గున్నమ్మ తుపాకీ ఎక్కుపెడితే..
x
Source: Twitter

గున్నమ్మ తుపాకీ ఎక్కుపెడితే..

స్వాతంత్ర మహోద్యమ చరిత్రలో సిక్కోలు ఓ పేజీ లిఖించిందా..? స్వాతంత్ర్య సిద్ధి కోసం తెల్లదొరలను ఎదిరించి ప్రాణత్యాగం చేసిన సిక్కోలు వీరనారి ఎవరు..?


(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: దేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం కోసం… తెల్లదొరలను ఎదిరించి నిలిచి అసువులు బాసిన అమరులెవరని ఈ తరంవారిని అడిగితే... మహా అయితే ఓ ఐదు ఆరుగురి పేర్లు చెబుతారు. కానీ వందల వేల మంది స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేశారు. తమ సర్వస్వం దేశం కోసం, దేశ ప్రజల స్వేచ్ఛ కోసం కోల్పోయారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు ఎందరో అమరుల త్యాగ ఫలమే. స్వరాజ్య సాధన కోసం ఎందరో తమ ప్రాణాలను తృణప్రాయంగా విడిచిపెట్టారు. ఆసేతు హిమాచలం వలస దేశాల పాలనకు వ్యతిరేకంగా మూడున్నర శతాబ్దాల పాటు జరిగిన జాతీయ ఉద్యమంలో ఎందరో సమరయోధులు నేలకొరిగారు.

స్వాతంత్య్రానికి ముందు దేశంలో ఎన్నో రైతు పోరాటాలు జరిగాయి. కొందరు నేరుగా బ్రిటిషర్లతో పోరాటం చేయగా.. మరికొందరు స్థానిక జమీందార్లతో పోరాటం చేశారు. కానీ సిక్కోలు ముద్దు బిడ్డ అయిన వీరనారి గున్నమ్మ అటు జమీందార్లతో.. ఇటు బ్రిటిషర్లతో పోరాటం చేసింది. రైతుల కోసం చేసిన పోరాటంలో నిండు గర్భిణి అయిన ఆమె తూటాలకు బలయ్యారు.

ఎవరి వీర గున్నమ్మ...

వీర గున్నమ్మగా.. వీరనారి సానుమాను గున్నమ్మగా పేరొందిన గున్నమ్మ.. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని గుడారి రాజమణిపురంలోని రైతు కుటుంబంలో జన్మించారు. రైతుల తరఫున జమీందార్లతో పోరాడిన ఆమె.. 1940, ఏప్రిల్‌ 1న చరిత్రాత్మక మందస రైతు పోరాటంలో జరిగిన కాల్పుల్లో అసువులు బాసారు. ఆమెకు గుర్తుగా ఆ గ్రామాన్ని వీరగున్నమ్మ పురంగా పిలుస్తున్నారు. పదేళ్ల వయసులోనే గున్నమ్మకు మాధవయ్యతో వివాహం జరిగింది. పెళ్లయ్యాక భర్త ఉపాధి కోసం బర్మా వెళ్లారు. కొంత కాలం తర్వాత తిరిగొచ్చిన ఆయన.. కరువు రావడంతో మళ్లీ రంగూన్ వెళ్లారు. అప్పటికీ ఆమె మూడు నెలల గర్భిణి. అయితే రంగూన్ వెళ్లిన కొంత కాలానికి మాధవయ్య అక్కడే చనిపోయారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా.. గున్నమ్మ ధైర్యం కోల్పోలేదు.

కష్టాల్లో ఉన్న రైతుల కోసం ఆమె పోరాడారు. అసలే కరువు.. పంటలు లేక అల్లాడిపోతున్న రైతులు.. సమీపంలోని అడవుల నుంచి కలప తెచ్చుకున్నా సరే జమీందార్లకు శిస్తు కట్టాల్సి వచ్చేది. అటవీ ఉత్పత్తులపైనా బ్రిటిషర్లు పన్నులు వసూలు చేసేవారు. దీంతో రైతుల్లో అసంతృప్తి మొదలైంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత వారిది. ఇలాంటి పరిస్థితుల్లో.. 1940 మార్చి చివరి వారంలో పలాసలో అఖిల భారత కిసాన్‌ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ సభల్లో మందస ప్రాంత రైతులు విరివిగా పాల్గొన్నారు. ఎన్‌జీ రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు, గౌతు లచ్చన్న, మార్పు పద్మనాభం తదితరుల నాయకత్వంలో గుడారి రాజమణిపురంలో రైతు సభను నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న గున్నమ్మ.. జమీందార్ల అరాచకాలపై గొంతెత్తారు.

అడవి నుంచి వంద ఎడ్ల బండ్లపై కలప తీసుకొద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దామని ఆమె రైతులకు పిలుపునిచ్చారు. గున్నమ్మ నాయకత్వంలో రైతులు భారీ సంఖ్యలో అడవి బాట పట్టారు. దీంతో జమీందారు కలవరానికి లోనయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఆపాలని దివాన్ రామకృష్ణదేవ్‌ను, ఫారెస్ట్‌ రేంజర్‌ కృష్ణచంద్రరాజుకు హుకుం జారీ చేశారు. ఫారెస్ట్ రేంజర్ ఆదేశాలను పట్టించుకోకుండా.. గున్నమ్మ నాయకత్వంలోని రైతులు అడవి నుంచి కలప తరలించారు. దీంతో ప్రజలు ఆమె నుదుట వీర తిలకం దిద్దారు. ఆమెపై రైతు సంఘాల నాయకులు ప్రశంసలు గుప్పించారు. దీంతో1940 మార్చి 30న తాలుకా మెజిస్ట్రేట్, ఎస్‌ఐ, బ్రిటీష్‌ పోలీసులతో కలిసి ఊళ్లోకి వచ్చారు. తనిఖీలు నిర్వహించి ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

ఏప్రిల్‌ ఒకటిన సబ్‌కలెక్టర్‌, పోలీసులు ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చారు. కేసు నమోదైన వారిని జైలుకు తరలించే ఏర్పాట్లు చేశారు. రైతులంతా ఎదురు తిరిగారు. ఆ తర్వాత రైతు సంఘం నాయకులు మార్పు పద్మనాభం, జగన్నాథం, మహంతి నారాయణలను అరెస్టు చేయడంతో రైతులు, బ్రిటీష్‌ పోలీసులకు మధ్య భీకర పోరు జరిగింది. పోలీసుల వాహనానికి ఎదురు నిలిచి అడ్డుకున్నారు గున్నమ్మ. తుపాకీ ఎక్కు పెట్టినా సరే.. గున్నమ్మ పక్కకు తప్పుకోలేదు. భయపెట్టడం కోసం గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా ఆమె వెనక్కి తగ్గకపోవడంతో.. జమీందారు ఆదేశాలతో కాల్పులు జరిపారు. తూటాలు ఆమె పొట్టలోకి దూసుకెళ్లాయి. దీంతో గున్నమ్మ అక్కడికక్కడే అసువులు బాసింది. ఈ కాల్పుల్లో గున్నమ్మతోపాటు రైతులు గొర్లె జగ్గయ్య, కర్రి కలియాడు, గుంట చిననారాయణ, గుంట చక్రపాణి వీరమరణం పొందగా.. కానిస్టేబుల్‌ దొడ్డాల రంగారావు కూడా మృతిచెందాడు.

స్మృతి చిహ్నంగా గ్రామం...

తెల్ల దొరలు, జమీందారుల అరాచకాలపై రైతుల పక్షాన నిలబడి పోరాడిన వీరనారి గున్నమ్మ స్మృతి చిహ్నంగా గుడారి రాజమణిపురంను వీరనారి గున్నమ్మ పురంగా మార్పు చేశారు. గున్నమ్మ పోరాటానికి గుర్తుగా.. గ్రామంలోకి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ద్వారంపై ఆమె చిత్రాలను చెక్కారు. 1988 సెప్టెంబరు 10న నాటి గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషి ఆ గ్రామాన్ని సందర్శంచి శిలా ఫలకాలను ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లాలో నేటికీ గున్నమ్మ స్వాతంత్రోద్యమ పోరాటాన్ని కథలు కథలుగా ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు.

Read More
Next Story