
ఒంగోలు గిత్తపై గుజరాతీ వ్యాపారం: చంద్రబాబు చూపిస్తారా సత్తా?
బ్రెజిల్ లో ఒంగోలు గిత్తకి 41 కోట్ల ధర పలికిందని సంబరపడాలో పురిటిగడ్డపై అంతరించిపోతోందని క్షోభ పడాలో తేల్చుకోవాల్సిన సమయం. చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి మరి.
మీలో ఎంతమంది గమనించారో గాని మన ఊళ్లల్లో చాలా మంది ఇళ్ల గడపల మీద ఒంగోలు గిత్తలతో ఆ ఇంటి యజమాని దిగిన పెద్ద ఫోటోలు వేలాడుతుంటాయి. చూడచక్కని అందమైన ఎడ్ల ముగుతాడో, పగ్గాలో పట్టుకునో రైతులు ఫోటోలు దిగి వాటిని అపురూపంగా దాచుకుంటుంటారు...
గ్రామాల్లో రచ్చబండ మీద కూర్చొనే వయసు మీరిన పెద్దోళ్లు, ఎవరైనా కుర్రోళ్లని చూసినప్పుడల్లా.. వీళ్లేవరో ఒంగోలు గిత్తల్లా ఉన్నార్రా అనడం, దానికి కుర్రోళ్లు మీసాలు మెలేయడం చాలా మామూలుగా కనిపించే దృశ్యం.
అంతగా ప్రసిద్ధి గాంచిన పేరు ఒంగోలు జాతి గిత్త. ఈ గిత్తలకు ఇప్పుడు గ్రహణం పట్టింది గాని ఒకప్పుడు ఈ గిత్తలు ఇంటి ముందుంటేనే ఓ అందం చందం అనుకునే వారు వ్యవసాయదారులు.
అటువంటి ఒంగోలు జాతి గిత్త ఒకటి- బ్రెజిల్‌లో ఇటీవల నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.41 కోట్ల ధర పలికింది. దీనికి మురిసిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.. 'చూశారా, మా గిత్త ప్రపంచ వేదికపై సత్తా చాటిందని' సంబరపడ్డారే గాని మన రాష్ట్రం నుంచి తరలిపోయిన ఒంగోలు జాతి గిత్తలకి, ఆవులకి పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పలేదు. ఈ గిత్తలు మనవి ఎలా అయ్యాయో, అవి బ్రెజిల్ లో ఎందుకు ఫేమస్ అయ్యాయో, ఇక్కడెందుకు కనుమరుగయ్యాయో చూద్దాం.
ఒంగోలు గిత్త.. తెలుగు జాతికి గర్వకారణమైన ఆవు జాతి. ఒంగోలు జాతి గిత్తలకు పురిటి గడ్డ ఆంధ్రప్రదేశ్. ఒంగోలు జాతి ఎద్దులు (ఆంబోతులు) పశువుల్లో రారాజు. దర్పానికి,రాజసానికి పెట్టింది పేరు. భారీ శరీరంతో రాజఠీవి ఉట్టిపడే ఎద్దులు, నమ్రతగా నడిచే ఆవులు, ముద్దుముచ్చటగా ఉండే పెయ్యిలు.. పశు జాతులకే గర్వకారణం. ఇవి ఉంటే తమ ఇంట సిరులున్నట్టేనని మురిసిపోే రైతులు.. నిలువెత్తు అందం, బలమైన దేహ దారుడ్యం, కష్టించి పనిచేసే తత్వం వీటి సొంతం. ఖండాంతర ఖ్యాతి పొందిన ఈ జాతి అనేక దేశాలకు విస్తరించింది.
దాదాపు 1,000 -1,200 వందల కిలోల బరువుండే ఒంగోలు గిత్తలు బలిష్టంగా ఉంటాయి. ఎండ వేడిని తట్టుకుంటాయి. రోగాలకు రొష్టులకు తేలిగ్గా లొంగవు. కాడి మెడ మీద పెడితే ఎకరం పూర్తయ్యే వరకు ఆగవు. పందెపు బండ కడితే గెలిచే వరకు నిద్రపోవు. ఇంటి పెరట్లో ఆవులుంటే పాలకు ఢోకా లేదు. కరవు రోజుల్లోనూ తిండికి కరువుండేది కాదు.
ఒంగోలు గిత్తల పుట్టిల్లు నెల్లూరు..
తెలుగువారు పౌరుషానికి ప్రతీక ఒంగోలు జాతి గిత్త. ప్రపంచ ఖ్యాతి వీటి సొంతం. రుగ్వేద కాలం నాటికే ఈ జాతి పశువులను పెంచినట్లు చరిత్రకారుల అభిప్రాయం. ఒంగోలు జాతి ఆబోతు శివాలయాల్లో నంది విగ్రహాన్ని పోలి ఉంటుంది. సింధూ నాగరికత చిహ్నాల్లోనూ, అమరావతి స్థూపంలోని రాతి శిలల్లోనూ ఈ జాతిని పోలిన చెక్కడాలు కన్పిస్తాయి. 13వ శతాబ్ధానికి ముందే తొలి శాతవాహనుల కాలం నుండే ఒంగోలు పశువులు ఉన్నాయని చెప్తుంటారు.
ఒంగోలు జాతి పశువుల స్వస్థలం ఒకప్పటి నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, పల్నాడు తాలూకాలు. వినుకొండ సమీపంలోని గుండ్లకమ్మ-పాలేరు నదుల మధ్య ప్రాంత గ్రామాల్లో ఈ జాతి అధికంగా ఉండేది. ఈ జాతి గౌరవార్ధం 1993లో కేంద్ర ప్రభుత్వం తపాలా కవరు విడుదల చేసింది. మన ఒంగోలు గిత్త గర్వంగా నిలబడి తెలుగుజాతి శక్తిని ప్రపంచానికి చాటిచెబుతుంది. హాలాండ్ దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పొతురాముడు అనే పేరుతో మనగిత్త విగ్రహం ఏర్పాటు చేశారంటేనే మన ఒంగోలు గిత్త గొప్పదనం తెలుస్తోంది. ఒంగోలు జాతి గౌరవార్ధం బ్రెజిల్ లో ABCZ వారు స్టేడియం నిర్మించారు.
ఒంగోలు జాతి ప్రత్యేకతలు.. ఈ జాతి పశువులు +40 సెంటీగ్రేడు ఉష్ణోగ్రతనైనా, - 40 సెంటీగ్రేడు వణికించే చలినైనా తట్టుకోగలవు. పెద్ద గంగడోలు, బొడ్డుపై ఉండే చర్మం, ఎక్కువ స్వేదగ్రంధులు, మెరిసే సిల్కులాంటి వెంట్రుకలు ఇందుకు కారణం. అధిక ఉష్ణోగ్రతలోనూ, అతివృష్ఠి, అనావృష్ఠిని తట్టుకుని వ్యవసాయ పనులు చేస్తాయి. ఒంగోలు జాతి ఆవు పాలు (A2) పాలుగా బాగా ప్రాచుర్యం పొందాయి.
మనం మరచినా రచ్చగెలుస్తున్న ఒంగోలు గిత్త.. ఇక ఎద్దులు శివుని వాహనమైన నందిని పోలిఉంటాయి. ఇవి ఎటువంటి వాతావరణ పరిస్ధితుల్లోనైనా తట్టుకుని నిలబడగలవు. శారీరక దారుఢ్యం, సామర్థ్యాలలో దీనికి మించిన జాతి లేదు. పట్టుదలకు పెట్టింది పేరు. అందచందాలలో దీనికిదే సాటి. ఆప్యాయత, అనురాగాలు పంచటంలో దానికదే మేటి. ఉల్లాస ఉత్సాహాలు దీని సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు రైతులకు ఇది ఆత్మబంధువు. అదే ఒంగోలుజాతి. ఒంగోలు గిత్త పేరు వినగానే మన కళ్ల ముందు ఎతైన మూపురం (చెండు)తో, పెద్ద గంగడోలుతో, సౌందర్యం, రాచఠీవి ముప్పిరిగొన్న ఒక నిండైన విగ్రహం కనపడుతోంది.
ఒంగోలు గిత్తలు (Ongole breed) శతాబ్దాల పాటు ముఖ్యమైన పశుజాతి. ఈ జాతి విశిష్ట లక్షణాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బ్రెజిల్ దేశంలో ఒంగోలు జాతికి ప్రత్యేకమైన ఆదరణ ఏర్పడింది. 19వ శతాబ్దం చివర్లో, 20వ శతాబ్దం ప్రారంభంలో, బ్రిటిష్ పాలకులు, విదేశీ వ్యాపారులు భారతదేశంలోని పశువుల చారల్ని, సంతతుల్ని అధ్యయనం చేశారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ప్రాంతాల్లోని ఒంగోలు గిత్తలు ప్రత్యేకమైన శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నాయని గుర్తించారు.
ఎగుమతి ఎలా మొదలైంది?
బ్రిటిష్ వాణిజ్య సంస్థలు 1860-1900 మధ్యకాలంలో భారతదేశంలోని పశువులను అనేక దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాయి. ఒంగోలు గిత్తల బలమైన దేహ దారుఢ్యం, వేగంగా ఎదిగే తీరు, శ్రమశక్తి, మాంసం నాణ్యత మొదలైన విశేష గుణాల వల్ల ఈ జాతి బ్రెజిల్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి అయింది.
ముఖ్యంగా 1875-1900 మధ్యకాలంలో బ్రెజిల్‌కు తొలిసారిగా ఒంగోలు గిత్తలు ఎగుమతి అయ్యాయి. మొదట ఈ పశువులను బ్రిటన్, పోర్చుగీస్ వ్యాపారులు కొనుగోలు చేసి, దక్షిణ అమెరికా (బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో) దేశాలకు నౌక ద్వారా రవాణా చేశారు.
బ్రెజిల్‌లో ఒంగోలు గిత్తల ప్రాధాన్యత ఎలా పెరిగింది?
ఒంగోలు గిత్తల వేగంగా ఎదిగే లక్షణం, మాంసం నాణ్యత, ఎండలకు తట్టుకునే శక్తి వంటి లక్షణాల కారణంగా, బ్రెజిల్‌లో ఈ జాతిని పెద్ద ఎత్తున పెంచడం ప్రారంభించారు. ఒంగోలు గిత్తల ఆధారంగా కొత్త జాతులను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా బ్రాహ్మణ్ కాటిల్ (Brahman Cattle) అనే జాతి ఒంగోలు గిత్తల నుంచే పుట్టింది. ప్రస్తుతం బ్రెజిల్‌లో పెంచుతున్న 80% కంటే ఎక్కువ పశువులు ఒంగోలు జాతి నుంచి పుట్టినవే. వీటిని మాంసం కోసం వినియోగిస్తున్నారు.
బ్రెజిల్ లో నెల్లూరు క్యాటిలనే పిలుస్తారు...
ఇప్పుడు బ్రెజిల్‌లో "Ongole" అనే పేరుకన్నా, ఈ జాతిని "Nelore" లేదా "Nellore Cattle" అనే పేరుతో పిలుస్తున్నారు. బ్రెజిల్ ఈ పశువులను అత్యధికంగా ఉత్పత్తిచేస్తోంది. ప్రపంచానికి నూతన శ్రేణి మాంస ఉత్పత్తి పశువులను అందిస్తోంది. చిత్రమేమిటంటే బ్రెజిల్ ఈ జాతిని అభివృద్ధి చేసి, ఇప్పుడు భారతదేశానికే తిరిగి ఎగుమతి చేస్తున్నది! బ్రెజిల్ దేశానికి మాత్రం కామధేనువులే అవుతున్నాయి. భారత దేశం నుంచి దిగుమతి చేసుకున్న ఒంగోలు గిత్తలను జన్యుపరంగా అభివ్రుద్ధి చేసి, ఇతర దేశాలకు విక్రయించి కోట్లరూపాయలు ఆర్జిస్తోంది బ్రెజిల్. భారత దేశం నుంచి ఒంగోలు గిత్తల పిండాల దిగుమతికి కూడా ఇపుడు బ్రెజిల్ చెన్నైలోని నేషనల్ బయోడైవర్సిటీ అథారటీని కోరుతోంది. బ్రెజిల్ విజ్ఞప్తిని పరిశీలించడానికి అధికారులు ఒక నిపుణుల కమిటీని నియమించింది.
తరలిపోతున్న వందల కోట్ల విలువైన సంపద...
2000 సంవత్సరంలో నేషనల్ బయోడైవర్సటీ చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఈ గిత్తల వీర్యం బయటి దేశాల వారు తీసికెళ్లడంపై నిఘా పెరిగింది. గతంలో స్థానిక రైతులు ఒంగోలు గిత్తల్ని మూడు నాలుగు లక్షలకే విదేశీయులకు అమ్ముకునేవారు. ఈ గిత్తల్ని దిగుమతి చేసుకున్న బ్రెజిల్ వాటినుంచి నాణ్యమైన ఒంగోలు దూడలను ఉత్పత్తి చేసి విదేశాలకు విక్రయిచేది. ఈ వ్యాపారం ఆ దేశానికి కామధేనువే అయింది. ప్రతి ఏటా ఐదు వేల యూనిట్ల ఒంగోలు గిత్తల (5,000 పిండాలు) పిండాలను ఎగుమతి చేయవలసిందిగా బ్రెజిలియన్లు కోరుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఒంగోలు గిత్తల వీర్యం ఒక్కో యూనిట్ ధర ఐదువేల డాలర్లు ఉంటుంది. నేటి ప్రపంచ మార్కెట్లో 5000 డాలర్లు (4లక్షలకు పైమాటే)కు అమ్ముకుంటున్నారు. ఒంగోలు గిత్తల మాంసాన్ని ఎగుమతి చేసే దేశాల్లో బ్రెజిల్ ముందు వరసలో ఉందని ఏపీ బయోడైవర్సటీ బోర్డు మాజీ చైర్మన్ హంపయ్య గతంలోనే చెప్పారు. బ్రెజిల్ లో 15 కోట్లకు పైగా ఒంగోలు రకం ఆవులు, గిత్తలున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యికి మించి నాణ్యమైన ఒంగోలు గిత్తలు లేవని కూడా హంపయ్య 2015-16 ప్రాంతంలో చెప్పారు.
ఒంగోలు గిత్తల నుంచి ఉత్పత్తి చేసిన గిత్తలకు గతంలో బ్రెజిల్‌లో ఎక్కడైనా రూ. 6 నుండి 11 కోట్ల రూపాయల మేరకు ధర ఉంటే ఇప్పుడది 35 నుంచి 41 కోట్ల రూపాయల మధ్య ఉంది. సరిగ్గా అదే సమయంలో ఒంగోలు జాతి గిత్తలకు పురిటి గడ్డయిన ఆంధ్రప్రదేశ్‌లో సంకరజాతి పశువులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఒంగోలు గిత్తలను సంరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు లోక్ సభలో చెప్పారు. ఒంగోలు గిత్త బ్రిడ్ ను బ్రెజిల్ కు ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మనదేశంలో వీటి సంఖ్య పెంచేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు.
గుజరాత్ దళారీలే ఒంగోలు గిత్తల పాలిట శాపాలు..
ఆంధ్ర ప్రదేశ్ జీవవైవిధ్య బోర్డు పరిశోధనలు ప్రకారం బ్రెజిలియన్స్ కోసం పనిచేసే గుజరాత్ హైటెక్ దళారీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి చట్టవిరుద్ధంగా ఒంగోలు జాతి ఆవులు, గిత్తలు అమాయక రైతుల నుంచి కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్ పశు సంవర్థక శాఖ అనుమతి లేకుండా భావనగర్ పంపుతున్నారు. పశువుల కొనుగోలుకు, వీర్య సేకరణ ద్వారా పిండాల తయారీకి బ్రెజిల్ పశువుల పెంపకందారులు నిధులు సమకూర్చుతారు. ఇందుకోసం భావనగర్ లో ఓ అనధికార ప్రయోగశాలే నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి నుంచే అక్రమంగా బ్రెజిల్ కి ఒంగోలు జాతి గిత్తల పిండాలు రవాణా అవుతున్నాయని సమాచారం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో గోవధ నిషేధచట్టం ఉంది. అక్రమ బ్రీడింగ్ పై నిషేధం ఉంది. ఆచరణలో పాలకులకు చిత్తశుద్ధి లేక పోవడం, నిర్లక్ష్యం కారణంగా విదేశాలకు మన ఒంగోలు జాతి అండపిండాలు తరలిపోతున్నాయి. దీన్ని తక్షణమే అరికట్టకపోతే మనకు ఒంగోలు గిత్త కనిపించకపోవచ్చు.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా భారతదేశ పాలకులు- అసలు ఒంగోలు జాతి ఆవులు, గిత్తలు గురించి నిజం చెప్పటం లేదు. అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవులు, గిత్తలను సంరక్షించి, వాటి సంతతిని పెంచాలని ఒంగోలు జాతి గిత్తల పరిరక్షకులు కోరుతున్నారు. ఒంగోలు గిత్తలు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుండి ప్రారంభమై, ప్రస్తుతం బ్రెజిల్ వ్యవసాయ, పశుసంవర్ధక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ ఈ విలువైన భారతీయ జాతి మనదేశంలో క్షీణిస్తున్నదనే మాట వాస్తవం. ప్రభుత్వాలు, రైతులు కలిసి పనిచేస్తే ఒంగోలు గిత్తల గొప్పతనాన్ని తిరిగి నిలిపేందుకు అవకాశం ఉంటుంది.
ఒంగోలు జాతికి మనం రుణపడి ఉన్నాం. కానీ ఆ జాతి మనకు రుణపడి లేదు. మనమే కళ్ళు తెరచి ఆ జాతిని సంరక్షించుకోవాల్సి ఉంది.
Next Story