గత ప్రభుత్వం ఉపాధ్యాయులపై అక్రమంగా అనేక కేసులు పెట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. టీచర్లపై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేస్తామని తెలిపింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ శాసన సభలో శుక్రవారం మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉపాధ్యాయులపై వేధింపులు ఉండకూడదు. విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యతగా ఉండాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ మేనేజ్‌మెంట్, మోనటరింగ్ అంతా ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగా ఏపీలో అమలు చేస్తాం. ఎస్టేట్ మేనేజర్స్ పేరుతో వీటిని అక్కడ మోనటరింగ్ చేస్తున్నారు. అదే విధానం ఇక్కడ కూడా అమలు చేస్తామని అన్నారు. మరుగు దొడ్లు బాధ్యత టీచర్లది కాదని ఇది వరకే చెప్పాం. గత ప్రభుత్వం ఉపాధ్యాయులపై అన్యాయంగా వ్యవహరించింది. ధర్నాలు చేసిన సందర్భాల్లో ఉపాధ్యాయులపై అక్రమ కేసులు పెట్టింది. ఆ కేసులన్నీ సరైన కేసులు కాదు. అన్నీ దొంగ కేసులు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టిన విధంగానే, ఉపాధ్యాయులపైన కూడా దొంగ కేసులు పెట్టింది. వీటిని అన్నింటిని ఎత్తేసేందుకు చర్యలు తీసుకుంటాం. దీనిపై ఇప్పటికే డీజీపీతో చర్చించాం. ఉపాధ్యాయులపై నమోదైన కేసులన్నింటిని త్వరలో తీసేయ బోతున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు.