ఆయన రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారా?
గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారా? అందుకే టిక్కెట్ దక్కలేదా? ఎంపిగా, ఎమ్మెల్యేగా గెలిచినా ఈ సారి టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదు?
జి. విజయ కుమార్
తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారా? వైఎస్సార్‌సీపీ ఎందుకు ఆయనకు సీటు ఇవ్వలేదు. సీఎం జగన్ రెండు సార్లు అవకాశం కల్పించి గెలిపించారు. ఎందుకు జనం మనసుల్లో నిలబడలేకపోయారు. ఐఏఎస్ అధికారిగా కూడా గొప్పపనులేవీ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. తన సర్వీసులో తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని ప్రతి ఐఏఎస్ అధికారి కోరుకుంటారు. ఎప్పుడూ లూప్‌లైన్‌లో ఉండటం తప్ప స్టీమ్‌లైన్‌లో పనిచేసిన దాఖలాలు లేవు. చాలా మందికి ఐఏఎస్ అధికారిగా కూడా తెలియదు. తిరుపతి ఎంపీగా 2014లో గెలిచిన వరప్రసాదరావుకు తిరిగి తిరుపతిలో సీటు ఇవ్వలేదు. ఎమ్మెల్యే అభ్యర్థిగా 2019లో గూడూరు నుంచి పోటీ చేసి గెలిచారు. అయినా పార్టీలో మార్కులు సంపాదించుకోలేకపోయారు. అటు అధికారిగాను, ఇటు రాజకీయాల్లోనూ ఫెయిల్ అయ్యారనే విమర్శలు వచ్చాయి.
2019 మార్చిలో వరప్రసాదరావు ఎన్నికల ప్రచారంలో ఉండగా వింతగా ప్రవర్తించినట్లు అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయి. అసలే ఎండాకాలం కావటం, అందులోనూ పొలిటికల్ హీట్ కాక రేపుతున్న తరుణంలో నేతలు ఎక్కడికక్కడ తమ ప్రసంగాలతో పిచ్చెక్కిస్తుంటారు. అయితే వరప్రసాదరావు అప్పట్లో అచ్చం పిచ్చిపట్టిన వ్యక్తిలా ప్రవర్తించి స్థానికులకు చుక్కలు చూపించడం విస్మయానికి గురి చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయమే ఒంటరిగా వీధుల్లోకి వచ్చిన ఆయన వింతగా ప్రవర్తించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన 2019 మార్చి 30 గూడూరులో జరిగింది.
పార్టీ మారేందుకు రెడీ..
టికెట్లు దక్కక పోతే పార్టీలు మారడం అనేది పరిపాటిగా మారింది. దీనికి ఆయన కూడా అతీతుడేమీ కాదు. అందరి నేతల్లానే ఆయన కూడా పార్టీ మారేందుకు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీలో 10 ఏళ్ల పాటు ప్రజా ప్రతినిధిగా ఉన్న వరప్రసాదరావు 2024 ఎన్నికల్లో టికెట్ రాకపోయే సరికి పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీలో ఆయనకు ఏ నియోజకవర్గంలోనూ సీటు దక్కే అవకాశం కనిపించడం లేదు.
బిజెపి వైపు వరప్రసాదరావు చూపు
గూడూరు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా మేరిగ మురళికి సీటు లభించింది. ఆయన ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో వరప్రసాదరావు అసంతృప్తికి గురయ్యారు. ఆయన పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చారు. తొలుత జనసేనలోకి వెళ్లాలని భావించారు. గతంలో ఆయనకు పవన్ కళ్యాణ్‌తో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే ఆ పార్టీ పెద్దల నుంచి సరైన హామీ రాలేదు. పార్టీలోకి అయితే ఆహ్వానించినట్లు సమాచారం. సీటు విషయంలో మాత్రం జనసేన గ్యారెంటీ ఇవ్వలేక పోయింది. దీంతో ఆయన ఆలోచన మార్చుకున్నారు.
బిజేపీలోకి వెళ్లాలని భావించారు. బిజేపీ తరఫున గూడూరు అసెంబ్లీ నియోజక వర్గానికి కానీ, తిరుపతి పార్లమెంట్ స్థానానికి కానీ పోటీ చేయాలనేది ఆయన ఆలోచన. బీజేపీ పెద్దలను కూడా సంప్రదించారు. ఇటీవల బిజెపీ రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరిని కలిశారు. దీంతో పార్టీ మారడం ఖాయమని వైఎస్సార్‌సీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సీటు విషయంలో మాత్రం ఎలాంటి హామీ లభించలేదని తెలిసింది. మరో వైపు ఆయన సీటు కోసం పట్టుబడుతున్నారు. ఎలాగైనా ఎమ్మెల్యేగా కానీ, ఎంపిగా కానీ బిజేపీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆ పార్టీ పెద్దలతో లాబీ చేస్తున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో పోటీలో దిగాలనే నిర్ణయంలో ఉన్న వరప్రసాదరావుకు బిజేపీ సీటు ఇచ్చి పోటీలోకి దింపుతుందా అనేది వేచి చూడాలి.
Next Story