తల్లికి వందనం పథకం అమలవుతుంది.. స్పష్టం చేసిన మంత్రి
x

తల్లికి వందనం పథకం అమలవుతుంది.. స్పష్టం చేసిన మంత్రి

తల్లికి వందనం పథకం అమలో ఆలస్యం ఎందుకవుతుందో ప్రభుత్వం వివరించింది. తల్లికి వందనం తప్పకుండా అమలవుతుందని తెలిపింది


తల్లికి వందనం పథకం అందించడంలో కూటమి ప్రభుత్వం సరికొత్త నిబంధనలు తీసుకొస్తుందని రెండు రోజులుగా రాష్ట్రంలో తెగ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం ఒక్కరికే ఇస్తామంటూ మాట మారుస్తోందంటూ ప్రభుత్వం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ విమర్శలపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటుగా స్పందించారు. ఇదంతా కూడా తమ ప్రభుత్వంపై బురదజల్లడానికి బ్లూ మీడియా చేస్తున్న ప్రయత్నాలేనని తోసిపుచ్చారు. అసలు తల్లికి వందనం పథకం మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఎంతమంది నేతలు ఉంటే అంతమందికి అమ్మఒడి కింద రూ.15వేలు అందిస్తామని చెప్పి ఆ తర్వాత షరతులు పెట్టి తల్లులను మోసం చేసింది వైసీపీ ప్రభుత్వం. అది కూడా 2019లో అధికారంలోకి వచ్చినప్పటికీ 2020 వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. అంతేకాకుండా పాలించిన ఐదేళ్లలో ఒక ఏడాది అమ్మఒడి ఎవరికీ ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చి 30 రోజులే అవుతుంది. అప్పుడే ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కూడా బ్లూమీడియా చేస్తున్న దుష్ప్రచారమే. తల్లికి వందనం పథకానికి మేము మంగళం పాడామంటూ వార్తలు రాస్తున్నారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు’’ అని స్పష్టం చేశారు.

తల్లికి వందనం అందిస్తాం

‘‘తల్లికి వందనం పథకం తప్పకుండా అమలు చేస్తాం. ప్రస్తుతం ఈ పథకం విధివిధానాలపై చర్చలు నిర్వహిస్తున్నాం. చెప్పిన దాని ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తాం. తల్లికి వందనం కార్యక్రమాన్ని పండగలా నిర్వహిస్తాం. మాట ఇస్తే ఏమైనా నిలబెట్టుకునే ప్రభుత్వం మాది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్లూ మీడియా కథనాలను పట్టించుకోవద్దు’’ అని కోరారు నిమ్మల రామానాయుడు. అంతేకాకుండా ఈ పథకంపై ఇప్పటి వరకు గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చామని తెలిపారు.

గెజిట్ మాత్రమే విడుదల

తల్లికి వందనంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పందించారు. ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేశామని, ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని చెప్పారు. ‘‘ప్రభుత్వ శాఖల్లో పథకాల అమలుకు ఆధార్ వినియోగించినట్లయితే ఆధార్ చట్టం ప్రకారం ముందుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారమే గెజిట్ విడుదల చేశాం. ఆధార్ వినియోగించాలంటే ముందుగా UDAI నుంచి అనుమతులు పొందాలి. లేకుంటే ఆధార్ సేవలకు అంతరాయం కలుగుతుంది. త్వరలోనే తల్లికి వందనం అమల్లోకి వస్తుంది. అందుకోసం కావాల్సిన అనుమతులు UDAI నుంచి తీసుకునే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది’’ అని ఆయన వెల్లడించారు.

Read More
Next Story