తెలంగాణ బిజెపి నాయకుడు త్రిపురకు గవర్నర్, త్రిపుర బిజెపి నాయకుడు తెలంగాణకు గవర్నర్, ఇటువారు అటు, అటు వారు ఇటు రావడం విశేషం.


ఎన్‌డిఎ కూటమి రాష్ట్రాలకు బిజెపి సీనియర్‌ నాయకులను గవర్నర్లుగా నియమిస్తోంది. తెలంగాణకు చెందిన బీజెపి సీనియర్‌ నాయుడిని త్రిపుర గవర్నర్‌గా నియమిస్తే త్రిపురకు చెందిన బిజెపి సీనియర్‌ నాయకుడిని తెలంగాణకు గవర్నర్‌గా నియమించారు. రాజకీయాల్లో వీరు ఇద్దరూ ఉద్దండులే. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఒకరైతే మరొకరు డిప్యూటీ సీఎంగా పనిచేసిన వారు. అంటే వీరికి పదవిలోకి రాకముందే గవర్నర్‌ వ్యవహరించాల్సిన తీరు, రాజ్యాంగ రక్షణ కోసం గవర్నర్‌ తీసుకోవాల్సిన చర్యల గురించి తెలిసే ఉంటుంది. నిజానికి గవర్నర్‌ పదవి అనేది రాజకీయాలకు అతీతులుగా ఉండే వ్యక్తులకు ఇవ్వాలి. కానీ బిజెపి వారు తమ పార్టీలో సీనియర్లను ఎంపిక చేసి గవర్నర్‌లుగా నియమిస్తున్నారు. విచిత్రమేమిటంటే తెలంగాణ గవర్నర్‌గా గతంలో విధులు నిర్వహించిన తమిళసై పదవికి రాజీనామా చేసి తమిళనాడు నుంచి పార్లమెంట్‌కు పోటీ కూడా చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర రాష్ట్రానికి గవర్నర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బిజెపి అధ్యక్షునిగా పనిచేశారు. మలక్‌పేట నియోజకవర్గం నుంచి మూడు సార్లు బిజెపి ఎమ్మెల్యేగా గెలిచారు. నల్గొండ, మల్కాజ్‌గిరి, భువనగిరి నియోజకవర్గాల్లో పార్లమెంట్‌ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. బిజెపిలో జాతీయ కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌ 26 త్రిపుర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామానికి చెందిన వారు. వీరి తల్లదండ్రులు ఎన్‌ రామ్‌రెడ్డి, హనుమాయమ్మలు. జీవిత భాగస్వామి రేణుక. ముగ్గురు కుమారులు. హైదరాబాద్‌లో ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణు దేవ్‌ వర్మ 2024 జూలై 31న హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. త్రిపుర రాష్ట్రానికి 2018 నుండి 2023 వరకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జిష్ణు దేవ్‌ వర్మ, మహారాష్ట్ర రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ప్రస్తుత గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో కొద్ది రోజుల క్రితం తెలంగాణ కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు.
1957 ఆగస్టు 15న జన్మించిన జిష్ణు దేవ్‌ వర్మ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశారు. 1993లో బీజేపీలో చేరిన ఆయన అప్పటి నుంచి పార్టీలో కీలక పాత్ర పోషించారు. త్రిపుర ప్రభుత్వంలో విద్యుత్, గ్రామీణాభివృద్ధి, పంచాయత్‌ రాజ్, ఆర్థిక, ప్రణాళిక, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ మంత్రిత్వ శాఖల బాధ్యతలను కూడా నిర్వహించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సెపాహిజాలా జిల్లాలోని చరిలం నుంచి ఆయన ఓడిపోయారు.
ఇరువురూ భారతీయ జనతాపార్టీలో కష్టపడి పనిచేసిన వారే. పదవులు కూడా వీరికి అలాగే దక్కాయి. సీనియర్లు కావడం వల్ల వీరిని గవర్నర్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నియమించింది. ప్రధాన మంత్రికి విధేయులుగా ఉండటం కూడా ఒక కారణం కావొచ్చు. విశేషం ఏమిటంటే త్రిపుర గవర్నర్‌గా తెలంగాణకు చెందిన ఇంద్రసేన పది నెలల క్రితమే నియమితులయ్యారు. త్రిపురకు చెందిన బీజేపీ నాయకుడు జిష్ణు దేవ్‌ వర్మ తెలంగాణ గవర్నర్‌గా బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.
Next Story