అమరావతిలో రెండో సారి శంకుస్థాపన సంబరాలు ప్రజా సంబరాలు కాదు. పాలకుల సంబరాలు మాత్రమే. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు మనోనిబ్బరం కోల్పోయారు.
అమరావతి సెంటిమెంట్‌ను పక్కనపెట్టి చూస్తే, ప్రజలలో ఎక్కువ మంది ఈ ప్రాజెక్టును స్వాగతిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రాజధాని అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ఉపాధి అవకాశాలకు దోహదం చేస్తుందనే ఆశతో ప్రజలు ఉన్నారు. అయితే భూసేకరణ, ఖర్చు, ప్రాజెక్టు ఆలస్యం వంటి అంశాలపై కొంతమందిలో ఆందోళనలు, అసంతృప్తి ఉన్నాయి.
అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభమై, టెండర్ల ప్రక్రియ మొదలవడంతో రియల్ ఎస్టేట్ రంగంలో అత్యధిక ఉత్సాహం కనిపిస్తోంది. భూముల ధరలు పెరుగుతున్నాయి. ఇది స్థానిక వ్యాపారులు, పెట్టుబడిదారులకు గొప్పగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలలో ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. 55,000 ఎకరాల భూమిని రైతులు ఇవ్వడం, మరో 44,000 ఎకరాల భూ సేకరణ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించడం అనేది ఆలోచించాల్సిన అంశంగా ఉంది.
2015లో అమరాతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు నీరు, మట్టిని చంద్రబాబుకు అందజేసినప్పటి చిత్రం
మే 2, 2025 సాయంత్రం 4 గంటలకు రెండవ శంకుస్థాపనకు ప్రధాన మంత్రి రావడాన్ని స్వాగతిస్తూనే ప్రజలు నిధులు, రాజధాని నిర్మాణ పథకాలు ఆశిస్తున్నారు. X పోస్ట్‌లలో కొందరు “మళ్లీ నీళ్లు, మట్టి మాత్రమేనా?” అని విమర్శిస్తుండగా, మరికొందరు కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు, విధాన సహకారం ఆశిస్తున్నారు.
అమరావతి నిర్మాణానికి రూ.1 లక్ష కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. రాష్ట్ర ఆర్థిక సంక్షోభం, కేంద్ర సహాయం పరిమితంగా ఉండటం వల్ల ప్రాజెక్ట్ 2019-2024లో నిలిచిపోయింది. మోదీకి ఈ సవాళ్లు తెలుసు. కానీ కేంద్రం రూ.4,200 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2014 విభజన హామీలకు ఇది ఏమాత్రం సరిపోదనేది విమర్శకుల మాట.
అమరావతిని విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ, రైల్వే కనెక్టివిటీతో అభివృద్ధి చేసే ప్రణాళికలు స్థానికులకు ఉపాధి, వ్యాపార అవకాశాలను పెంచుతాయనే నమ్మకం కలిగిస్తున్నాయి. మే 2, 2025న ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో YSRCP వంటి విపక్ష పార్టీలు అమరావతి నిర్మాణం పేరిట లక్ష ఎకరాల భూమిని సేకరించే ప్రణాళికలు రైతుల పంట పొలాలను ధ్వంసం చేస్తాయని ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో స్థానిక రైతులలో కొంత ఆందోళన వ్యక్తమవుతోందనేది వారి అభిప్రాయం.
2019-2024 మధ్య YSRCP ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టును నిలిపివేయడంతో రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులు, రైతులు నష్టపోయారనే భావన ప్రజల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రజలు ప్రాజెక్టు విశ్వసనీయతపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి రూ.64,721 కోట్ల ఖర్చు అవుతుందని మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ భారీ ఖర్చు రాష్ట్ర ఆర్థిక భారాన్ని పెంచుతుందనే ఆందోళన చాలా మంది ప్రజల్లో ఉంది. అయితే ప్రభుత్వం దీనిని సెల్ఫ్-సస్టైనింగ్ ప్రాజెక్టుగా పేర్కొంటోంది.
పునరావృత వేడుకలు రాజకీయ నాటకంగా కనిపిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ సారి గొప్ప పురోగతి లేకపోతే ప్రజల విశ్వాసం మరింత తగ్గవచ్చు.
ప్రాంతీయ అసమానతలు వచ్చే అవకాశాలు
ప్రభుత్వం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను వదిలేసి సెంట్రల్ ఆంధ్ర పేరుతో అమరావతిలో లక్షల కోట్లు ఖర్చు చేయడాన్ని కొందరు మేధావులు, విశ్లేషకులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ముఖ్యమంత్రికి సగ్రమైన లేఖ ఇటీవల రాశారు. ప్రభుత్వ రంగంలోని సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం ఇస్తున్న సీఎం చంద్రబాబు తీరును ఆయన తప్పుపట్టారు. అలాగే అమరావతిపైనే లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కూడా మంచిది కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ విషయంలోనూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
ఆస్తుల విలువలు పెంచుకోవడానికే అమరావతి
పాలకులు, రాజకీయ నాయకులు అమరావతి ప్రాంతంలో భూములు, ఇతర ఆస్తులు కొనుగోలు చేశారు. వారి ఆస్తుల విలువలు పెంచుకునేందుకు మాత్రమే అమరావతి నిర్మిస్తున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితీ అధ్యక్షులు బుజ్జా దశరథ రామిరెడ్డి ఆరోపించారు. రాయలసీమలో సాగునీరు, తాగునీరు లేదు. ప్రాజెక్టులు చాలా వరకు నిర్మాణాలు జరగలేదు. కొద్దో గొప్పో జరిగిన వాటిలో నీరు నింపేందుకు వీలు లేకుండా పోయింది. మరమ్మతులు కూడా చేయడం లేదు. కృష్ణా జలాల విషయంలో పాలకులు చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. ఆ ఒప్పందాల వల్ల వారికి తప్ప రాయలసీమ వాసులకు ఎటువంటి ప్రయోజనం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ కృష్ణా, గోదావరి నీటితో కృష్ణా డెల్టాకు మాత్రమే ఉపయోగాలు చేస్తున్నారు. 2023 అక్టోబరు 4న కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం నీటి హక్కులు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. అంటే అక్కడ బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా నీటి ఒప్పందాల్లో తెలంగాణకు అనుకూలంగా ఉన్నారంటే రాయల సీమకు తీవ్ర అన్యాయం చేసినట్లుగానే భావించాల్సి ఉంటుందన్నారు. సుమారు 100 లక్షల ఎకరాలకు సరిపోయే కృష్ణా నీరు సముద్రం పాలవుతుంటే ప్రతి ఏటా చూస్తూనే ఉన్నారు. ఎవరికోసం అమరావతి సంబరాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కృష్ణా యాజమాన్య బోర్డును రాయలసీమలో పెట్టాలని కోరుతుంటే దానిని కూడా విజయవాడలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అని ప్రశ్నించారు. అందుకే సంగమేశ్వరం వద్ద రాయలసీమ నీటి ప్రాజెక్టులపై 30 వేల మందితో మే 31న ఆందోళ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రధానమంత్రిని కోరుకుంటున్న వేమిటి?
అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి భారీ నిధులు, రాయితీలు కోరుకుంటున్నారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రూ.4,200 కోట్లు విడుదలైనప్పటికీ, మరిన్ని నిధులు అవసరమని ప్రజలు భావిస్తున్నారు. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం నుంచి సాంకేతిక, ఆర్థిక సహకారం కోరుతున్నారు. అమరావతిని హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో అనుసంధానం చేసే రైల్వే లైన్, అంతర్జాతీయ విమానాశ్రయం, రోడ్ల నిర్మాణంలో కేంద్రం మద్దతు కోరుతున్నారు. 2014 రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ముఖ్యంగా రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, ఆర్థిక సహాయం వంటి అంశాలను పూర్తిగా అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రెండో సారి ప్రారంభోత్సవానికి రావొచ్చా: సీపీఐ
దేశంలో ఎక్కడైనా ఒకసారి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకు రెండో సారి తిరిగి శంకుస్థాపన చేయడానికి వస్తారా? ఇప్పటి వరకు ఎక్కడైనా ఇలా జరిగిందా? మోదీ మాత్రమే ఇలా చేయగలడని అర్థమవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ తో మాట్లాడుతూ కావాలంటే అమరావతి ప్రారంభానికి రావచ్చు. ఇదేమిటి? ఒకసారి కాక రెండో సారీ ఆయనే ప్రారంభిస్తారా? అంటూ మరో సారి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ వారు కూడా ప్లేట్ మార్చి సైలెంట్ బలపరిచినట్లున్నారని విమర్శించారు. గ్రాంట్ ఇస్తున్నా? లేదే... అప్పులు ఇప్పిస్తున్నావు. అప్పులు కేంద్రం కడుతుందో లేదో నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు. ఈ సారి సున్నం, సిమెంట్ ఇచ్చి పోతాడేమో అని వెటకారమాడారు.
ఏపీని మోదీ నయవంచనకు గురిచేశారు
బీజేపీ వారు, ప్రధానంగా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ను మోసం చేశారు. మొదటి నుంచి నయవంచనకు గురిచేస్తూనే ఉన్నారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి ఎస్ఆర్ కేఆర్ విజయకుమార్ అన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ తో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ కంటే ఎక్కువ సౌకర్యాలు ఏపీకి కల్పించాలని డిమాండ్ చేసింది బీజేపీ వారే. కానీ 11 సంవత్సరాలైనా నేటికీ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. ఆంధ్ర ప్రజలు బీజేపీని స్వాగతించడం లేదు. అందుకే ఏపీ అంటేనే వ్యతిరేకత పెంచుకున్నారని, ఇప్పుడు ఏపీపై ఉన్నది ప్రేమ కాదని, కేవలం నటన మాత్రమేనన్నారు.
ఏపీ అంటే అభిమానం ఉంటే ఏడాదికి రూ. 10వేల కోట్లు ఐదేళ్లు ఇస్తామని చెప్పారు. ఒక్క ఏడాది పదివేల కోట్లు ఇచ్చి సరిపెట్టారు. ఇదేనా అభిమానం అంటే అంటూ ప్రశ్నించారు. కడపకు స్టీలు ప్లాంట్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ వారికి అప్పగించే పనిలో ఉన్నారు. ఇదేనా ఏపీపై ఉన్న ప్రేమ అని అన్నారు. తెలంగాణ, తమిళ నాడుకు ఇస్తున్నన్ని నిధులు కూడా ఏపీకి ఇవ్వలేదన్నారు. పదేళ్లలో అటు వైఎస్సార్సీపీ, ఇటు టీడీపీ వాళ్ల నుంచి బీజేపీ వారు కేంద్రంలో లబ్ధి పొందారు. ఎంపీల మద్దతు పొందారు. పాలకులు తమ స్వార్థం కోసం ఏపీ అభివృద్ధికి కావాల్సినవి అడగటంలో విఫలమయ్యారన్నారు. అమరావతిలో జరిగేది ప్రజా సంబరం కాదని, రాజకీయ నేతల లబ్ధికోసం జరిగే సంబరమని ఆయన తీవ్రస్థాయిలో బీజేపీని విమర్శించారు.