మా సీట్లలో.. ఈ వివక్ష ఏంది?
x
Source: Twitter

మా సీట్లలో.. ఈ వివక్ష ఏంది?

దళితులకు కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లో వివక్ష ఎందుకు చూపుతున్నారు. మాకు సమాన సీట్లు కేటాయించండని మాదిగలు డిమాండ్ చేస్తున్నారు.


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: ఓట్లు మావి.. సీట్లు మావే.. అనే నినాదంతో దళిత సమాజం పిడికిలి బిగించింది. పేరు పక్కన కులం చెప్పుకునే స్థాయికి దళితుల్లో చైతన్యం పెరిగింది. మంచికో చెడుకో.. అనేది పక్కన ఉంచితే, మాల మాదిగలు సీట్ల కోసం పోటీ పడుతున్నారు. రాజ్యాంగం ద్వారా లభించిన.. "మాకు కేటాయించిన రిజర్వుడు స్థానాల్లో మాల మాదిగలకు సమాన అవకాశాలు ఇవ్వండి" అని నిలదీస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మాదిగలకు సీట్లు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు.

జనరల్ సీట్లలో.. దళితుల ఓట్లు ఎలా మీకు ఇస్తున్నామో.. రిజర్వుడు స్థానాల్లో కూడా వివక్షకు ఆస్కారం లేకుండా మాలలతో సమానంగా అభ్యర్థిత్వం కల్పించాలని మాదిగలు పిడికిలి బిగించారు. నిజంగా చెప్పాలంటే ఇది స్వాగతించదగిన విషయం. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో.. రాయలసీమ, నెల్లూరులలో టిడిపి - బిజెపి - జనసేన కూటమితో పాటు అధికార వైఎస్ఆర్సిపి కూడా ఎస్సీ రిజర్వుడ్ సీట్‌లో కల్పించిన అభ్యర్థిత్వాలపై మాదిగ సామాజిక వర్గం నేతలు అన్ని పార్టీలను నిలదీస్తున్నారు. కనీసం మా సీట్లలో మా మధ్య చిచ్చు పెట్టకుండా మాల మాదిగలకు సమానంగా అభ్యర్థిత్వం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరహాలో నిలదీయడం కూడా రాజకీయ పార్టీలకు చెంపపెట్టు లాంటిదే అని చెప్పవచ్చు.

ఎందుకు అంటే..

కులాలతో రాజకీయాలు ముడిపడి పోయాయి. ఆ ప్రస్తావన లేకుండా, రాజకీయాలు చర్చించలేం. స్వాతంత్రం రాకముందు పరిస్థితి వేరు. ఆ తర్వాత వచ్చిన చైతన్యం వేరు. ఇందులో ప్రధానంగా, కారంచేడు, నీరుకొండ, పాదిరి కుప్పం సంఘటనలతో దళిత ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. ఆ మంటలు ఆరలేదు. అవి మొదటి సంఘటనలు కాదు. చివరివీ కాదు. అదే పరిస్థితిలో ఊపిరి పోసుకున్న మాల మహానాడు, అంతకంటే ముందు ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎం ఆర్ పి ఎస్) వల్ల దళితుల్లో మాల- మాదిగ చీలిక వచ్చింది. ఇది మంచిదా? కాదా??

అనే విషయాన్ని పక్కకు ఉంచితే, రెండు కులాల్లోనూ సమాజ చైతన్యం, ప్రశ్నించే స్వభావం మరింత పదునెక్కింది. ఆత్మన్యూనత భావం నుంచి చాలా దూరం జరిగిన మాల, మాదిగ సామాజిక వర్గం వ్యక్తులు తమ పేర్లు పక్కన కులాన్ని కూడా సగర్వంగా చేర్చుకునే స్థాయికి ఎదగడం అభినందనీయం. దీనికి ఆస్కారం కల్పించిన నేపథ్యాన్ని ఓసారి పరిశీలిద్దాం..

పోటీలో 31 మంది దళితులు

రాయలసీమ పరిధిలో నాలుగు, నెల్లూరు జిల్లాలో ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ స్థానాలు 11 ఉన్నాయి. పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. శాసనసభ స్థానాలను పరిశీలిస్తే, టిడిపి కూటమి, అధికార వైయస్సార్సీపి నుంచి 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో మాల సామాజిక వర్గం నుంచి 16 మంది, మాదిగ సామాజిక వర్గం నుంచి ఏడుగురు అన్ని రాజకీయ పార్టీల నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులను ఖరారు చేశారు. రెండు పార్లమెంటు నియోజకవర్గాల ముగ్గురు మాలలు, ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నారు.

ఇదే సమస్య

రాయలసీమలో చిత్తూరు జిల్లాలో సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. టిడిపి కూటమి, అధికార వైఎస్ఆర్సిపి పూర్తిగా మాలలకే అవకాశం కల్పించింది. మాదిగలకు ప్రాధాన్యత లేదు.

తిరుపతి, చిత్తూరు ఎస్సీ రిజర్వుడు స్థానాల నుంచి నలుగురు పోటీలో ఉన్నారు. చిత్తూరు స్థానంలో మాత్రమే టిడిపి అవకాశం కల్పించింది. మిగతా ముగ్గురు వైఎస్ఆర్సిపి నుంచే ఉన్నారు.

నెల్లూరు : జిల్లాలో గూడూరు, సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాలు ఉంటే, కూటమి, వైఎస్ఆర్సిపి మాల సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించింది.

కడప: జిల్లాలో ఉన్న రెండు కోడూరు, బద్వేలు అసెంబ్లీ స్థానాల్లో ముగ్గురు మాల సామాజిక వర్గం నుంచి పోటీపడుతున్నారు. బద్వేలు లో మాత్రం టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిన వ్యక్తికి అవకాశం దక్కింది.

అనంతపురం : జిల్లాలో సింగనమల, మడకశిర నియోజకవర్గాల్లో టిడిపి కూటమి, వైఎస్ఆర్సిపి ఎవరికో ఎవరి తీసిపోకుండా ఎత్తులు వేశాయి. రెండు పార్టీలు మాదిగలకే అవకాశం కల్పించాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో మాదిగల ఓట్లు ఎక్కువగా ఉండటం వల్ల వారికే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది.

కర్నూలు: జిల్లాలో కోడుమూరు, నందికొట్కూరు రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. కోడుమూరు నియోజకవర్గంలో టిడిపి, వైఎస్ఆర్సిపి మాదిగ సామాజిక వర్గం అభ్యర్థులను బరిలో నిలిపారు.

నందికొట్కూరు నియోజకవర్గంలో మాల సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు రెండు ప్రధాన పార్టీలు అవకాశం కల్పించడం ద్వారా సమన్యాయం పాటించాయి. ఆ నియోజకవర్గాల్లో.. దళితుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనే విషయాన్ని పక్కకు ఉంచితే, పెత్తందారులు... నియోజకవర్గ స్థాయి నాయకుల సూచనలు మీరకే అభ్యర్థులను ఎంపిక చేస్తారనే విషయం జగమెరిగిన సత్యం. స్థానిక నాయకులను కాదంటే, వచ్చే ఎన్నికలకు గెలిచిన వారికి అవకాశం ఉండదు. ఓడిన వారిని మళ్లీ దగ్గరకు రానివ్వరు. నియోజకవర్గాల్లో నడిచే సామాజిక న్యాయం. గతాన్ని పరిశీలిస్తే అనేక సంఘటనలు ఎస్సీ రిజర్వు సీట్లలో కనిపిస్తాయి.



Read More
Next Story