ఉత్తర కోస్తాలో అల్పపీడనం ప్రభావం తీవ్రంగా ఉంది. గంటకు 60కిమీ వేగంతో సముద్ర తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయి.


బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కొనసాగుతోంది. బంగాళాఖాతంలో తొలుత అల్పపీడనం ఏర్పడినా తర్వాత అది తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరం వైపునకు కదులుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ తదితర జిల్లాల్లో దీని ప్రభావం వల్ల శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. తక్కిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళాఖాతంలో మారిన తీవ్ర అల్పపీడనం కారణంగా పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం, విశాకపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారిందని, అలల అలజడి తీవ్ర స్థాయిలో ఉందని, ఈ నేపథ్యంలో ఆదివారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 60కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.

Next Story