
ఏపీలో మహిళా రైడర్లకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ నగరాలలో మహిళా డ్రైవర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా తొలిదశలో 300 మంది డ్రైవర్లను నియమిస్తారు
ఆంధ్రప్రదేశ్ లో మహిళా డ్రైవర్లు (రైడర్లు) అందుబాటులోకి రానున్నారు. ఇప్పటి వరకు పురుషులు మాత్రమే నగరాలు, పట్టణాల్లో రవాణా సేవలు అందిస్తున్నారు. ఇకపై ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి రవాణా సంస్థలు మహిళా డ్రైవర్లను నియమించనున్నాయి. ఇప్పటి వరకు ఈ తరహ వాహనలను నడిపేది ఎక్కువగా పురుషులే కావడంతో మహిళలు వాటిపై వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. అటువంటి వారికి ఉపశమనం కలిగించేలా పలు రవాణా సేవలందిస్తున్న సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో త్వరలో మహిళా రైడర్లు రానున్నారు. స్త్రీల అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని మహిళా రైడర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా స్వయం సహాయ సంఘాల సభ్యుల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు సమకూర్చనుంది. వీరిని ర్యాపిడో సంస్థతో అనుసంధానించేలా ఒప్పందం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా మహిళల ఉపాధికి ఊతం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఈ కార్యక్రమం కింద విశాఖపట్నం, విజయవాడల్లో 400 చొప్పున ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు కేటాయించనున్నారు. మరో 200 వాహనాలను రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో అందజేస్తారు. ముద్ర, స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా సభ్యులకు రుణాలు అందించి వాహనాలు కొనుగోలు చేయిస్తారు. ర్యాపిడో సంస్థతో చేసుకుంటున్న ఒప్పందం ప్రకారం మొదటి మూడు నెలలూ వాహనాలు నడిపేవారు ఆ సంస్థకు ప్లాట్‌ఫాం ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాతి నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలి. ఒక్కో వాహనానికి నెలకు 300 బుకింగ్‌లు ర్యాపిడో సంస్థ ఇవ్వనుంది.
ఈ నిర్ణయం పట్ల పలు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. స్త్రీల సాధికారితకు ఇది నిదర్శనంగా రాష్ట్ర మహిళా సంఘం నాయకురాలు జి.ఝాన్సీ చెప్పారు. దీనివల్ల మహిళలకు భద్రతతో పాటు ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
Next Story