Vamsi MLA, Yarlagadda

ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరు గెలిచినా వెయ్యిలోపే నంటున్నారు పరిశీలకులు. అయితే అభ్యర్థలు ఎవరి ధీమాలో వారున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాను ఒక్కసారి పరిశీలిస్తే గన్నవరం ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంశి గుండెల్లో జగన్‌ రైళ్లు పరుగెత్తించారు. చివరి వరకు టిక్కెట్‌ దక్కుతుందో లేదోననే భయంతో ఉన్నారు. వేరే పార్టీల్లో వీరు చేరే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీలోని అధ్యక్ష కార్యదర్శులను నోటికి వచ్చినట్లు దూషించారని చెప్పొచ్చు.

సర్వేల్లో వీరికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా ముఖ్యమంత్రి వారికి టిక్కెట్‌ ఇవ్వకుంటే పార్టీ మనుగడ కష్టమవుతుందని, వారు ఓటమి చెందినా పరవాలేదనే ఆలోచనతోనే టిక్కెట్‌ ఇచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
పోటీ తీవ్రం
గన్నవరం నియోజకవర్గంలో పోటీ తీవ్రంగా ఉంటుందని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ తరపున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి వంశీపై అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు. తరువాత వంశిని వైఎస్సార్‌సీపీలో చేర్చుకోవడంతో యార్లగడ్డ వెంకట్రావుతో పాటు దుట్టా రామచంద్రరావు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లారు. దుట్టా తనపనులు తాను చేసుకుంటుండగా యార్లగడ్డ మాత్రం టీడీపీలో చేరి వంశిపై పోటీకి దిగాడు. యార్లగడ్డ వెంకట్రావుకు కూడా నియోజకవర్గంలో మంచి పట్టుంది. వంశీ గెలిచింది కేవలం 838 ఓట్లతో మాత్రమేననేది గుర్తుంచుకోవాలని అంటున్నాడు యార్లగడ్డ.
2004లో ఎం వెంకటేశ్వరావు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందగా, తెలుగుదేశం పార్టీ తరపున డివి బాలవర్థన్‌రావు, రెండు సార్లు వంశి మోహన్‌ గెలిచారు. తక్కువ ఓట్లతో గెలిచినా టీడీపీకే ఎంతో కొంత ఎడ్జ్‌ ఉంటూ వచ్చిందని, తాను గెలుస్తాననే ధీమాలో యార్లగడ్డ ఉండగా తనకు ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అండ ఉందని, వైఎస్సార్‌సీపీకి మహిళలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారని, వెయ్యి ఓట్లు మెజారిటీ తెచ్చుకోవడం పెద్ద సమస్యేమీ కాదని వంశి అంటున్నారు. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం.
బీసీలే అక్కడ నిర్ణేతలు
గన్నవరం నియోజకవర్గంలో 2.70 లక్షల ఓట్లు ఉండగా అందులో బీసీల ఓట్లు సుమారు 1.6లక్షలు ఉన్నాయి. మిగిలిన సామాజిక వర్గాలను పరిశీలిస్తే ఎస్సీలు 60వేలు, చౌదర్లు 40వేలు, కాపుల ఓట్లు 25వేల వరకు ఉండే అవకాశం ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు. చౌదర్ల ఓట్లు సుమారు 80 శాతం తెలుగుదేశం పార్టీకి వేస్తారని, ఎస్సీలు సుమారు 65శాతం వైఎస్సార్‌సీపీ వైపు ఉంటారని, ఇక బీసీలు ఎటు మొగ్గితే వారిదే గెలుపు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వంశీ ఎక్కువ రోజులు నియోకవర్గాన్ని మరిచి పోయారని, యార్లగడ్డ మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారని స్థానికులు చెబుతున్నారు. అయితే వంశి ఎన్నికల ప్రచారంలో అడుగుపెడితే పులి పంజాలాగా దూసుకు పోతారని మరికొందరు చెబుతున్నారు. ఎవరు గెలిచినా కేవలం వెయ్యి నుంచి 15వందల లోపు మాత్రమే మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
Next Story