డిప్యూటీ సీఎంకు హరిరామ జోగయ్య లేఖాస్త్రం.. సంక్షేమ ఫలాలపై సూచన..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖలో హరిరామ జోగయ్య పలు సూచనలు చేశారు. కాపు రిజర్వేషన్లు తీసుకురావాలని కోరారు. సినిమాలు మానుకోవద్దని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హరిరామ జోగయ్య శాస్త్రి సంధించే లేఖాస్త్రాలకు ప్రాముఖ్యత ఉంది. ఎన్నికల సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖల కారణంగా ఆయన తీవ్ర ట్రోలింగ్, విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా మౌనముద్రను ధరించారు. ఇంతలో రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి కావడం. వాటిలో కూటమి ప్రభుత్వం అద్భుతమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు మరోసారి హరిరామ జోగయ్య తన లేఖాస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆయన తొలిసారి ఓ లేఖ రాశారు. అందులో పలు కీలక సూచనలు చేశారు. తాను ఇప్పుడు రాస్తున్నది పూర్తిస్థాయి రాజకీయ విశ్లేషణాత్మక లేఖ అని జోగయ్య చెప్పడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. ముందుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలిపారు ఆయన.
సంక్షేమాలు ఎలా ఉండాలంటే!
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన నూతన ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లల్లో పరుగులు పెట్టిస్తుందని భావిస్తున్నా. సంక్షేమ ఫలాలు అంటే ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలే తప్ప వారిని చేతకాని వారిని చేస్తూ నేతలకు రాజకీయ లబ్ధి చేకూర్చే వాటిలా ఉండకూడదు. అభివృద్ధి కూడా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా రాష్ట్ర నలుమూలలా వ్యాపించాలి. అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది లేకుంటే ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుంది’’ అని వివరించారాయన.
రిజర్వేషన్లు ఇస్తారనుకుంటున్నా
‘‘అదే విధంగా ఈ నూతన ప్రభుత్వం కొంతకాలంగా కాపులు కోరుతున్న ఐదు శాతం రిజర్వేషన్లను అందిస్తుందని ఆశిస్తున్నా. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, వారిని బీసీల్లో చేరుస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అది జరగలేదు. అందుకు కారణాలు తెలియవు. అది ఇప్పుడైనా సాధ్యమవుతుందని కోరుకుంటున్నా’’ అని తన లేఖలో రాసుకొచ్చారు. అదే విధంగా తన లేఖలో హరిరామ జోగయ్య మరికొన్ని వినతులు కూడా చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం ప్రయత్నించడమే కాకుండా కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగ పేరు పెట్టాలని కోరారు.
సినిమాలు మానొద్దు
పరిపాలన, రాజకీయాలు, ప్రభుత్వాలు అంటూ సినిమాలు చేయడం మానుకోవద్దని హరిరామ జోగయ్య.. కోరారు. సగం రోజులు పరిపాలనకు, మరో సగం రోజులు సినిమాలకు కేటాయించుకుంటూ అటు హీరోగా, ఇటు లీడర్‌గా కొనసాగాలని తెలిపారు. అదే విధంగా చేసే సినిమాలు కూడా సమాజానికి ఉపయోగపడేవి, సందేశాత్మకంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. సినిమాలు ప్రజలను ముఖ్యంగా యువతను ఎంతగానో ప్రభావితం చేస్తాయని, వాటి ద్వారా యువతను సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నించాలని చెప్పారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
వాటితో పాటుగా రాష్ట్రంలో నిర్వీర్యమైన జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ రాజ్ వ్యవస్థలను ఆ శాఖ మంత్రిగా బలోపేతం చేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీసులు మొదలు జిల్లా కలెక్టర్ భవనాలను, సచివాలయ కట్టడాలను సమకూర్చాలని, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. దాంతో పాటుగా రోడ్లు, డ్రైనేజీలు, సాగు నీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి సౌకర్యాలను కూడా కల్పించాలని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చాలని చెప్పారు. అయితే హరిరామ జోగయ్య లేఖపై డిప్యూటీ సీఎం పవన్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరి లేఖలో జోగయ్య కోరిన రిజర్వేషన్ల అంశంపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.