బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు.. హైకోర్టు తీర్పు
x

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు.. హైకోర్టు తీర్పు

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.


తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఓవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతల జంపింగ్స్, మరోవైపు కేసుల టెన్షన్స్.. వెరసి బీఆర్ఎస్ శ్రేణులు పైకి గంభీరంగా కనిపిస్తున్నా, లోపల నైరాశ్యంలోనే ఉన్నారు. సిట్టింగులు పార్టీని వీడుతున్న క్రమంలో బీఆర్ఎస్ కి మరో ఎమ్మెల్సీ మైనస్ అయ్యింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్ నేత పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం విఠల్ ఎన్నిక చెల్లదని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

అసలు విషయం ఏమిటంటే...

బీఆర్ఎస్ నేత దండె విఠల్ 2021 లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఇదే స్థానానికి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాజేశ్వర్ రెడ్డి పోటీ తనకి నష్టం కలిగించొచ్చు అని భావించిన విఠల్.. ఆయనని పోటీ నుంచి విరమింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ ఫలించలేదు.

అయితే నామినేషన్ల ఉపసంహరణ సమయంలో.. రాజేశ్వర్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో రాజేశ్వర్ రెడ్డి తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, ఎవరో తన సంతకం ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరణ పత్రాలు దాఖలు చేశారని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దండె విఠల్ ఎన్నిక రద్దు చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఈరోజు తీర్పు చెప్పింది. నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై ఉన్న సంతకం రాజేశ్వర్ రెడ్డిది కాదని తేల్చింది. విఠల్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పునివ్వడంతోపాటు విఠల్ కి రూ. 50,000 జరిమానా కూడా విధించింది.

Read More
Next Story