బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉంది. బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి గంటకు 35కిమీ నుంచి 55కిమీ వేగతంలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. గత వైఫల్యాలు పునరావృతం కాకుండా చూసేందుకు ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. తుపాను, వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్‌లు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేసింది. ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండి, ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వాగులు పొంగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండే విధంగా హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు పోలీసు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ, మునిసిపల్, నీటి పారుదల శాఖల యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సమన్వయంతో పని చేయాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఇప్పటికే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య ఉంటే కంట్రోల్ రూమ్‌లోని 1070, 112, 1800–425–0101ను సంప్రదించాలని సూచించారు.
Next Story