ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నటుడు షాయాజీ షిండే భేటీ అయ్యారు. ప్రముఖ ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను ప్రసాదంగా ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ప్రముఖ నటుడు షాయాజీ షిండే కలిశారు. ఆలయాల్లో ప్రసాదంతో పాటు మొక్కలను భక్తులకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్‌ను షిండే కోరారు. దీనిపైన పవన్ సానుకూలంగా స్పందించారు. ఆలయాల్లో ప్రసాదంతోపాటు మొక్క ఇవ్వాలనే షాయాజీ షిండే ఆలోచనను స్వాగతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి కలిస్తే భావి తరాలకు మేలు జరుగుతుందన్నారు. ముంబైలోని మూడు ఆలయాల్లో వృక్ష ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు షాయాజీ షిండే పవన్‌తో పంచుకున్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ని షాయాజీ షిండే కలిశారు.
ఈ సందర్భంగా షిండే తన ఆలోచనలను పపన్‌తో పంచుకున్నారు. మొక్కలు, వాటి విశిష్టత గురించి మరాఠీలో రాసుకున్న కవితను పవన్ కళ్యాణ్‌కు చదివి వినిపించారు. ఆ కవితను పవన్ కళ్యాణ్ ప్రశంసిస్తూ ఆ మరాఠీ కవితను తెలుగులో అనువదించి చెప్పడం విశేషం.
మహారాష్ట్రలో సిద్ధి వినాయక ఆలయం, దగదుశేథ్ గణపతి ఆలయం, మహాలక్ష్మి ఆలయాల్లో వృక్ష ప్రసాద్ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు షిండే చెప్పారు. విరివిగా మొక్కలను నాటడం తన జీవన అలవాట్లలో భాగం అయ్యింది. నా తల్లి కన్ను మూసినప్పుడు ఆమె బరువుకు సరితూగే విత్తనాలను చాలా ప్రాంతాల్లో నాటినట్లు పవన్‌తో చెప్పారు. దేవాలయాలకు వెళ్లే భక్తులకు ప్రసాదాలతోపాటు మొక్కలను దేవుడు ఇచ్చిన బహుమతిగా అందిస్తే వాటిని వారు నాటడం, సంరక్షించడం దైవ కార్యంగా భావిస్తారని చెప్పారు.
Next Story