సీఎం చంద్రబాబు తిన్న ప్లేటు, గ్లాసును తీసి అందరిని ఆశ్చర్యపరిచిన మంత్రి లోకేష్.
ప్రచారం కోసం చేశారా? లేదా నిజంగా మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది? ఎలాంటి భోజనాన్ని పిల్లలకు పెడుతున్నారు? తినే విధంగా వండుతున్నారా? వంటి అంశాలను పరిశీలించేందుకు తిన్నారా? లేక ప్రచారం స్టంట్ కోసం తిన్నారా? అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌లు మాత్రం అందరి చూపులను ఆకర్షించారు. బాపట్ల మునిసిపల్ ప్రభుత్వ పాఠశాలల పిల్లలతో కలిసి భోజనం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తుంటే.. ఇక అధికారులు మాత్రం ఏం చేస్తారు. వారు కూడా తప్పకుండా తినాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా పిల్లలతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద వడ్డించే భోజనం పిల్లలతో కలిసి తిన్నారు.
సహ పంక్తి భోజనంలో పక్క పక్కనే కూర్చున్న తండ్రీ, తనయులు.. తండ్రి సీఎం చంద్రబాబు తినడం పూర్తి అయిన తర్వాత ఆయన తిన్న ప్లేటును, నీళ్లు తాగిన గ్లాసును తనయుడు, మంత్రి నారా లోకేష్ తీసి అందరిని ఆశ్చర్య ముగ్దులను చేశారు. లోకేష్ సహజంగా ఇంట్లో ఇలానే చేస్తారో తెలియదు కానీ అందరు చూస్తుండగా బహిరంగంగా తండ్రికి సేవ చేస్తున్న కుమారుడిగా సపర్యలు చేయడం మాత్రం అందరిని ఆకట్టుకుంది. ఈ అరుదైన సంఘటనలు బాపట్లలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థుల పేరెంట్స్‌లో కలిసి సరదాగా ఆటలు ఆడారు.