్‌ఫోన్‌లో మాట్లాడటాన్ని గమనించిన పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని జామర్లను బీట్‌ చేసే టెక్నాలజీ ఉన్న సెల్‌ఫోన్‌ను ఎందుకు వాడుతున్నారు.. ఎక్కడ కొనుగోలు చేశారు.. కొనుగోలు చేసే సమయంలో ఇలాంటి ఫోన్‌ను కొంటున్నట్లు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నిస్తూ ఆయన్ను గన్నవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆ వ్యక్తిపై ఇటీవల కేసు నమోదు చేశారు. సాయంత్రానికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు. ఇటువంటి సెక్యూరిటీ సమస్యలు రానురాను పెరిగే అవకాశం ఉన్నందున ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకున్నట్లు సమాచారం. కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమానయాన శాఖ కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎయిర్‌పోర్టు అథారిటీ పరిధిలోకి గన్నవరం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును తీసుకోవాలని చేసిన సూచన మేరకే కేంద్ర సెక్యూరిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి (రేణిగుంట)లో ఉన్న విమానాశ్రయాలను ఇంటర్నేషనల్‌ విమానాశ్రయాలుగా మార్చేందుకు మంత్రి రామ్మోహన్‌ నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే గన్నవరం, విశాఖపట్నం నుంచి విదేశాలకు విమానాలు వెళ్తున్నాయి.
Next Story