విశాఖపట్నం రైల్వేజోన్‌పై ఆశలు ఆవిరవుతున్నాయి. కేంద్రం ఈ జోన్‌ విషయం బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. వేల ఉద్యోగాలు వస్తాయన్న ఆశలు ఆవిరవుతున్నాయి.


విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటించి ఆరేళ్లైంది. ఇప్పటికీ అతీ గతీ లేదు. రైల్వే జోన్‌ వల్ల ఏపీలో వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రజలు కలలు కన్నారు. అవి కలలుగానే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వేజోన్‌ ఏర్పాటుకు స్థలం కావాలని కేంద్ర రైల్వేశాఖ కోరింది. అందుకు కావలసిన స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ స్థలానికి ప్రభుత్వం చెల్లించాల్సిన పరిహారం చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. విశాఖ రైల్వేజోన్‌ వ్యవహారాన్ని ప్రజలు, ప్రభుత్వం మరిచిపోయిందని భావించి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించి విశాఖపట్నం రైల్వేజోన్‌ను ముందుకు నడిపిస్తారనుకుంటే అది జరగలేదు. అసలు విశాఖ రైల్వేజోన్‌ వ్యవహారమే బడ్జెట్‌లో రాలేదు. దీనిని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న కేంద్రం విశాఖ రైల్వేజోన్‌ వ్యవహారాన్ని ఎందుకు పట్టించుకోలేదనేది ప్రశ్న.

కేంద్ర బడ్జెట్‌ బాగుంది. బడ్జెట్‌ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని రిటైర్డ్‌ అర్థశాస్త్ర ఫొఫెసర్‌ గరికముక్కల సవరయ్య అభిప్రాయపడ్డారు. ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌ పరంగా కానీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా ఎంప్లాయ్‌మెంట్‌ కల్పించాలనే ఆలోచన కానీ, తయారీ రంగం గురించిన ఆలోచన కానీ, ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాల కల్పన విషయంలో తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు. పరిశ్రమలకు పోత్సాహం ఇచ్చారని, వ్యవసాయ రంగంపై కూడా మంచి ఆలోచనలు చేశారని తెలిపారు. బడ్జెట్‌ మొత్తం మీద నొప్పించక, తానొవ్వక అన్నట్లు ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే సరికి విభజన హామీలు అమలు చేస్తామని చెబుతూ అమరావతి రూ. 15వేల కోట్లు ఇస్తామన్నారే కాని గ్రాంటు కింద ఇస్తామని చెప్పలేదన్నారు. బుందేల్‌ ఖండ్‌ ప్యాకేజీ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ. లక్ష కోట్లు ఆంధ్రపదేశ్‌కు గ్రాంటుగా ఇవ్వాలని కోరినా చివరకు దక్కిన హామీల్లో అమరావతి ఒక్కటేనన్నారు. అది కూడా గ్రాంటుగా ఇస్తామని చెప్పలేదని, పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తామన్నారే తప్ప ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు. ఇంక ఎంత ఇస్తారనేది స్పష్టం చేయలేదన్నారు. బీహార్‌కు గ్రాంట్స్‌గానూ, లోన్స్‌ రూపంలోనూ ఏపీకంటే ఎక్కువగా నిధులు కేటాయించారని, తెలంగాణకు ఒక్కపైసా కూడా కేటాయించకపోవడం వివక్షతో కూడుకున్నదేన న్నారు. ఇక విశాఖపట్నం రైల్వేజోన్‌ విషయం ప్రస్తావించకపోవడం అన్యాయమన్నారు.
విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ రైల్వే డివిజన్లు విశాఖ డివిజన్‌లో భాగంగా ఉంటాయి. వాల్తేరు రైల్వే డివిజన్‌ను రెండు భాగాలు చేసి, దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ పరిధి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కొంతమేరకు తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది.
2014 నాటి ఆంధ్ర ప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక రైల్వే జోన్‌ ఏర్పాటులో సాధ్యాసాధ్యాలను పరిశిలించి ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌ లోని అత్యధిక శాతం రైల్వే మార్గం సికింద్రాబాద్‌ కేంద్రంగా పనిజేసే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండేది. దువ్వాడ మొదలు విశాఖపట్టణం, శ్రీకాకుళం మీదుగా ఇచ్ఛాపురము వరకు, విజయనగరం మొదలు పార్వతీపురము మీదుగా కూనేరు వరకు, కొత్తవలస మొదలు అరకు మీదుగా గోరాపుర్‌ వరకు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతపు రైల్వే మార్గం తూర్పు కోస్తా రైల్వే జోన్‌ పరిధిలో ఉండేది. ఇది భువనేశ్వర్‌ కేంద్రంగా పనిచేసేది. విశాఖపట్టణం వరకు ఉన్న రైళ్ళను భువనేశ్వర్‌ వరకూ తరలించడం వంటి చర్యలతో భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ పక్షపాతంతో పనిచేస్తున్నదన్న అభిప్రాయం కలిగింది. విశాఖపట్టణం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ కావాలన్న కోరిక ప్రజల్లో బలంగా ఉండేది.
ఈ నేపథ్యంలో 2019 ఫిబ్రవరి 27 న భారత ప్రభుత్వ రైల్వే శాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటును ప్రకటించింది. అప్పట్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ, భారతీయ జనతా పార్టీలు ప్రభుత్వ ప్రకటనను స్వాగతించగా, డివిజను కోసం పోరాటం చేస్తున్న రైల్వే జోన్‌ సాధన సమితి వంటి ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, తెలుగు దేశం పార్టీ, కాంగ్రెసు పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు దీన్ని విమర్శించాయి. వాల్తేరు డివిజన్‌ ఎత్తివేయడం, ఆ డివిజన్‌లోని ప్రధాన ఆదాయ వనరైన సరుకు రవాణా మార్గాన్ని రాయగడ డివిజనుకు తరలించడాన్ని వ్యతిరేకించారు. రైల్వే ఉద్యోగ నియామక కేంద్రం (రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) విశాఖపట్నంలో ఉంటుందో లేదో నన్న ఆందోళన కూడా ప్రజల్లో ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో రైల్వేజోన్‌కు నిధులు కేటాయింపు లేకపోవడం అంటే ఏపీ ప్రజలను అవమానించడమేనని ప్రజలు అంటున్నారు.
Next Story