ఆంధ్రాకి తుపాను ముప్పు, ఈవేళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
x

ఆంధ్రాకి తుపాను ముప్పు, ఈవేళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటుతుందని అంచనా


ఆంధ్రప్రదేశ్ లో ఆది, సోమ, మంగళవారాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంపైకి ‘మొంథా’ తుపాను దూసుకొస్తోందని ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం సాయంత్రానికి తుపానుగా మారనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 8 కి.మీ వేగంతో కదిలిన వాయుగుండం మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. సాయంత్రానికి తుపానుగా మారనుంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుందని అంచనా. ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 550 కి.మీ, చెన్నైకి 850 కి.మీ, విశాఖపట్నంకి 880 కి.మీ,కాకినాడకి 880 కి.మీ, గోపాల్‌పూర్ కి 960 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయింది.
ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటుతుంది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
‘మొంథా’ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమ, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ‘రెడ్‌’ అలర్ట్‌ జారీ చేసింది. సముద్రం అలజడిగా మారినందున బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సోమవారం వర్షాలు కురిసే అవకాశం ప్రాంతాలు- బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు; డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు; అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాలతో పాటు యానాంలో భారీ వర్షాలు పడతాయి.
మంగళవారం కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు; విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు; శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, చిత్తూరు, అన్నమయ్య, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు.
బుధవారం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు; అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
Read More
Next Story