ఈసారి బరిలో మిగిలేది గంటా, అరగంటా?
x
అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాస్

ఈసారి బరిలో మిగిలేది 'గంటా', 'అరగంటా'?

ఓటమెరుగని నేతలు గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాన్.. ప్రత్యర్థులుగా బరిలో దిగనున్నారు. మరి వారిలో విజయం ఎవరిని వరిస్తుందో..


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో రసవత్తర ఎన్నికల పోరుకు తెరలేచింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులీద్దరు ఇప్పటివరకు ఓటమి ఎరగనివారే. కానీ ఈసారి జరగనున్న ఎన్నికలు ఆ ఇద్దరి నేతల రాజకీయ జీవితాల్లో కీలక మైలురాళ్లుగా మారనున్నాయి. ఓడిన వారిని తొలి ఓటమి కాగా గెలిచిన అభ్యర్థికి ఓటమెరుగని నేతను చిత్తు చేసిన మైలు రాయిగా ఉంటాయి. మరి ఈసారి వీరిలో గెలిచే ఆ ఒక్కరు ఎవరు...? ప్రస్తుతం విశాఖ జిల్లాలో ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. భీమిలి నియోజకవర్గం నుంచి టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గంటా శ్రీనివాస్ పోటీ చేస్తుండగా.... వైసీపీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఎన్నికల బరిలో నిలిచారు. వీరిద్దరూ ఓటమెరగని నేతలు కావడంతో ఇరువురిలో ఎవరు గెలుస్తారా అన్న ఆసక్తికరంగా మారింది.

గురుశిష్యుల సవాల్....

ఆ నేతల ఇద్దరు పేర్లు శ్రీనివాసులే.. ఇద్దరు అసెంబ్లీలో అడుగుపెట్టిన వారే... ఇదే భీమిలి నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ నుంచి గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా… 2009, 2019లో రెండు సార్లు ముత్తంశెట్టి శ్రీనివాస్ శాసనసభ్యులుగా గెలుపొందారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యులుగా కూడా ఇరువురూ ఎన్నికయ్యారు.1999లో తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాస్.. అనకాపల్లి ఎంపీ కాగా.. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి ముత్తంశెట్టి శ్రీనివాస్ అనకాపల్లి ఎంపీగా గెలిచారు. ఇద్దరూ మంత్రి పదవులు అనుభవించిన వారే.. రాజకీయ అవపోసన పట్టిన వారే. గురువు బాగుండాలి అనుకునే శిష్యుడు.... శిష్యుడు అభివృద్ధి చెందాలనుకునే గురువు వాళ్లిద్దరూ. అలాంటిది ఇప్పుడు ఆ గురుశిష్యుల మధ్య పోటీ నెలకొంది. గెలిచేది గురువా శిష్యుడా? అనేది సస్పెన్స్‌గా మారింది. గురు శిష్యుల మధ్య పోటీ కావడంతో భీమిలి నియోజకవర్గ ఎన్నికలు హాట్ హాట్‌గా మారాయి..

కలసి ప్రయాణం...

ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంలో అవంతి శ్రీనివాసరావుని గంటా శ్రీనివాసరావు స్వయంగా రాజకీయాలకు పరిచయం చేశారు. పీఆర్‌పీ కాంగ్రెస్‌లో విలీనం కావడం... రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవడంతో ఇద్దరూ జట్టుగా టీడీపీలో చేరారు. అనంతరం గంటా శ్రీనివాస్ టీడీపీలోనే కొనసాగగా.. అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. వీరు ఇరువురు ఇప్పుడు భీమిలిలో ప్రత్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. వ్యాపారాల్లోనూ, రాజకీయాల్లోనూ సక్సెస్‌ సాధించి సమాంతరంగా రాణించిన వీరు తొలిసారి ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు.

గెలుపే ధ్యేయంగా....

నియోజకవర్గంతో సంబంధం లేదు, పోటీ చేశామా... గెలిచామా అనేదే అది ఆ ఇద్దరు రాజకీయ నాయకుల చరిత్ర. పదవి ఏది అన్నది కూడా వారికి పట్టదు గెలిచామా లేదా అన్నది మాత్రమే చూస్తారు. అయితే ఓటమి ఎరగని ఈ నాయకులు ఈసారి ఎన్నికల్లో వేరువేరు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఉంటే ఇద్దరు గెలిచేవారేమో. కానీ అలాకాకుండా ఒకే నియోజకవర్గంలో వేర్వేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా ఎన్నికల సమరానికి సిద్ధం అవుతుండటంతో వీరిలో ఎవరో ఒకరికి ఓటమి అనివార్యం కానుంది. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాసరావు కాస్త దూకుడు పెంచారనే చెప్పాలి. 'జగన్ పథకాలు ఇచ్చారు ప్రజలు మనకు ఓట్లు వేస్తారు భయపడాల్సిన అవసరం లేదు. గెలుపు నాదే' అంటున్నారు అవంతి. ఇక గంటా అయితే ఏది బయటకు చెప్పకుండా తాను ఏం చేయాలో అది చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఎవరికి వారు గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అవంతి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, ఇక ఏ శ్రీనివాసుడికి భీమిలి నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారో జూన్ 4న తేలుతుంది.

Read More
Next Story