తీరం దాటిన వాయుగుండం.. ఫోకస్ పెంచిన కూటమి సర్కార్..
x

తీరం దాటిన వాయుగుండం.. ఫోకస్ పెంచిన కూటమి సర్కార్..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుంగుండం ఆదివారం అర్ధరాత్రి సమయంలో కళంగపట్నం సమీపంలో తీరం దాటింది. ఈ వాయుగుండం బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి సమయంలో కళంగపట్నం సమీపంలో తీరం దాటింది. ఈ వాయుగుండం బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాయుగుండం కారణంగా కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు చెప్తున్నారు. ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై కూడా భారీగా ఉండనుంది. ఇప్పటికే ఈ వర్షాల వల్ల పలు జిల్లాలు జలమయం అయ్యాయి. ఇప్పటికే ఎన్‌టీఆర్, గుంటూరు, బాపట్ల, నంద్యాల, కర్నూలు, పల్నాడు, విజయనగరం, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్ష ప్రభావం భారీగా ఉన్న క్రమంలో అధికారులకు అప్రమత్తమయ్యారు. ఎక్కడిక్కడ జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని చెప్తున్నారు. అదే విధంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ వర్షాల పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు సహా మంత్రులు కూడా ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

నష్టం వివరాలు సేకరించాలి..

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేశారు. ప్రతి జిల్లాలోని పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్‌లలో వచ్చే విజ్ఞప్తులపై తక్షణ స్పందన ఉండాలని ఆదేశించారు. వదర తగ్గిన వెంటనే పంట నష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్‌కు 9 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.

జనావాసాలు జలమయం

‘‘రాష్ట్రంలో భారీ వర్షాలతో వాగులు, వంకలు ఏకమయి జనావాసాలను జలమయం చేశాయి. కాబట్టి జలమయమైన ప్రాంతాల్లో పునరావాస చర్యలు తీసుకోవాలి. పునరావాస చర్యల విషయంలో ఖర్చులకు వెనకాడొద్దు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. మంచి భోజనం, వసతి, స్వచ్ఛమైన తాగునీరు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం పునరావాస చర్యల కోసం జిల్లాకు రూ.3కోట్లు ఇచ్చాం. అవసరం అయితే ఇంకా ఇస్తాం. ఎన్‌టీఆర్ జిల్లాలో పలు గ్రామాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరద ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అధికారులు ఆ ప్రాంత ప్రజలకు తరలించాలి. అదే విధంగా ఉధృతంగా ప్రవహించే వాగులు దాటే ప్రయత్నం ప్రజలు చేయకుండా చర్యలు తీసుకోండి. ప్రజలు, వాహనదారుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలి’’ అని హెచ్చరించారు.

విద్యుత్ శాఖపై మంత్రి సమీక్ష

వర్షాల వల్ల కలిగిన విద్యుత్ శాఖ నష్టంపై మంత్రి గొట్టిపాటి రవి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వీటీపీఎస్‌లోకి భారీమొత్తంలో వర్షపు నీరు చేరడం వల్ల 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందని ఆయన వివరించారు. విజయవాడ పరిసరాల్లో విద్యుత్ అంతరాయంపై అనేక ఫిర్యాదులు వచ్చాయని.. ఎప్పుడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో అధిక వర్షం కురవడంతో సబ్ స్టేషన్లు సైతం నీట మునిగాయని వెల్లడించారు.

విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలో పలు చోట్ల విద్యుత్‌ను నిలిపివేయడం జరిగిందని, ప్రాణ నష్టం జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అన్ని సమస్యలను క్షేత్రస్థాయి నుంచి పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. శాఖాపరమైన సమ్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని మంత్రి.. అధికారులను ఆదేశించారు.

Read More
Next Story