పని లేకుండా ఉంటున్న తన బంధువుల అబ్బాయిని కోల్ కతా నుంచి పిలిపించుకుని పని కల్పిస్తే పిలిపించుకున్న వ్యక్తి భార్యను చంపి రేప్ చేశాడు.


ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్ నుంచి నెల్లూరు కావలికి వలస వచ్చింది ఒక కుటుంబం. తమకు తెలిసిన ఆయుర్వేద వైద్యంతో ఆ ప్రాంత ప్రజల ఆదరణను ఆ కుటుంబం పొందింది. సుమారు 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని కావలిలో సొంత ఇంటిని నిర్మించుకొని అక్కడ పదేళ్లుగా మలల వైద్యం చేస్తున్నారు. భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు చిన్న వారు కావడం వల్ల వైద్యంలో సహాయ కారిగా ఉంటాడనే ఉద్దేశ్యంతో ఆ కుటుంబం తమ బంధువుల అబ్బాయిని పిలిపించుకున్నారు. ఆ యువకుడు వరుసకు వదిన అయిన ఆ ఇంటి ఇల్లాలుపై కన్నేసి రేప్ చేసి అంతం చేశాడు.

కావలి పట్టణం రోజు రోజుకూ విస్తరిస్తుండటంతో శివారు కాలనీలు పెరిగాయి. ఇలాంటి కాలనీలో ఒకటైన గాయత్రి నగర్ లో పశ్చిమ బెంగాల్ కు చెందిన శ్రీకాంత్ బిశ్వాస్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయుర్వేద వైద్యంలో వీరికి అనుభవం ఉండడంతో మొలల వ్యాధికి మందులిస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. మొదట్లో నెల్లూరులో జీవించిన ఈ కుటుంబం ఆ తరువాత కావలికి వచ్చింది. శ్రీకాంత్ బిశ్వాస్ భార్య అర్పితా బిస్వాస్. వారికి ఇద్దరు పిల్లలు. తల్లి దండ్రులతో కలిసి కావలిలో ఈ కుటుంబం నివసిస్తోంది. కుటుంబ సభ్యులంతా ఎంతో సఖ్యతతో హ్యాపీగా జీవనాన్ని సాగిస్తూ వస్తున్నారు. శ్రీకాంత్ బిస్వాస్, అతని భార్య సమయం ఉన్నప్పుడల్లా ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటారు. వీరికి ఫాలోయర్స్ కూడా బాగానే ఉన్నారు.

వైద్యంలో పని వత్తిడి పెరగటం వల్ల రెండేళ్ల క్రితం సహాయకుడిగా ఉంటాడని భావించి సోదరుడి వరుసైన నయన్ బిస్వాస్ ను పశ్చిమ బెంగాల్ నుంచి పిలిపించాలనుకున్నారు. కుటుంబానికి దగ్గరివాడు కావడం వల్ల భార్య భర్తలు ఈ నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ లో నయన్ కు ఉపాధి కూడా లేక పోవడంతో ఇక్కడే ఉపాధి కల్పిస్తామని వారి తల్లి దండ్రులకు చెప్పి కోల్ కత్తా నుంచి కావలికి తీసుకువచ్చారు. నయన్ చలాకీగా ఉండడంతో కుటుంబ సభ్యులతో తొందరగానే కలిసిపోయాడు. నయన్ తో కలిసి కూడా శ్రీకాంత్ బిస్వాస్ రీల్స్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తన భార్య అర్పిత బిస్వాస్ తో చేసే రీల్స్ కు నయన్ కూడా సహకారం అందించేవాడు. ఈ క్రమంలో అర్పితకు నయన్ కు కొంత సన్నిహితం ఏర్పడింది. వదినతో చనువుగా ఉండటంతో శ్రీకాంత్ బిశ్వాస్ అంతా హ్యాపీగా ఉందని భావించాడు. అర్పిత కూడా మనసులో ఏమీ లేకుండా కలివిడిగా ఉంటూ వచ్చింది.

హంతకుడు నయన్

అర్పిత బిస్వాస్ పై కన్నేసిన నయన్ పలు మార్లు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది శృతి మించడంతో నయన్ వ్యవహారాన్ని భర్త శ్రీకాంత్ బిశ్వాస్ కు అర్పిత చెప్పింది. ఆ అబ్బాయిని ఇంటి నుంచి పంపించేయాలని కోరింది. దీంతో నయన్ ను శ్రీకాంత్ తో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా మందలించారు. అయినా నయన్ తీరులో మార్పు రాలేదు. ఎలాగైనా అర్పిత ను అనుభవించాలని నిర్ణయించుకున్న నయన్ అదను కోసం వేచి చూశాడు.

కొత్త సంవత్సరం కావడంతో శ్రీకాంత్ తల్లిదండ్రులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. ఇంట్లో శ్రీకాంత్ బిశ్వాస్ ఆయన సతీమణి అర్పిత, ఇద్దరు పిల్లలు, నయన్ ఉన్నారు. ఇంటి వద్ద శ్రీకాంత్ తల్లిదండ్రులు లేకపోవడంతో శ్రీకాంత్, నయన్ లు మద్యం సేవించారు. నయన్ ప్లాన్ ప్రకారం శ్రీకాంత్ మద్యం ఎక్కువ తాగేలా చేశాడు. దీంతో శ్రీకాంత్ ఇంటిలోని ఒక గదిలో నిద్రపోయాడు. మరో గదిలో పిల్లలతో కలిసి అర్పిత నిద్రించింది. ఇదే అదనుగా భావించిన నయన్ అర్ధరాత్రి సమయంలో అర్పిత నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి ఆమెను బలాత్కరించాడు. ఆమె అంగీకరించకుండా పక్కకు తోసి వేసింది. దీంతో ఆగదిలోనే ఉన్న రాడ్ తో గట్టిగా తలపై కొట్టాడు. దీంతో అర్పిత ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృత దేహంపై పడి అత్యాచారం చేశాడు. రాడ్ తో కొట్టిన దెబ్బకు అర్పిత తల పగిలి రక్తం కారడంతో మరకలను కొద్దిగా తుడిచి రూము నుంచి అర్పిత మృత దేహాన్ని ఇంటికి సమీపంలో ఉన్న కాలువ వద్దకు తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమె ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి మరోసారి అత్యాచారం చేశాడు. అర్పిత మృత దేహాన్ని కాలువలో పడేసి వెళ్లిపోయాడు. ఈ సంఘటన ఇటీవల జరిగింది.

ఉదయం నిద్ర లేవగానే భార్య అర్పిత కనపడక పోవడ లేదు. ఆమె గదిలో రక్తపు మరకలు ఉండడంతో శ్రీకాంత్ కంగారు పడ్డాడు. స్థానికులతో కలిసి సమీప ప్రాంతాలలో గాలించారు. పంట కాలువ వద్ద అర్పిత మృతదేహం కనపడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సంఘటన తీరును పరిశీలించారు. అర్పిత దుస్తులతో పాటు నయన్ దుస్తులు కూడా కాలువ పక్కన లభించాయి. నయన్ మాత్రం ఏమీ తెలియనట్లు నటించాడు. నయన్ చొక్కా దొరకడంతో నయన్ పై శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేశాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో నయన్ జరిగిన సంఘటనను వివరించాడు. దీంతో పోలీసులు కూడా నయన్ చేసిన పనికి విస్తుపోయారు. ఉపకారం చేద్దామని పిలిపించుకుంటే వచ్చిన వ్యక్తి అపకారిగా మారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు.

Next Story