పోగొట్టుకున్న డబ్బులు రాబట్టుకోవడానికి గోల్డెన్‌ అవర్‌ను నమ్ముకోవాలంటున్న పోలీసులు.


గోల్డెన్‌ అవర్‌ ప్రస్తుతం తాజాగా చర్చనీయాంశంగా మారిన పదం. గోల్డెన్‌ అవర్‌ అనే పదం ఎలా ఆవిర్భవించింది. ఎవరి ద్వారా ఇది ప్రచారం అవుతోంది. అనే చర్చ రాష్ట్రంలో ఇప్పుడు మొదలైంది. ఒక విభాగంలోనే కాదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అనేక విభాగాల్లోను గోల్డెన్‌ అవర్స్‌ ఉన్నాయి. ప్రధానంగా సైబర్‌ క్రైమ్‌ విషయంలో పోలీసులు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. వైద్య రంగంలో కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. గోల్డెన్‌ అవర్‌ ఎందుకు అనాల్సి వచ్చింది? దాని ప్రత్యేకత ఏంటి? తెలుసుకుందాం.

సైబర్‌ నేరాల విషయంలో గోల్డెన్‌ అవర్‌ ఎంతో ప్రధానమైంది. ఈ గోల్డెన్‌ అవర్‌ను ఉపయోగించుకుంటే మోసపోయిన వారు కొంత వరకైనా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సైబర్‌ దొంగతనాలు రకరకాలుగా జరుగుతున్నాయి. నేరగాళ్లు నేరుగా కొందరికి ఫోన్లు చేసి వారిని మాటల్లోకి దించి భయపెట్టి మానసికంగా వేధించి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారు. కుటుంబ హిస్టరీ అంతా చెప్పి బాధితులు నమ్మేలా చేస్తున్నారు. దీంతో తన బ్యాంకు ఖాతాల్లోని డబ్బును తన చేతులతోనే నేరగాళ్ల అకౌంట్లకు బదిలీ చేయించుకుంటున్నారు. ఈ విషయాలపై బాధితులు గోల్డెన్‌ అవర్‌ అనేది మిస్‌ కాకుండా చూసుకోవాలి. తన ఖాతాల నుంచి నేరస్తుల అకౌంట్లకు డబ్బు జమైన గంటలోపు ఉండే సమయాన్ని గొల్డెన్‌ అవర్‌గా పోలీసులు పిలుస్తున్నారు.
సైబర్‌ నేరాలకు గురైన వారు వెంటనే తేరుకొని 1930 నంబరుకు ఫోన్‌ చేసి జరిగిన మోసం గురించి పోలీసులకు తెలియ చెప్పాలి. cybercrime.gov.in ఫిర్యాదు చేయాలి. సంఘన జరిగిన గంటలోపు చెప్పడం వల్ల పోలీసులు వెంటనే సంబంధిత బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి ఖాతాలను ఫ్రీజ్‌ చేయించేందుకు అవకాశం ఉంటుంది. అకౌంట్‌ ఫ్రీజ్‌ అయిందంటే ఆ అకౌంట్‌లోని డబ్బును పోలీసుల అనుమతుల లేకుండా ఎవరూ డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండదు. అప్రమత్తంగా ఉండి ఫోన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల గోల్డెన్‌ అవర్‌లో సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసే అవకాశాలు ఉంటాయి. ఫోన్‌లో ఫిర్యాదులు చేయడమే కాకుండా వెంటనే సంబంధిత పోలీస్టేషన్‌కు వెళ్లి కంప్లెయింట్‌ ఫైల్‌ చేయించాలి. అలాగే సైబర్‌క్రైమ్‌.జీవోవి.ఇన్‌లో ఫిర్యాదులను నమోదు చేయాలి.
రెండోది వైద్య ఆరోగ్య శాఖలో గోల్డెన్‌ అవర్‌
అత్యవసర వైద్య చికిత్సలకు సంబంధించి క్షణాల్లో అంబులెన్స్‌లకు ఫోన్‌లు చేయడం, తర్వాత రోగులను సకాలంలో ఆసుపత్రులకు తీసుకొని రావడం. వ్యాధి తీవ్రతను బట్టి ఎంత సమయానికి బాధితులను ఆసుపత్రులకు తీసుకొని రావాలో వైద్యులే సూచిస్తారు. ఆ సమయాన్ని వారు గోల్డెన్‌ అవర్‌గా చెబుతారు. సకారంలో బాధితుడిని ఆసుపత్రికి తీసుకొని రావడం వల్ల ప్రాణం పోయే కేసు నుంచి బయటపడేయొచ్చు. ప్రధానంగా గుండె జబ్బులు(Heart stroke), ఊపిరితిత్తుల వ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధుల వంటి వాటిని గోల్డెన్‌ అవర్‌ వ్యాధులుగా పిలుస్తుంటారు. అనుకున్న సమయంలో ఆసుపత్రులకు తీసుకొని రాగలిగితే ఈ వ్యాధుల నుంచి బయటపడొచ్చు. ప్రాణ భయం తప్పుతుంది. అందుకే వైద్య రంగంలోను కొన్ని వ్యాధులకు సంబంధించి గోల్డెన్‌ అవర్‌ను వైద్య సిబ్బంది యూజ్‌ చేస్తుంటారు. ఈ విషయమై విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబు మాట్లాడుతూ సైబర్‌ క్రైంలో గోల్డెన్‌ అవర్‌ గురించి తెలుసుకుంటే మీ డబ్బులు సేఫ్‌ అని చెబుతున్నారు. ఈ మేరకు ఎన్‌టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కొన్ని పోస్టర్లు వేసి సైబర్‌ నేరానికి గురైతే గోల్డెన్‌ అవర్‌ మిస్‌ చేసుకోకండని పిలుపు నిచ్చారు.
Next Story