వైఎస్సార్‌సీపీకి ఇక్బాల్ అహ్మద్ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆ పార్టీకి మరింత బలం వచ్చింది. బాలకృష్ణ గెలుపు సునాయాసమేనని పలువురు అంటున్నారు.
జి. విజయ కుమార్
ఇన్నాళ్లూ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జిగా ఉన్న ఇక్బాల్ అహ్మద్ రెండు రోజుల క్రితం ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. అప్పట్లో చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉండేవి. ఉద్యోగ రిత్యానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చంద్రబాబును ఇక్బాల్ అభిమానించే వారు. ఇద్దరూ రాయలసీమ వాసులు కావడంతో ఇద్దరి మధ్య సంబంధం మరింత బలపడింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై ముస్లిమ్‌మైనార్టీ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకుని పనిచేశారు. చంద్రబాబు ఇక్బాల్‌కు ఈ అవకాశం కల్పించారు. ఎన్‌టీ రామారావును పదవీ చ్యుతుడిని చేసిన సమయంలో జరిగిన వైశ్రాయ్ ఎపిసోడ్ సమయంలో ఇక్బాల్ ఆ ప్రాంతానికి ఏపీసీపీగా ఉన్నారు. శాంతిభద్రతల విషయంలో తగు చర్యలు తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచి చంద్రబాబుతో స్నేహం కొనసాగుతూ వచ్చింది. ఒక రకంగా ఆయన రాజీనామాతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ వెంట ఉన్న ముస్లిం మైనార్టీ వర్గాలు ఇక్బాల్ వెంట నడిచే అవకాశాలు ఉన్నాయి.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ గెలుపే..
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలు ప్రతి సారి టీడీపీకి పట్టం కడుతూ వచ్చారు. కంచుకోటను బద్దలు కొట్టాలని నాలుగు దశాబ్దాలుగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నా ఫలితం లేకుండా పోయింది.
వైఎస్సార్ గట్టి ప్రయత్నమే చేశారు..
హిందూపురం స్థానాన్ని కైవసం చేసుకోవాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. వేసవి వచ్చిందంటే చాలు హిందూపురం నగరంలో తాగడానికి నీళ్లు దొరకడం గగనం. ఇందులో భాగంగానే తాగునీరు అందిస్తే ప్రజలు ఆదరిస్తారనే ఉద్దేశంతో అనంతపురం సమీపంలోని పీఏబీఆర్ నుంచి పలు నియోజకవర్గాలను కలుపుతూ వందల కోట్లు ఖర్చు చేసి దాదాపు 400 కిమీ పైప్‌లైన్ వేసి హిందూపురం పట్టణానికి తాగునీరు అందించారు. అయినప్పటికీ అక్కడి ప్రజలు టీడీపీ అభ్యర్థినే గెలిపించారు.
వైఎస్ జగన్ ప్రత్యేక ఫోకస్..
వైఎస్సార్ మరణానంతరం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దశాబ్ధకాలంగా హిందూపురం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడమే కాకుండా విజయం కోసం గట్టి ప్రయత్నమే చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే 2019లో జరిగిన ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ అహ్మద్‌ను రంగంలోకి దింపారు. అయినా ఆయన విజయం సాధించలేక పోయారు. టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అప్పట్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్‌పై 17,028 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హిందూపురం నియోజకవర్గంపై మరింత ఫోకస్ పెట్టి ఇక్బాల్ అహ్మద్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రజలకు దగ్గరయ్యేలా చేశారు. ఈ సారి జరగనున్న ఎన్నికల్లో ఇక్బాల్ అహ్మద్ గట్టి పోటీ ఇస్తారని, విజయం సాధించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని నియోజకవర్గ ప్రజలూ కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. అయితే అనుకోని విధంగా ఇక్బాల్‌ను కాదని నియోజకవర్గానికి ఏమాత్రం పరిచయం లేని టిఎన్ దీపికను రంగంలోకి దింపారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఇక్బాల్ వైఎస్సార్‌సీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీఈపీలో చేరడంతో నందమూరి బాలకృష్ణ గెలుపు నల్లేరుపై నడకేనని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Next Story