భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1905లో దీని ప్రస్థానం ప్రారంభమైంది. నాటి నుంచి ఇప్పటి వరకు డైరెక్టుర్లుగా పని చేసిన వారిలో తెలుగు వారు లేరు.


దేశంలోనే కాకుండా, అంతర్జాతీంగా కూడా ప్రఖ్యాతి గాంచిన ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ)కు మొదటి సారిగా ఓ తెలుగు శాస్త్ర వేత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ చరిత్రలో డైరెక్టర్‌ అయిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఆయనే చెరుకుపల్లి శ్రీనివాసరావు. చెరుకుపల్లి శ్రీనివాసరావు వ్యవసాయ పరిశోధన రంగంలో విశేష అనుభవం కలిగిన శాస్త్రవేత్త. జాతీయ, అంతర్జాతీ స్థాయిలో దాదాపు 300లకుపైగా పరిశోధన పత్రాలను సమర్పించారు. నేషనల్, ఇంటర్‌నేషనల్‌ జర్నల్స్‌లో కూడా ఆయన పరిశోధన పత్రాలు అచ్చయ్యాయి. ఐఏఆర్‌ఐలో వివిధ హోదాల్లో పని చేసిన శ్రీనివాసరావు 1992లో శాస్త్రవేత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు పని చేస్తూ డైరెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలు చేసిన శ్రీనివాసరావు అంతర్జాతీయంగాను మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్తగా శ్రీనివాసరావుకు మంచి పేరు ఉంది. వాతావరణ మార్పులపై ఇంటర్‌నేషనల్‌ లెవల్లో జరిగిన అనేక సమావేశాలకు భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. అనేక విధాన పరమైన నిర్ణయాల్లోను కీలక పాత్ర పోషించారు.

వ్యవసాయ పరిశోధన రంగంలో విశేష అనుభవం కలిగి, ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌గా నియమితులైన చెరుకుపల్లి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు సమీపంలో ఉన్న అనిగండ్లపాడు శ్రీనివాసరావు స్వస్థలం. ఓ రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. ప్రఖ్యాత గాంచిన బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆయన చదువుకున్నారు. 1982–86 మధ్య కాలంలో ఏజీబీఎస్సీ చదివారు. తర్వాత అక్కడే 1986–88 మధ్య కాలంలో పీజీ కూడా పూర్తి చేశారు. అనంతరం ఐఏఆర్‌ఐలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీహెచ్‌డీ పరిశోధన పూర్తి చేసిన అనంతంర శాస్త్రవేత్తగా తన కెరీర్‌ను ఆరంభించారు. ఆయన చేసిన పరిశోధన సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అనేక అవార్డులను అందుకున్నారు. 2010లో రాష్ట్రపతి నుంచి, 2015లో ప్రధానమంత్రి నుంచి కూడా అవార్డులు అందుకున్నారు. ఎఫ్‌ఏఐ అవార్డుతో పాటు, పద్మశ్రీ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాలు అందుకున్నారు.
ఐఏఆర్‌ఐకి వందల ఏళ్ల చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం దీనిని ఏర్పాటు చేశారు. 1905లో బీహార్‌లో పూసాలో దీనిని నెలకొల్పారు. పూసా ఇన్‌స్టిట్యూట్‌గా ఉన్న దీనిని అగ్రికల్చరల్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఏఆర్‌ఐ)గా పేరు మార్చారు. తర్వాత 1911లో ఇంపిరీయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికలర్చలర్‌ రీసెర్చ్‌గా మారింది. అనంతరం 1919లో ఇంపీరియల్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌గా పేరు మార్చారు. జనవరి15, 1934లో చోటు చేసుకున్న భూకంపం వల్ల 1936, జూలై 29న దీనిని బీహార్‌లోని పూసా నుంచి ఢిల్లీకి మార్చారు. స్వాతంత్య్ర అనంతరం దీనికి ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఐఏఆర్‌ఐ)గా పేరును మార్చారు.
Next Story