ఆంధ్రను అల్లకల్లోలం చేస్తున్న వర్షాలు.. స్పందించిన సర్కార్
x

ఆంధ్రను అల్లకల్లోలం చేస్తున్న వర్షాలు.. స్పందించిన సర్కార్

ఏపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలు బాగానే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.


ఏపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలు బాగానే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రాజమండ్రి దగ్గర గోదావరి ఉధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర కూడా నీటి మట్టం పెరిగింది. దీంతో వరదలు నియంత్రించడంలో భాగంగా లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు అధికారు. అయినా పరిస్థితులు అంతగా మారినట్లు కనిపించడం లేదు. విశాఖ సహా పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల తాకిడికి రోడ్లపై వర్షపు నీరు నదులను మించిన ఒరవడితో పారుతోంది. వీటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లలేక ఉద్యోగస్తులు, పాఠశాలలకు వెళ్లలేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షపు నీటి దెబ్బకు మోటారు వాహనాలు కూడా చతికిలబడి చేతులెత్తేస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాక ప్రజలు అయోమయంలో పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాల ప్రభావంపై కూటమి సర్కార్ స్పందించింది. అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సహా హోం మంత్రి వంగలపూడి అనిత కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రాణ నష్టం జరగకూడదు: చంద్రబాబు

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్ర పరిస్థితులపై ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని చెప్పారు. ప్రతి జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. గతంలో విచ్చలవిడిగా జరిగిన మట్టి, ఇసుక అక్రమ తవ్వాల కారణంగా గోదావరి కట్టలు బలహీనపడ్డాయని, వాటిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని విమత్తులు వచ్చినప్పుడు వారు తమ సమర్థతను కనబరచాలని చెప్పారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వరదల కారణంగా ఒక్క ప్రాణం కూడా పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘రాష్ట్రంలోని అన్ని ఆనకట్టలు, బ్యారేజీల పరిస్థితులపై దృష్టి పెట్టండి. ఒక్క ప్రాణం కూడా పోకుండా చర్యలు తీసుకోండి. ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా. ఎక్కడిక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీస్తూ కావాల్సిన చర్యలు తీసుకోండి’’ అని చంద్రబాబు వివరించారు.

ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్: అనిత

రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న క్రమంలో అధికారులకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వర్షాల కారణంగా ప్రజలకు నష్టం వాటిల్లకుండా కావాల్సిన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం వర్షాల తాకిడి అధికంగా ఉన్న ఏలూరు, అనకాల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల విషయంలో అధికారులు కూడా ముందుచూపుతో వ్యవహరించాలని చెప్పారామే.

రైతులను ముంచేసిన వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు రైతున్నలను ముంచేశాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో భారీ వర్షారు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల ఆయా నియోజకవర్గాల్లో 7 వేల ఎకరాలు నీట మునిగాయి. ఇలాంటి పరిస్థితే పలు ఇతర జిల్లాల్లో కూడా తారసపడుతోంది. ఈ తరుణంలో పంటలను కాపాడుకోవడానికి రైతులు నానాతిప్పలు పడుతున్నారు. ఇప్పటికే పంటలు మునిగిపోయిన రైతులు ఏం చేయాలో అర్థం కాక బరువెక్కిన గుండెలతో భారమంతా దేవుడిపైనే వేసినట్లు చెప్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Read More
Next Story