జగనన్న విద్యా దీవెన పథకం నిధులు కాలేజీలకు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసేందుకు నిర్ణయించింది.


తమ పిల్లల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద చెల్లించిన నగదును విద్యార్థుల తల్లులు కాలేజీలకు చెల్లించడం లేదు. ఆయా కాలేజీల యాజమాన్యాలు చాలా చోట్ల జరుగుతున్న పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఏ కాలేజీల్లో అయితే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద ఇచ్చిన నగదును తల్లులు చెల్లించలేదో ఆ విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వనుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ఖాతాల్లో జమైన వారం రోజుల్లోపు కాలేజీలకు చెల్లించాలి. అలా ఎవరైతే ఇప్పటి వరకు చెల్లించకుండా ఉన్నారో వారి నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను కాలేజీలకు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలందాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఇచ్చిన నిధులను కాలేజీల యాజమాన్యాలకు ఎవరైతే చల్లించలేదో వారి ఖాతాల్లో ఇక నుంచి నగదు జమ కాదు. వారి పిల్లల పేరుతో నేరుగా ప్రభుత్వమే ఆ కాలేజీల యాజమాన్యానికి చెల్లిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం గతంలో ఆదేశాలిచ్చినా అమలు కాకపోవడంతో ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుMýంంది.
కాలేజీల యాజమాన్యాలు మొత్తుకున్నా వినని ప్రభుత్వం
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం, తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విద్యార్థుల పేరుతో నేరుగా కాలేజీలకే దాదాపు సకాలంలోనే అందించింది. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రుల్లో జవాబుదారీ తనాన్ని పెంచేందుకు ప్రభుత్వం విద్యార్థుల పేరుతో ఏడాదికి ఎంత మొత్తంలో ఫీజులు చెల్లిస్తుందో తెలుసుకునేందుకు వీలుగా ఎప్పటికప్పుడు తల్లుల ఖాతాల్లో జమ చేస్తే తల్లుల ఖాతాలకు జమైన వారం రోజుల్లో కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను అందజేయాలంటూ నిబంధలను రూపొందించి అన్ని కాలేజీలకు పంపడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా పంపారు.
ప్రధానంగా ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ కోర్సులకు దీనిని వర్తింప చేశారు. తల్లి అకౌంట్లో నగదు జమ కాగానే పిల్లలకు కాలేజీ ఫీజులు కట్టాలనే విషయాన్ని తల్లిదండ్రులు మరచి పోతున్నారు. ఆర్థికంగా నానా అవస్థలు పడుతూ ఏదో ఒక రోజు విధిలేని పరిస్థితుల్లో ఎక్కడో ఒక చోట అప్పులు తీసుకున్న వారికి జమ చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యానికి ఫీజులు కడదామనే సరికి వారం లోపే వారి ఖాతాల్లోని డబ్బులు మాయమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేద విద్యార్థుల తల్లిదండ్రులు జీవితాన్ని గడుపుతున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నగదుతో వారికి లింక్‌ పెట్టకుండా నేరుగా కాలేజీలకే అందించాలంటూ ఎన్ని విజ్ఞప్తులు చేసినా సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి వారి విజ్ఞప్తులను పెడ చెవిన పెట్టారు. విద్యా శాఖలోని ఐఏఎస్‌లు సైతం ఇదే విషయాన్ని చెప్పినా పట్టించుకోలేదు. పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి జగనన్న విద్యా దీవెనగా పేరు పెట్టుకున్నారు. విద్యా దీవెనతో పాటుగా వసతి దీవెన నిధులు కూడా ఇలాగే తల్లిదండ్రుల ఖాతాల నుంచి వసతి గృహాల వార్డన్లకు చేర లేదు.
అప్పులు చేసి హాస్టళ్లు నడిపారు
ఏడాది పొడవున సూపర్‌ మార్కెట్లలో నిత్యవసరాలను అప్పులకు తెచ్చి, చివర్లో కాలేజీల లెక్చరర్లు, ప్రొఫెసర్లు అప్పులు తీసుకున్న వారి వద్ద చేతులు కట్టుకొని అవమానాలకు గురైన సంఘటనలు ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నో ఉన్నాయి. జగనన్న వసతి దీవెన అనే పథకం ఉపకారవేతనాలకు సంబంధించిన పథకం. ఈ పథకం కింద ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో 40 శాతం నిధులను సమకూర్చి మొత్తం నూరు శాతం విద్యార్థులకు మెస్‌ చార్జీల కింద ఇవ్వాలి. దీనికి వసతి దీవెన అనే పేరు పెట్టి హాస్టళ్లల్లో వసతులే సరిగ్గా లేకుండా చేసి, విద్యార్థులు అప్పులతో అన్నం తినలేని పరిస్థితులను జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చింది. విద్యా దీవెన, వసతి దీవెనల నిధులను మా అకౌంట్లల్లో వేయాలని తల్లిదండ్రులు ఈ ప్రభుత్వాన్ని కోరలేదు. అయినా సామాన్యుల ఆలోచనలకు అందని విధానాలతో ముందుకు పోతే ఇలాగే ఉంటుందని, దీనినే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారని విద్యా రంగంలోని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది.
Next Story