జగన్‌కు న్యాయం చేయాలి.. ప్రభుత్వానికి నాగబాబు విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లో వ్యంగ్య రాజకీయాలు మొదలయ్యాయి. అందుకు హోంమంత్రి అనిత, నాగబాబు ఎక్స్(ట్విట్టర్) పోస్ట్‌లే నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్‌లో వ్యంగ్య రాజకీయాలు మొదలయ్యాయి. వ్యక్తిగత దాడులు కాకుండా కొత్త రూట్ ఎంచుకుంటున్నారు నేతలు. తమ ప్రత్యర్థులకు నవ్వుతూ వాతలు పెడుతున్నారు. ఇప్పటికీ హోం మంత్రి వంగలపూడి అనిత.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఇదే విధంగా బదులిచ్చారు. తాజాగా ఇదే రూట్‌లోకి వచ్చారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీ సీఎం వైఎస్‌జగన్‌పై సెటైర్లు వేశారు. అమాయకులైన జగన్‌కు న్యాయం చేయడంలో కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు నాగబాబు.
ఐదేళ్లైనా నో న్యాయం
‘‘2019కి ముందు అప్పటి ఎమ్మెల్యేగా ఉండి తదనంతరం అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారి ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలినటువంటి జగన్ మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎందుకంటే 2019 లో శ్రీను అనే వ్యక్తి ఆయన మీద కోడికత్తితో దాడి చేసాడు. 5 ఏళ్లు అయిన కూడా ఆ కేస్ ఇంకా కొలిక్కి రాలేదు. అప్పుడంటే జగన్ మోహన్ రెడ్డికున్న బిజీ షెడ్యూల్ వల్ల ఆయనకు కుదర్లేదు. ఇప్పుడు ఆయన ఖాళీగానే ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆయనకి న్యాయం చెయ్యాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. కాబట్టి అతని మీద హత్యాయత్నం చేసిన నేరస్థుడికి సరైన శిక్ష విధించాలి కదా! కాబట్టి ఆయన కేస్ ని తక్షణమే విచారించి అమాయకుడు అయినటువంటి జగన్ మోహన్ రెడ్డికి న్యాయం చెయ్యవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని, సిఎంని, డిప్యూటీ సిఎంని, హోం మంత్రిని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్ చేశారు.
‘శాంతి’ భద్రతల గురించా: అనిత
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల గురించి హోమంత్రిని ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటైన ఎక్స్(ట్వీట్) చేశారు. ‘‘హోమ్ మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు, 'బొల్లి' మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది, బయటకు వస్తె, ఏమవుతుందో తెలియని దారుణ స్థితి, దీనికి బాధ్యత హోమ్ మంత్రిదే. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఇది హోం మంత్రి వైఫల్యం. నైతిక భాద్యత వహించి రాజీనామా చెయ్యాలి. ప్రభుత్వ వైఫల్యం పై కూడా గవర్నర్ విచారణకు ఆదేశించాలి’’ అంటూ విజయసాయిరెడ్డి చేసిన పోస్ట్‌కు హోంమంత్రి వంగలపుడి అనిత తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు.
‘శాంతి’ భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో, నేను రాజీనామా చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుంది. అయినా ఇది డీఎన్‌ఏ ప్రభుత్వం కాదు. ఎన్‌డీఏ ప్రభుత్వం. ప్రజలు బాగానే ఉన్నారు. దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్ మీట్లు, ఎక్స్‌లో రెట్టలు వేస్తున్నారు’’ అంటూ చురకలంటించారు. ప్రత్యర్థులను ఉద్దేశించి మొదట అనిత, ఇప్పుడు నాగబాబు ఎక్స్(ట్విట్టర్) పోస్ట్‌లు చూసిన తర్వాత ఆంధ్రలో వ్యక్తిగత దూషణ రాజకీయాలు పోయి.. వ్యంగ్య రాజకీయాలు మొదలయ్యాయనే అనిపిస్తుంది. మరి ఇవి ఎంత వరకు నడుస్తాయో చూడాలి.