కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ దీపావళి కానుకను ప్రకటించింది. డీఏని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ ప్రకటించింది. దీపావళి కానుకగా డీఏను 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆమేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. తాజాగా పెరిగిన డీఏతో ఇప్పటి వరకు ఉన్న 50 శాతం డీఏ 53 శాతానికి చేరనుంది. ఈ ఏడాది జూలై 1 నుంచి దీనిని అమలు చేయనున్నారు. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ. 9448 కోట్లు అదనపు భారం పడనుందని మంత్రి వైష్ణవ్ తెలిపారు. తాజాగా డీఏ పెంపు నిర్ణయంతో దేశ వ్యాప్తంగా దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. ఇది వరకు నాలుగు శాతం డీఏను పెంచారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చిలో 4 శాతం డీఏను పెంచింది. ఏడాదికి రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంటారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ డీఏని అందజేస్తుంటారు. బుధవారం ఉదయం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు డీఏ పెంపునకు సంబంధించిన నిర్ణయానికి ఆమోదం తెలిపారు.