
ఆంధ్రా జనంలో అభద్రత పెరిగిందా, నోరెందుకు విప్పడం లేదు?
దేశ సరిహద్దులు దాటిన ఆనాటి కారంచేడు, చుండూరు దళిత ఉద్యమాలు ఇవాళ కానరావడం లేదు. ప్రత్యేక హోదా మాయమైనా, రాజధాని పేరిట కాళ్ల కింద భూమి కార్పొరేట్ల పరమవుతున్నా ప్రజలు గళం విప్పడం లేదు. ఎందుకు?
ఒకప్పుడు ఉద్యమాలకు మారుపేరు ఆంధ్రప్రదేశ్... ఇప్పుడు మౌనానికి మారుపేరు? ఆనాడు విశాఖ ఉక్కు కోసం ఎగిసి పడిన సమస్త ఆంధ్ర ఇప్పుడు కనుమరుగవుతున్నా గొంతెత్తడం .. భూ సంస్కరణల కోసం పోరుబాట పట్టిన కమ్యూనిస్టులు ఇప్పుడు కీచుగొంతుకలుగా మిగిలారు..
దేశ సరిహద్దులు దాటిన ఆనాటి కారంచేడు, చుండూరు దళిత ఉద్యమాలు ఇవాళ కానరావడం లేదు. ప్రత్యేక హోదా మాయమైనా, రాజధాని పేరిట కాళ్ల కింద భూమి కార్పొరేట్ల పరమవుతున్నా, పారిశ్రామిక ప్రగతి నీరుగారుతున్నా ప్రజలు గళం విప్పడం లేదు. ఎందుకు?

ఉద్యమాలు నడిపించే వారు లేకనా? ఉద్యమకారులపై నమ్మకం లేకనా? అస్థిత్వ పోరాటాల స్థానంలో అభద్రత నెలకొన్నందునా? విద్యార్థి సంఘాలు నామమాత్రమైనందునా? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు..
ఆనాటి పోరాటాలెన్నో..
స్వాతంత్య్రోద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో అనేక ఉద్యమాలు వచ్చాయి. జాతీయ భావోద్వేగాన్ని రగిల్చాయి. పల్లె పల్లెకు ఉద్యమాల జ్వాలలు వ్యాపించాయి. ఓవైపు బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూనే మరోవైపు ఆంధ్ర ప్రాంతపు ప్రత్యేక స్వరాన్ని జాతీయ ఉద్యమంలో వినిపించాయి. వందేమాతరం ఉద్యమం ప్రభావంతో రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం వంటి పట్టణాలలో విద్యార్థి ఉద్యమాలు జరిగాయి. గదర్ ఉద్యమంతో ఆంధ్రాలో రహస్యోద్యమమే నడిచింది. హోంరూల్ ఉద్యమం వచ్చినపుడు ఆంధ్రాలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు బులుసు సాంబమూర్తి, పిట్ట పరమేశ్వరయ్య లాంటి వారు ప్రజా చైతన్యాన్ని రగిల్చారు. అల్లూరి సీతారామరాజు నడిపిన రంపా ఉద్యమం, నాన్ కోఆపరేషన్ ఉద్యమం, సైమన్ బహిష్కరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, వ్యక్తిగత సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమం, ఇంగ్లీషు వ్యతిరేక ఉద్యమం వంటివి విద్యార్థుల్లో, మహిళల్లో, రైతుల్లో జాతీయ చైతన్యానికి అగ్నికీలకలయ్యాయి. అల్లూరి నుంచి ప్రకాశం పంతులు వరకూ — మహామహుల త్యాగాలు, ప్రజా చైతన్యం భారత స్వాతంత్య్ర లక్ష్యంగా సాగాయి. లక్ష్యం నెరవేరేలా చేశాయి.
స్వాతంత్య్రానంతరం తెలంగాణ సాయుధ పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టులు వెన్నుదన్నుగా నిలిచారు. భూ సంస్కరణల ఉద్యమాన్ని నడిపారు. రైతులు, రైతు కూలీల సంగ్రామాలను నడిపారు. పేదలకింత భూమి దక్కేలా చేశారు.
స్వాతంత్య్రానంతర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” ఉద్యమం నడిచింది. ఇది కేవలం ఒక పరిశ్రమను రాబట్టుకొనే ప్రయత్నమే కాదు, దాని వెనకున్న చారిత్రక, ఆర్థిక, రాజకీయ, సామాజిక భావోద్వేగాల సమాహారం. ఆ తర్వాత ప్రత్యేక ఆంధ్ర లాంటి ఉద్యమాలు వచ్చిన నిలువలేదు.
1970ల తర్వాత వచ్చిన ఉద్యమాల్లో ఎక్కువ భాగం ఆర్ధిక పోరాటాలే అయినా చరిత్రను మలుపు తిప్పింది మాత్రం దళిత ఉద్యమమే. కారంచేడు, చుండూరు లాంటి ఉద్యమాలు దేశ సరిహద్దులు దాటి విస్తరించాయి. ఆ కాలంలో వచ్చిన అస్థిత్వ ఉద్యమాలకు సంకేతాలుగా నిలిచాయి.
ఇప్పుడేం జరుగుతోంది?
ప్రపంచంలో సాంకేతిక విప్లవం తారాస్థాయికి చేరింది. సంప్రదాయ పోరాటాలన్నీ ‘చెవికెక్కని చిలిపి శబ్దాలు’గా మారిపోయాయి. మొబైల్ విప్లవం నడుస్తోంది. వాట్సాప్ పాలనలు వచ్చాయి. “ఉపాధి పోతున్నా... కాళ్ల కింద భూమి చేజారిపోతున్నా... పరవాలేదనుకుంటున్నారే కానీ – గొంతెత్తలేం!” అనే విచిత్ర మనస్తత్వం అన్ని వర్గాలనూ కమ్మేసింది. ప్రశ్నిస్తే ఉద్యోగం పోతుందేమో, పిల్లల చదువు దెబ్బతింటుందేమో, మన కుల నాయకునికి దూరమవుతామో అనే భయం వెంటాడుతోంది. నోరు విప్పే ధైర్యం చేయలేని స్థితికి చేరింది సమాజం. నిజమైన సమస్యల్ని నిల్చొని చూసే సాహసం చేయలేని దుస్థితి.
అంగన్‌వాడీ కార్యకర్తల నిరసనల్నే చూద్దాం.. వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో రోడ్లెక్కితే.. ముందు పనిలో చేరండి, తర్వాత చూస్తామనే ధోరణిలో పాలకులు వ్యవహరించారు. పనిలోకి వచ్చిన తర్వాత ఏమి జరిగిందో అందరికీ తెలిసిందేనని అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు దుర్గాభవానీ ఆవేదన వ్యక్తం చేశారు. మా నినాదాలు “చెవిటి వాని ముందు శంఖారావాలు అయ్యాయి, ఇదీ ఈ యుగం వాస్తవం” అన్నారు ఆమె.
ప్రతి పోరాటానికి కులం, మతం, వర్గం, ప్రాంతం –వంటి రంగు పులిమే ప్రయత్నం జరుగుతోంది. ప్రత్యక్ష ఉదాహరణ అమరావతి రైతుల ఉద్యమమే. మొదట్లో అందరినీ ఆకట్టుకున్న ఆ ఉద్యమం ఆ తర్వాత ఓ వర్గానికి పరిమితమై పోయింది. కొద్ది రోజుల్లోనే ఒక కులానికి చెందిందిగా ముద్ర పడింది.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ ఉద్యమం ‘ఉత్తరాంధ్ర ప్రాంత సమస్య’ అన్నట్లుగా చిన్నదైంది. ఓనాడు ఆంధ్రుల హక్కు అయిన ఉద్యమం ఇవాళ విశాఖపట్నం దాటి బయటకు రాలేదు. ఇలా ఉద్యమాలకు రంగులు వేస్తూ – వాటి నైతికతను చంపేస్తున్నారు.
దీనికి తగ్గట్టుగానే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు- ఉద్యమాల్లో చీలికలు తెచ్చి తమ పబ్బం గడుపుకుంటున్నారు. దీంతో ప్రజలు కూడా "ఇది నాది కాదు" అనే భావనకు వస్తున్నారు. “నువ్వు అరవొచ్చు... కానీ వినేవాళ్ళు ఎవరూ లేరు!” అనే నిర్లిప్తతతో ఉండిపోవాల్సివస్తోంది. ఇది కాకినాడ సెజ్ కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి ఎదురైన పరిస్థితి అది.
ప్రశ్నించే వారిని ప్రభుత్వాలు నిరాశావాదుల్లా చూస్తోంది. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రోడ్ల కోసం జరిగిన నిరసనలూ ఇలాగే నిర్వీర్యం అయ్యాయి. ఇన్నేళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బదులు వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి అక్కడున్న సహజవనరులను కొల్లగొట్టే యత్నమే జరుగుతోంది. అరకులో గిరిజనులు రోడ్లు, వైద్య సదుపాయాల కోసం తరచూ గళమెత్తుతున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.
పుట్టినవి పెరక్కపోవడమే లోపం...
"ప్రచారం లేని ఉద్యమాలు – శాసనాధికారుల్లో ప్రాధాన్యత లేని జాబితాలో పడిపోతున్నాయి" అన్నారు సీనియర్ జర్నలిస్టు ఎన్.కొండయ్య. ఉద్యమాలు పుట్టడం లేదనడం సరికాదు, పుట్టినవి పెరగక పోవడం లోపం అన్నారు ఆయన. ప్రజలు మౌనాన్ని వీడేలా చేయడంలో ఎక్కడో లోపం జరుగుతోంది అన్నారు ఎన్.కొండయ్య.
"సమాజంలో వస్తున్న చీలికలు, మధ్యతరగతి భయాలు, పాలకుల దౌర్జన్యం వంటివి ఉద్యమాల పెనుబంధాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి" అన్నారు రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ రత్న కుమార్. "రాజకీయ పార్టీల మౌనం, మేధావుల తిరోగమన ధోరణి – ఉద్యమాలు వెనకతట్టు పట్టడానికి ప్రధాన కారణాలు" అని సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ డాక్టర్ శాంతి ప్రియ అన్నారు. ఉద్యమాలు తగ్గిపోయాయన్నది తప్పు. అవి చిన్న వర్గాల్లో, స్థానికంగా, ప్రాంతీయ స్థాయిలో జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వాలు, మీడియా, మేధావులు వాటిని గుర్తించకపోవడం వల్ల అవి "అదృశ్య పోరాటాలుగా మిగిలిపోతున్నాయి" అన్నారు డాక్టర్ శాంతి ప్రియ.
వైఫల్యానికి కారణాలు ఏమిటీ?
రాజకీయ పార్టీల వైఖరి ప్రధాన కారణం. వ్యక్తిగత లేదా పార్టీల ప్రయోజనాల కోసం ఉద్యమాలు నడుపుతున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రజలు ఉద్యమాలను విశ్వసించడం లేదనే అభిప్రాయం ఉంది అని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు రామకృష్ణ అన్నారు. అమరావతి రైతు ఉద్యమమే తీసుకోండి. రైతుల ప్రయోజనాలే ముఖ్యమైనప్పుడు ఏ పార్టీకైనా లక్ష్యం ఒక్కటిగానే ఉండాలి. వైసీపీ రైతులు వేరు, టీడీపీ రైతులు వేరు కాకూడదు అని చెప్పారు రామకృష్ణ. అణగారిన వర్గాల సమస్యలకు నిజంగా ప్రాధాన్యత ఇవ్వకుండా, ఎన్నికల ప్రయోజనాల కోణంలో మాత్రమే ఉద్యమాలను ఉపయోగించాలన్న ధోరణి కనిపిస్తుంది.
ఉద్యమాలను చైతన్యవంతంగా ముందుకు తీసుకెళ్లే నేతృత్వం విపక్ష పార్టీలకు లేకపోవడం మరో ప్రధాన కారణం. ప్రజల కష్టాలను ప్రభుత్వానికి వినిపించే స్థిరమైన ఉద్యమ ప్రణాళికలు లేకపోవడం కూడా కారణమే.
సొసైటీలో విస్తరించిన "సర్దుబాటు" ధోరణి. సమస్యలు ఎదురైతే వాటిని ఉద్యమంగా మార్చకుండా మౌనంగా సహించే స్థితికి సమాజం చేరుకుంటోందని ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ జి.సారధి చెప్పారు. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాల వల్ల వ్యక్తులు తమ వ్యక్తిగత పోరాటాల్లోనే నిమగ్నమవుతున్నారు. సమూహ చైతన్యం తగ్గిపోతోంది అని అభిప్రాయపడ్డారు.
ఉద్యమాల వేదికగా సోషియల్ మీడియా మారినా, అవి తాత్కాలిక స్పందనలకే పరిమితమవుతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజల సమీకరణ తగ్గిపోతోంది.
సామాజిక సంస్కృతి రోజురోజుకూ మారిపోతోంది. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య అనుసంధానం, సమన్వయం లేకపోవడం వల్ల సమష్టిగా ఉద్యమించడంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ఉద్యమాల్లో పాల్గొన్నవారిపై కేసులు పెట్టడం, బెదిరింపులు, ఉద్యోగాలు కోల్పోయే భయం వంటివి ఉద్యమాల ఉత్సాహాన్ని దెబ్బతీస్తున్నాయి.
రాజకీయ పార్టీలే మీడియాలను నడపడం, మీడియాపై గుత్తాధిపత్యం వంటి ధోరణులు కూడా ప్రజా ఉద్యమాలకు మీడియాలో స్పేస్ లేకపోతోంది. మరికొన్ని సందర్భాలలో వాటిని తప్పుదోవ పట్టించే విధంగా కవరేజీ చేయడం వల్ల, ఉద్యమాలు బలపడే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి.

ఉద్యమాలకు ఒక స్పష్టమైన లక్ష్యం, దిశానిర్దేశం లేక పోవడం వల్ల కూడా అవి పాక్షికంగా నడిచిన తరువాత నిలిచిపోతున్నాయి.
ఈ అన్ని అంశాల సమ్మిళితం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా ఉద్యమాలు విజయం సాధించడం లేదు. ప్రజలలో విప్లవాత్మక ఆత్మవిశ్వాసాన్ని రగిలించాల్సిన బాధ్యత మీడియా, బుద్ధిజీవులు, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలపై ఉంది. ప్రజలు తాము అనుభవిస్తున్న సమస్యలను వ్యక్తిగతంగా కాకుండా సామూహికంగా చూడగలిగినపుడు మాత్రమే వాస్తవిక ప్రజా ఉద్యమాలు వస్తాయి. ఆ పరిస్థితి తెలంగాణలో కనిపిస్తున్నంతగా ఆంధ్రాలో కనిపించడం లేదు.
“పౌరులు లబ్దిదారులుగా మారిపోతే... పాలకులు ప్రభువులవుతారు” అన్న నానుడి నిజం కాకుండా ఉండాలంటే ప్రజలు మౌనం వీడాలి. ప్రశ్నించడం నేర్వాలి. గొంతు విప్పాలి. మన సమస్యలు 'మనవి కావు' అనే భ్రమను వీడాలి. గళమెత్తాల్సిన సమయంలో మౌనం కూడా నేరమనే భావన రావాలి.
Next Story