తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికీ ఉచితంగా మూడు గ్యాస్‌ సిలెండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇంత వరకు దాని ఊసేలేదు.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఇంటికీ ఉచితంగా మూడు గ్యాస్‌ సిలెండర్లు ఇస్తామని ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. ఆ తరువాత ఎన్‌డిఏ కూటమి కూడా ఉమ్మడి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ విషయాన్నే స్పష్టం చేసింది. సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్‌ పథకాన్ని ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక్కటి కూడా సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయడం లేదు. పింఛన్‌ల పథకం పాతదే కాబట్టి దీనిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రతి ఇంటికీ అంటే బీపీఎల్‌ కుటుంబాలేనా..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికీ సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలెండర్లు ఉచితం అన్నారే తప్ప పేదలకు అని అనలేదు. అయితే ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం ఇన్‌కం బేస్‌పైనే అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే పేదలకు చాలా వరకు గ్యాస్‌ సబ్సిడీ పథకాలు ఉన్నాయి. ఎంత మంది పేదలకు గ్యాస్‌ కనెక్షన్‌లు ఉన్నాయనేది ప్రభుత్వం ప్రకటించలేదు. రేషన్‌ కార్డులు ఉన్న పేదలు రాష్ట్రంలో 1.48 కోట్ల మంది ఉన్నారు. కనీసం వీరందరికీ ఉచిత గ్యాస్‌ పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది.
దీపం కనెక్షన్‌లు 60 లక్షలు ఉన్నాయి
దీపం పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్‌ కనెక్షన్‌లు 60 లక్షలు ఉన్నట్లు సివిల్‌ సప్లైస్‌ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. ఈ పథకం కింద ఒక్కో సిలెండర్‌కు రూ. 200లు సబ్సిడీని ప్రభుత్వం ఇస్తున్నది. మొదట్లో కనెక్షన్‌ ప్రభుత్వ ఖర్చుతోనే వినియోగదారులకు ఇచ్చారు. ఈ పథకం వినియోగ దారులు సబ్సిడీని వినియోగించుకుంటున్నారు. ఎక్కువగా దీపం కనెక్షన్‌లు డ్వాక్రా గ్రూపులు, సెల్ఫ్‌ హెల్ఫ్‌ గ్రూప్స్‌ (ఎస్‌హెచ్‌జీ) లోని వారికి ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలెండర్లు ఉచిత పథకం కూడా కేవలం దీపం పథకం వారికే వర్తించేలా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి నాదెండ్ల ప్రకటన తరువాత అర్థమైంది.
పిఎంయువై కిందకు దీపం కనెక్షన్‌లు తీసుకుంటారా?
ఆంధ్రప్రదేశ్‌లో దీపం పథకం కింద 60 లక్షల గ్యాస్‌ కనెక్షన్‌లు ఉన్నాయి. ఈ కనెక్షన్‌ల వరకు మాత్రమే ఉచిత గ్యాస్‌ పథకం అమలు చేయాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చిందని పలువురు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 3,90,998 కనెక్షన్‌లు ఉన్నాయి. ఈ పథకం కింద గ్యాస్‌ తీసుకునే వారికి ప్రభుత్వం రూ. 300లు సబ్సిడీ ఇస్తోంది. వచ్చే ఏడాది వరకు కొత్త కనెక్షన్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్రం అవకావం కల్పించింది. అయితే పీఎంయూవై పథకం కిందకు రాష్ట్రంలోని 60 లక్షల దీపం గ్యాస్‌ కనెక్షన్‌లు తీసుకోవాలని కోరుతూ కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్ధీప్‌ ఎస్‌ పూరి కి పార్లమెంట్‌ భవన్‌లో ఈనెల 8వ తేదీన రాష్ట్ర సివిల్‌ సప్లైస్‌ మినిస్టర్‌ నాదెండ్ల మనోహర్‌ ఒక వినతిపత్రం సమర్పించారు. దీనికి కేంద్రం అంగీకరిస్తే ఒక్కో సిలెండర్‌కు నెలకు రూ. 300లు సబ్సిడీ లభిస్తుంది. ఇప్పుడు రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీ కంటే మరో వంద రూపాయలు అదనంగా లభిస్తుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. అనుక్నుట్లు సంవత్సరానికి మూడు సిలెండర్లు ఉచితంగా ఇచ్చే అవకాశం లభిస్తుందని రాష్ట్ర బావిస్తోంది.
Next Story