మాజీ సీఎం జగన్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వరుస షాక్‌లు ఇస్తున్నారు. వరుస రాజీనామాలు చేస్తున్నారు.


వైఎస్‌ఆర్‌సీపీకి ఆ పార్టీ నాయకులు షాక్‌లు మీద షాక్‌లిస్తున్నారు. ఆ పార్టీ మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ రాజీనామా ప్రకటించిన వెంటనే మరో సీనియర్‌ నాయకుడు రాజీనామా చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు జగన్‌కు పంపారు.

గ్రంధి శ్రీనివాస్‌ ఇది వరకు జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ను ఓడించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ రెండు చోట్ల పోటీ చేశారు. గాజువాక అంసెబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగిన పవన్‌ కల్యాణ్‌ భీమవరం నుంచి కూడా పోటీ చేశారు. అయితే ఈ రెండు చోట్లా పవన్‌ కల్యాణ్‌ పరాజయం పాలయ్యారు. భీమవరం నుంచి బరిలోకి దిగన పవన్‌ కల్యాణ్‌ను వైఎస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్‌ ఓడించారు. పవన్‌ కల్యాణ్‌తో పాటు టీడీపీ నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులను ఓడించి 8వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన పులపర్తి ఆంజనేయులు చేతిలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్‌ ఓటమి పాలయ్యారు. అయితే వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో పవన్‌ కల్యాణ్‌పై ఒంటికాలితో లేచిన వాళ్లల్లో గ్రంధి శ్రీనివాస్‌ ఒకరు. పవన్‌ కల్యాణ్‌పైన అనేక సవాళ్లు కూడా విసిరారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రంధి శ్రీనివాస్‌పైన ఐటీ దాడులు జరిగాయి. ఐటీ అధికారులు ఆయన నివాస గృహాల్లో సోదాలు నిర్వహించారు. గ్రంధి శ్రీనివాస్‌ బిజినెస్‌ పార్ట్‌నర్స్‌తో పాటు ఆయన అనుచరుల ఇళ్లల్లోను సోదాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ శివార్లలో ఉన్న ఆయన ఆక్వా సంస్థ బీవీఆర్‌ ఆక్వా సంస్థలోను సోదాలు నిర్వహించారు. నాటి నుంచి వైఎస్‌ఆర్‌సీపీతో అంటీముట్టనట్టుగా ఉన్న గ్రంధి శ్రీనివాస్‌ ఆ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రంధి శ్రీనివాస్‌ వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.
Next Story