పరవాడ ప్రమాదంపై హోంమంత్రి అనిత సీరియస్.. డిప్యూటీ సీఎం విచారం
ఫార్మా కంపెనీల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్యుతాపురం ప్రమాదం మరువక ముందే ఈరోజు పరవాడ సినర్జీ ఫార్మా సంస్థలో మరో ప్రమాదం జరిగింది. కెమికల్స్ కలుపుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫార్మా కంపెనీల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్యుతాపురం ప్రమాదం మరువక ముందే ఈరోజు పరవాడ సినర్జీ ఫార్మా సంస్థలో మరో ప్రమాదం జరిగింది. కెమికల్స్ కలుపుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఝార్ఖండ్‌కు చెందిన నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా వారిని హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం వారి పరిస్థితి, వారికి అందిస్తున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రసాయనాలు కలిసే సమయంలోనే ప్రమాదం జరిగిందని అనిత చెప్పారు. క్షతగాత్రులకు అందించే వైద్యం విషయంలో సందేహాలు ఏమీ అవసరం లేదని, వారికి కావాల్సిన వైద్యాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణం
పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలకు యాజమాన్యాల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనబడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. లాభాలపై పెడుతున్న ఏకాగ్రత సంస్థలో పనిచేసే కార్మికుల భద్రతపై యాజమాన్యాలు పెట్టడం లేదంటూ మండిపడ్డారు. ప్రతి పరిశ్రమ యాజమాన్యం కూడా భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘అతి త్వరలోనే పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తాం. ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి.. ప్రతి పరిశ్రమలో భద్రత ప్రమాణాలపై దర్యాప్తు చేయిస్తాం. కమిటీ ఇచ్చే నివేదికను బట్టి సరైన భద్రత పాటించని సంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. తద్వారా ఇటువంటి ప్రమాదాలు పునరావృత్థం కాకుండా నియంత్రణ సాధ్యమవుతుంది’’ అని చెప్పుకొచ్చారు.
మరో ప్రమాదం బాధాకరం: పవన్
‘‘అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో ప్రమాదం జరిగి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే పెందుర్తి నియోజకవర్గం పరిధిలోనున్న జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్డేడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి వేళ సంభవించిన ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిసి చాలా బాధ కలిగింది. పొట్టకూటి కోసం ఝార్ఖండ్ నుంచి వచ్చిన కార్మికులలో నలుగురు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉండడం విషాదకరం. ప్రమాదకరమైన రసాయనాలతో ఉత్పత్తులను తయారుచేసే ఫార్మా కంపెనీలలోనే ప్రమాదాలు తరచూ జరగడం యాజమాన్యాలు, సంబంధిత అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. సంఘటన గురించి తెలిసిన వెంటనే గాయపడిన వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబును ఆదేశించడమైంది. ఆయన ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు అందుతూనే ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. వారికి అన్ని విధాల ఎన్‌డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను’’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.