HIJRA HASINI MURDER CASE | ఆధిపత్య పోరు వల్లే హిజ్రా నేత హాసిని హత్య
x
ధర్నా చేస్తున్న ట్రాన్స్ జండర్లు. (ఇన్ సెట్) హత్యకు గురైన హాసిని

HIJRA HASINI MURDER CASE | ఆధిపత్య పోరు వల్లే హిజ్రా నేత హాసిని హత్య

పోలీసులు 12 మంది నిందితులను అరెస్టు చేశారు. సగం కేసు ఇంకా మిగిలి ఉంది. ఆ వివరాలను నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ మీడియాకు వెల్లడించారు.


రాష్ట్ర హిజ్రా (Trans jender) సంఘం నాయకురాలు మాణికల హాసిని హత్య ప్రకంపనలు సృష్టించింది. ఆమె దక్షిణకోస్తా, రాయలసీమ, బళ్లారి, రాయచూరు, ధార్వాడ్, చికమంగళూరు, హుబ్లీ జిల్లాల ట్రాన్స్ జెండర్స్ నాయకురాలుగా ఉన్నారు. ఈ నెల 26వ తేదీ ఆమె నెల్లూరు సమీపంలో దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలియగానే, రాయలసీమ, కోస్తా తోపాటు కర్నాటక నుంచి కూడా ఊహించని స్థాయిలో హిజ్రాలు తరలివచ్చారు. ఆ సమయంలో వారి గోడు దేవుడే ఆలకించాడు. అంతలా రోధించారు.


ఈ ఘటనపై నెల్లూరు పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ జిల్లా ఎస్ఫీ జీ. కృష్ణకాంత్ ఏమన్నారంటే..
"హిజ్రా సంఘం నేత హాసిని, మరో నాయకురాలు అలేఖ్య మధ్య ఉన్న ఆదిపత్యపోరు హత్యకు దారితీసింది" అని చెప్పారు.
హిజ్రాల సంఘం నాయకురాలు హాసిని హత్య చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ మీడియాకు వెల్లడించారు.

"హాసిని హత్యకేసుతో సంబంధం ఉన్న 15 మందిలో 12 మంది నిందితులను అరెస్టు చేశాం. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నాం" అని ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు. ఈ హత్య కేసులో ఎక్కువమంది నిందితులు పాత నేరస్తులు, రౌడీ షీటర్లే అని ఆయన వెల్లడించారు. హాసిని హత్య కేసులో నిందితుడు భూపతి గతంలో కూడా హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నారని ఆయన చెప్పారు.
ఘటన జరిగిన తీరు..
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హిజ్రా సంఘం నాయకురాలు మాణికుల హాసిని ఈ నెల 26వ తేదీ వెళ్లారు. పూజల అనంతరం ఆమె సహచర హిజ్రాలతో కలసి కారులో రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో నెల్లూరుకు బయలుదేరింది. మార్గమధ్యలోని టపాతోపు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద హాసిని ప్రయాణించే కారుకు ముందు వెనుక దుండగులు రెండు కార్లు అడ్డంపెట్టారు. దీంతో హాసిని ప్రయాణిస్తున్న హాసిని కారు ఆగిపోయింది. వెంటనే ఆ రెండు కార్ల నుంచి దిగిన కొందరు కత్తులు, గొడ్డల్లతో దాడి చేశారు. కారు ధ్వంసం చేశారు. ఆ తరువాత కారులో కూర్చుని ఉన్న హాసినీని విచక్షణారహితంగా తమ వెంట తెచ్చుకున్న కత్తులు, గొడ్డళ్లతో నరికి పారిపోయారు. అని ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు.

హిజ్రాలకు నాయకురాలుగా ఉన్న అలేఖ్యతో హాసినికి ఎన్నోసార్లు ఘర్షణలు జరిగాయి. వారిపై అనేక జిల్లాల్లో పోలీస్ స్టేషన్ల లో కేసులు నమోదయ్యాయి. ఇదే క్రమంలో హాసినికి సులోచన, షీలా అనే ట్రాన్స్ జెండర్లతో కూడా విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. దీంతో అలేఖ్య, సులోచన, షీలాలు కలిసి హాసినిని చంపాలని ప్రణాళిక వేసుకుని రౌడీషీటర్ భూపతి సాయం తీసుకున్నారు. కొంతమంది సహాయం తీసుకుని పథకం ప్రకారం ముందుగా రెక్కీ నిర్వహించారు. ఆ తరువాత హాసిని ప్రయాణించే కారును అడ్డగించి దాడి చేసి చంపారని ఎస్పీ కృష్ణకాంత్ మీడియా సమావేశంలో వివరించారు.
ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న 15 మందిలో 12 మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. మిగతా వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ వివరించారు. ఈ హత్య కేసుపై దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన నెల్లూరు రూరల్ డీఎస్పి జీ. శ్రీనివాసరావు, కొడవలూరు సీఐ సురేంద్రబాబు తోపాటు పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ అభినందించి రివార్డులు అందజేశారు.

డ్రైవర్ ఏమయ్యాడు?
ఘటన జరిగిన తరువాతి నుంచి హాసిని ప్రయాణించిన కారు డ్రైవర్ ఆచూకీ లేకుండా పోయాడని తెలిసింది. అంతేకాకుండా ఈ కేసులో తిరుపతికి చెందిన మరో ఇద్దరు రౌడీషీటర్లు కూడా తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో సుపారీ ఇచ్చారా? లేక హిజ్రా సంఘం నాయకురాళ్ల మధ్య ఆధిపత్య పోరువల్లే ఈ హత్య జరిగిందా? హత్య జరిగే సమయంలో హాసిని ధరించిన నగలు ఏమయ్యాయి. ఎవరు తీసుకుని వెళ్లారు. అనే ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి. నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ మీడియా సమావేశంలో కూడా డ్రైవర్, నగల అంశం ప్రస్తావనకు రాలేదు. దీంతో ఈ కేసు మిస్టరీ పూర్తి స్థాయిలో వీడలేదనే భావిస్తున్నారు.
Read More
Next Story