
Kadapa | 'కడప' పేరుకు ప్రాధాన్యం ఇవ్వండి
కడప చరిత్రకు గుర్తింపు ఉండాలి. జిల్లా పేరు మార్చాలని పీసీసీ కోరుతోంది.
చరిత్రలో కడపకు ప్రాధాన్యత ఉంది. తిరుమలకు ఇది తొలి గడప అని రాజ్యసభ సభ్యుడు, పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గుర్తు చేశారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని "వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చండి" అని తులసిరెడ్డి రాష్ర్ట ప్రభుత్వానికి సూచించారు.
కడప జిల్లా వేంపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కడపకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత కూడా గుర్తు చేశారు. క్రీస్తు శకం 1808లో కడప జిల్లా ఏర్పాటైందనే విషయాన్ని గుర్తు చేశారు. కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుమలకు వెళ్లడానికి తొలి గడప కడప. అందువల్ల జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 2010 వరకు జిల్లాను కడప జిల్లా అనే పిలిచేవారు. కానీ, 2005 ఆగష్టు 19వ తేదీ ఇంగ్లీష్ లో Cuddapah బదులు Kadapa అని స్పెల్లింగ్ మార్చారని తెలిపారు. దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం 8-7-2010 న ఆయన జ్ఞాపకార్థం కడప జిల్లా పేరు మార్చిన ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా అని గెజిట్ జారీ చేసిందన్నారు. అప్పుడే వైఎస్సార్ కడప జిల్లా అని పేరు పెట్టివుంటే సరిపోయేదని ఆయన అభిప్రాయపడ్డారు.
వెంకన్నకు అపచారమే...
కడప అనే పేరును పూర్తిగా తొలగించడం సమంజసం కాదు. ఇది దురదృష్టం అని డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. దీనివల్ల " శ్రీవేంకటేశ్వరస్వామికి అపచారం చేయడమే అవుతుంది" అని తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే... క్రీస్తు శకం 1792 లో నెల్లూరు జిల్లా ఏర్పాటయింది.2008 జూన్ 4 న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు మార్చారు. అయినా, నెల్లూరు పేరును కొనసాగిస్తున్న విషయాన్ని తులసిరెడ్డి ప్రస్తావించారు. అంతేకాకుండా,
2022 ఏప్రిల్ 4 న కోనసీమ జిల్లా ఏర్పాటయింది. 2022 ఆగష్టు 2 న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. చరిత్రకారులకు ప్రాధాన్యత ఇస్తూనే కోనసీమ పేరును కొనసాగించడం అభినందనీయం అన్నారు. అదేవిధంగా వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లా గా మారిస్తే అటు వేంకటేశ్వర స్వామి కి గుర్తుగా, ఇటు రాజశేఖరరెడ్డి జ్ఞాపకార్థంగా ఉంటుందని తులసిరెడ్డి రాష్ర్ట ప్రభుత్వానికి సూచించారు.
Next Story