ఆంధ్రప్రదేశ్‌లో బిసి నాయకులు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలో రాణించ లేక పోతున్నారని, బీసీల్లోని ముఖ్య నాయకుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఇటీవల పలు సభల్లో ఆయన ఆవేదనను వెళ్లగక్కారు. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలోని అగ్ర వర్గాలు బీసీలను రాజకీయంగా ఎదగనీయడం లేదని నేతిబీరకాయలో నెయ్యి ఎలా ఉండదో వైఎస్‌ఆర్‌సీపీలోని ముఖ్య నేతల పరిస్థితి కూడా అలాగే ఉందని పలు సందర్భాల్లో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం వైఎస్ జగన్ సైతం బీసీ వర్గాలకు చేసిందేమీ లేదని, 59 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి ఒక్క కార్పొరేషన్‌కు కూడా నిధులివ్వకుండా బీసీ సాధికారత ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజక వర్గంలో ఎమ్మెల్యే కాసుమహేష్‌రెడ్డి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పలు సందర్భాల్లో చెప్పడం విశేషం.
అవసరమైతే టీడీపీ నుంచి దిగుతా..
అవసరమైతే తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ టికెట్‌తో గురజాల నుంచి పోటీ చేయాలనే ఆలోచన కూడా చేశారు. ఆ మేరకు లోకేష్‌ను కూడా కలిసినట్లు వార్తలొచ్చాయి. అయితే టీడీపీ వాళ్లు జంగాను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు పెద్ద కనిపించ లేదు. ఉన్న పార్టీలో నేతలు విమర్శలు గుప్పించడం చేరాలనుకున్న పార్టీలో అక్కడి పార్టీ పెద్దలు అవకాశం కల్పించక పోవడం జంగా కృష్ణమూర్తి రాజకీయ జీవితాన్ని అగాధంలోకి నెట్టిందని చెప్పొచ్చు.
బీసీ నేతగా వైఎస్‌ఆర్‌సీపీలో కీలక పాత్ర
జంగా కృష్ణమూర్తి బీసీలను సమీకరించడంలోనూ, బీసీల సమస్యలపై అధ్యయనం చేయడంలోనూ వైఎస్‌ఆర్‌సీపీలో ముందున్నారు. ఎన్నికలకు ముందు బీసీ అధ్యాయన కమిటీని పార్టీ ప్రకటించి ఆ కమిటీకి అధ్యక్షులుగా జంగా కృష్ణమూర్తినే నియమించింది. కులాల వారీగా ఒక్కో రోజు ఒక్కో కులంలోని ముఖ్య నాయకులను పిలిపించి వారి సమస్యలను వినడంతో పాటు అధ్యాయన కమిటీ తీసుకునే నిర్ణయాలను కూడా కలిపి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఒక ప్రత్యేక నివేదికను సమర్పించింది. అప్పట్లో జగన్ కూడా జంగా నివేదికను అభినందించారు. వైఎస్‌ఆర్‌సీపీ బీసీ డిక్లరేషన్ ప్రకటించే ముందు జంగా కృష్ణామూర్తి నుంచి తీసుకున్న రిపోర్టునే డిక్లరేషన్‌లో వైఎస్ జగన్ వెల్లడించారు. సీట్ల కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఒక్క జంగా కృష్ణమూర్తే కాకుండా కొందరు నాయకులు కూడా అక్కడక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సింగరి సంజీవకుమార్ తనను కాకుండా వేరే సీటు కేటాయించగానే ప్రశ్నించారు. తనకు గెలుపు అవకాశాలున్నాయని, సీటు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. అదే జిల్లాకు చెందిన రాష్ట్ర గుమ్మనూరు జయరామ్‌కు ఎంపి స్థానం కేటాయించారు. ఆ స్థానం నాకొద్దని ఆయన ఆ పార్టీ నుంచి వెళ్లి పోయి తెలుగుదేశం నుంచి టికెట్ సంపాదించుకున్నారు.
పదవి ఉన్నా..అధికారం లేదు
ఎమ్మెల్సీగా పదవి ఇచ్చినప్పటికీ జంగా కృష్ణమూర్తి అధికారం లేని బాధ్యతలను నెరవేరుస్తూ వస్తున్నాననే బాధను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాను గతంలో గురజాల నియోజక వర్గం నుంచి శాసన సభ్యులుగా గెలిచి అక్కడ ప్రజలకు సేవలు చేశానని దాంతో నా దగ్గరకి కూడా చాలా మంది ప్రజలు సమస్యలతో వస్తుంటారని వాటి పరిష్కార నిమిత్తం నేను అధికారులకు చెప్పినా, ఎమ్మెల్యే ద్వారా సమస్యను పరిష్కరిద్దామని చూసినా ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మోకాలడ్డుతూ రావడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. జిల్లా అధికారులకు ఎమ్మెల్యే ఫోన్లు చేసి జంగా కృష్ణమూర్తి ఏమి చెప్పినా చేయొద్దని నేను చెప్పినవి మాత్రమే చేయాలని అధికారులను ఆదేశించడం ఎంత వరకు సమంజసం అని కూడా పలుమార్లు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు రాష్ట్ర నాయకుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడాన్ని కూడా ఆయన తప్పుపడుతూ వస్తున్నారు.
టీడీపీ టికెట్ యరపతినేనికి ఖరారు
తెలుగుదేశం పార్టీ గురజాల నియోజక వర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యరపతినేనే శ్రీనివాసరావు పేరును ప్రకటించింది. వైఎస్‌ఆర్‌సీపీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డినే రంగంలోకి దించనున్నట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య జంగా కృష్ణమూర్తి రాజకీయ భవిష్యత్ అగాధంలో పడనుందా అనే సందేహాలు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.