కఠిన చట్టాలు తేవాలి, వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడిన మంత్రి
వాలంటీర్ వ్యకస్థపై రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి వీరాంజనేయులు మాట్లాడారు. ఆందోళన వద్దన్నారు. ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాలంటీర్ల వ్యవస్థపై ఉత్కంఠ నెలకొనే ఉంది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి మెరుగైన వేతనం కల్పిస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల ఊసే ఎత్తలేదు. వాళ్లకి ఏం చేస్తామో కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఆఖరికి అధికారంలోకి వచ్చాక జులై 1వ తేదీని పింఛన్‌లను కూడా వార్డు మెంబర్లు, సచివాలయ సివ్వంది ద్వారా ఇళ్ల వద్దే ఇప్పించడంతో వాలంటీర్ల గుండెల్లో గుబులు మరింత అధికమైంది. వాలంటీర్ వ్యవస్థను తొలగించే దిశగానే కూటమి ఆలోచిస్తోందని అనేక మంది నమ్మారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు ఇతర మంత్రులు కూడా వాలంటీర్లు భయపడాల్సిన అవసరం లేదని, వాలంటీర్ వ్యవస్థపై చర్చించి ఒక నిర్ణయం అతి త్వరలోనే తీసుకుంటామంటూ భరోసా ఇచ్చారు. అయినా వాలంటీర్లలో టెన్షన్, కన్ఫ్యూజన్ తగ్గలేదు. ఇంతలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కావడంతో వాలంటీర్లంతా తమ గురించి ఏమైనా చర్చ ఉంటుందేమో అని ఊపిరి బిగబట్టుకుని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వారందరికీ కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది. కానీ కొన్ని మార్పులు జరుగుతాయని వెల్లడించింది.
అన్నింటినీ పునరుద్ధరిస్తాం: మంత్రి
మూడో రోజు సమావేశాల్లో భాగంగా రెండో రోజు వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సభకు నివేదించిన ప్రశ్నకు ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం తరపున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి బదులిచ్చారు. వాలంటీర్ వ్యవస్థ తప్పకుండా కొనసాగుతుందని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని వాలంటీర్లకు వేతనాలు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉంది. వాలంటీర్లు నిశ్చింతగా ఉండొచ్చు’’ అని బదులిచ్చారు. మంత్రి ఇచ్చిన సమాధానంతో వాలంటీర్లంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే దీంతో పాటు వీరాంజనేయ స్వామి మరో కీలక ప్రకటన కూడా చేశారు.
‘పథకాలన్నీ మళ్ళీ వస్తాయి’
‘వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకు ఉద్దేశించిన అనేక పథకాలను నిలిపివేసింది. వాటన్నింటిని పునరుద్ధరిస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్, బుక్ బ్యాంక్ స్కీమ్, ఎన్‌టీఆర్ విద్యోన్నతి పథకం, భూమి కొనుగోలు పథకం, భూమి అభివృద్ధి పథకం, విదేశీ విద్య, ఉచిత బల్బులు వంటి పథకాలను మళ్ళీ అమల్లోకి తీసుకొస్తాం’’ అని తెలిపారాయన. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఎస్సీ ప్రణాళిక నిధులను మళ్లించిందని, భవిష్యత్తులో మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ నిధుల మళ్లింపుకు కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కూడా పేర్కొన్నారు.