సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.


బోరుగడ్డ అనిల్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బోరుగడ్డ అనిల్‌ వంటి వారిని క్షమించడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటీషన్‌ను హై కోర్టు కొట్టివేసింది. బోరుగడ్డ అనిల్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటీషన్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వాఖ్యలు చేసింది. కేంద్ర మంత్రి రాందాస్‌ అఠావలె అనుచరుడిగా ప్రచారం చేసుకుంటూ బోరుగడ్డ అనిల్‌ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఆర్పీఐ) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా చెలామణి అయ్యారని, తన పదవిని అడ్డం పెట్టుకొని రెచ్చిపోయారనే విమర్శలు ఉన్నాయి. గత జగన్‌ ప్రభుత్వంలో గుంటూరు కేంద్రంగా అరాచకాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్‌ పాలనలోని ఐదేళ్ల కాలంలో బోరుగడ్డ అనిల్‌ అరాచకాలకు హద్దే లేకుండా పోయిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఆర్పీఐ ఏపీ అధ్యక్షుడిగా ఉంటూనే.. జగన్‌కు ప్రధాన అనుచరుడిగా చెలామణి అయ్యారు. జగన్‌ను అన్నా అని సంభోదిస్తూ ప్రతిపక్షాలకు చెందిన నేతలపై విరుచుకుని పడేవారు. పచ్చిబూతులు తిడుతూ రెచ్చిపోయే వారని అనేక విమర్శలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలోను, టీవీ చర్చా కార్యక్రమాల్లో అసభ్య పదజాలంతో దూషించే వారు. నాడు సీఎంగా ఉన్న జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యాఖ్యలు చేసినా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడినా.. అలాంటి వారిపై రెచ్చిపోయి మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడే వారని కూడా విమర్శలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక సీన్‌ రివర్స్‌ అయ్యింది. బోరుగడ్డ అనిల్‌పై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిపైన సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని అనంతపురం టౌన్‌ నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టుకు పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటీషనర్‌ బోరుగడ్డ అనిల్‌పై నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో రెండు కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్‌ దాఖలైందని కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పిటీషనర్‌ బోరుగడ్డ అనిల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. బోరుగడ్డ అనిల్‌ వంటి వారిని క్షమించడానికి వీల్లేదని పేర్కొన్న హైకోర్టు ఆయన బెయిల్‌ పిటీషన్‌ను కొట్టివేసింది. దీంతో హైకోర్టులో బోరుగడ్డ అనిల్‌కు చుక్కెదురైంది.

Next Story