విజయసాయి రెడ్డి ట్వీట్ చెప్పే చక్కటి చిక్కటి కథ ఏంటంటే...
x

విజయసాయి రెడ్డి ట్వీట్ చెప్పే చక్కటి చిక్కటి కథ ఏంటంటే...

ప్రధాన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేెక హోదా ఇవ్వాలనే డిమాండ్ ను హాయిగా మర్చిపోయాయి. దీని వెనక దాగిన చరిత్రను గుర్తు చేసే ట్వీట్ ఇది.


సై (2004) సినిమాలో వేణుమాధవ్ కామెడీ సీన్ గుర్తుందా?

చక్కగా పెయింట్ గొట్టిన ఒక గోడమీద నల్లబాలు (వేణుమాధవ్) కాలేజీ ఎన్నికల నినాదం రాయిస్తూ ఉంటాడు.

ఇంతలో ఇంటాయన వాకింగ్ చేసుకుంటూ వచ్చి ఇదేంటి ఇలా చేస్తున్నారు, పర్మిషన్ తీసుకున్నారా అని మోటార్ సైకిల్ మీద లెక్కలేకుండా పడుకుని ఉన్న నల్లబాలుని అడుగుతాడు. కాలేజీ ఫేక్ జులాయి అయిన నల్లబాలు నల్ల తాచులాగా లేస్తాడు. మర్యాదగా భుజాన వేసిన చేయ్యిని తీసేయమంటాడు. తాను వూరంతటికి రౌడీ అని, హైదరాబాద్ ఓల్డ్ సీటి తోపు అని చెబుతాడు. నానా హంగామా చేస్తాడు. ఆ వచ్చిన వ్యక్తిని తన్నేంత పనిచేస్తాడు. ఈ లోపు పోలీసుల జీపొస్తుంది. అందులో నుంచి దిగిన జవాన్లు ఆయనకు సెల్యూట్ కొడతారు. ఆవచ్చింది పోలీసాఫీరని వాసనొచ్చి నల్లబాలులో వణుకుమొదలవుతుంది. లాకప్ ఉన్న వాడ్ని ఎన్ కౌంటర్ లో లేపేయమని ఆఫీసర్ జవాన్లకు చెప్పే సరికి నల్లబాలు చచ్చి సగమవుతాడు. ఆ తర్వాత ఎన్ని వికారాలు పడతాడో చెప్పలేం.

ఇలాంటికామెడీ సీన్ తెలుగు రాష్ట్రాల్లో కనబడుతూ ఉంది.


ఈ రోజు వైఎస్ ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఒక చక్కటి ట్వీట్ చేశారు.


బిజెపి-టిడిపి-జనసేన పార్టీల కూటమికి ఒక సవాల్ విసురుతూ వదలిని బాణం అది. పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామనే విషయాన్ని ఈ కూటమి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాలని సవాల్ విసిరారు. అందుకే ఈ ట్వీట్ చాలా ఆసక్తికరమయింది. ప్రత్యేక హోదా డిమాండ్ కేంద్రానికి నచ్చని డిమాండ్. ప్రధానికి ఏమాత్రం గిట్టని డిమ ాండ్. 2019 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఫలితాలు చూశాక ప్రధానికి నచ్చని డిమాండ్ చేసే ధైర్యం రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ కి లేదు. ఇపుడు

ఈ డిమాండ్ ను ఆంధ్రలో ఎవరూచేయడం లేదు. రాష్ట్ర బిజెపికి ఈ డిమాండ్ చేసే స్థితిలేదు. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల తర్వాత వదిలేసింది. వైసిపి కూడా మోదీ బలం చూశాక దీన్ని మర్చిపోయింది. ఆ మధ్య జైభారత్ పార్టీ పెట్టిన వివి లక్ష్మీనారాయణ మాత్రం అపుడపుడు ప్రత్యేెక హోదాఅంటున్నారు. ఇపుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ప్రత్యేక హోదా అంటున్నారు. చిన్న పార్టీల చేస్తున్న ఈ డిమాండ్ ను మేధావులు పెద్దగా గుర్తించడం లేదు.

ఈ చరిత్రను గుర్తు చేసేలా ఈ ట్వీట్ సకాలంలో వచ్చింది. ఈ ట్వీట్ రెండు విషయాలను గుర్తు చేస్తుంది. ఒకటి. నల్లబాలు కామెడీ సీన్. రెండు పార్టీలు విస్మరించిన ప్రత్యేక హోదా చరిత్ర. ఎలాగో ఏమిటో చూద్దాం.


స్టోరీ బ్యాక్ గ్రౌండ్


ఆంధ్ర ప్రదేశ్ లో 2019 ఎన్నికలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ చుట్టూ తిరిగాయి. అంత వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ రెండు పోటీపడి ఈ నినాదాన్ని వినిపించాయి. ఈ నినాదమే తమని గట్టెక్కిస్తుందని రెండు పార్టీలు నమ్మాయి. అంతకుముందు ప్రత్యేక రాష్ట్రం హోదాను గాలికి వదిలేసి, ప్యాకేజీకి ఒప్పుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం మీద వ్యతిరేకత ఉందని తెలుసుకుని మళ్లీ ప్రత్యేక హోదా నినాదం అందుకున్నారు. ఇక వైఎస్ ఆర్ కాంగ్రెస్ రెచ్చిపోయి పెద్ద డ్రామాకు ఢిల్లీ లో తెరలేపింది. చంద్రబాబు తమకు భయపడే మళ్లీ ప్రత్యేక హోదా అంటున్నాడని అప్పటి ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించేవారు.

ఢిల్లీలో ప్రత్యేక హోదా డ్రామా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా అనే సరికి జగన్ కొత్త వ్యూహం ఆలోచించాల్సి వచ్చింది.

2018 మార్చి 31 జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపిలు ప్రత్యేక హోదాకోసం పదవులకు రాజీనామా చేస్తారని, తర్వాత పార్లమెంటు సమావేశాల చివరి రోజునుంచి నిరవధిక నిరాహార దీక్షను ఢిల్లీలో ప్రారంభిస్తారని ప్రకటించారు. అపుడాయన తన సుదీర్ఘ పాదయాత్రలో ఉన్నారు. యాత్ర గుంటూరు సమీపానికి వచ్చాక ఒక బహిరంగ సభలో మాట్లాడు తూ ప్రత్యేక హోదా పోరాట కార్యక్రమం విడుదల చేశారు. దాని ప్రకారం ఢిల్లీలో ఎంపిలు నిరాహార దీక్షలో కూర్చొంటారు. విద్యార్థులు యూనివర్శిటీలో దీక్షలు జరుపుతారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ లీడర్లూ క్యాడరూ నిరాహార దీక్షలో పాల్గొంటారని అన్నారు. "మార్చి 15 వరకు, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కు వ్యతిరేకంగా ఉన్నాడు, మేము అన్ని రాజకీయ పార్టీల నుండి మద్దతు పొందిన తర్వాత అతను యు-టర్న్ తీసుకున్నాడు, హోదా గురించి మాట్లాడటం ప్రారంభించాడు,"అన్నాడు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి ఏప్రిల్ 5 2018 దాకా గడువు ఇచ్చారు. ఏప్రిల్ అయిదు రానే వచ్చింది. జగన్ అల్టిమేటమ్ నుంచి ప్రధాని పట్టించుకోలేదు. ఇతర పార్టీలు పట్టించుకోలేదు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎంపిలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి,వైవి సుబ్బారెడ్డి, వరప్రసాద్, ఎం రాజమోహన్ రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ రాజీనామాలను ఆమోదించారు.





ఇక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి ప్రత్యేక హోదో పోరాటం గురించి చూద్దాం.

ఆయన ఈ హోదా సాధన కోసం మొదట ప్రధానిమోదీతో రాజీ పడ్డారు. హోదా బదులు ప్యాకేజీకి ఒప్పకున్నారు. హోదాకంటే ప్యాకేజీ బరువైంది, లాభసాటి అన్నారు. రోజులు గడిచే కొద్ది, రాష్ట్రంలో హోదా మీద వత్తిడి పెరుగుతూ ఉండటం, కేంద్రం మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉందని రిపోర్టులురావడం తో ఆయన ప్రత్యేక హోదా పోరాటానికి నిర్ణయించుకున్నారు.




దీని కోసం ఆయన ప్రతిపక్ష కూటమిలో చేరుతున్నానని ప్రకటించారు. వాళ్ల మద్దతుతో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానన్నారు.




ఈ రెండుపార్టీలో నల్లబాలు లాగా ప్రధాని మోదీ ముందు చిందులేశాయి. కేకలేశాయి. హోదా హక్కు అన్నాయి. హోదా పక్కా అన్నాయి. హోదా ఇవ్వక పోతే, నీ పని ఫసక్ అని కేంద్రాన్ని బెదించాయి. ఈ పోరాటం ఇలా కొనసాగుతుండగానే 2019 ఎన్నికలు వచ్చాయి. మోదీ తిరుగులేని శక్తిగా వచ్చి తన అసలు రూపం చూపించారు. దీనితో రెండు పార్టీలు తొక ముడిచాయి. మోదీకి పార్లమెంటు లో అంతబలం ఉంది, మనమేం చేయగలం, ఏమి అడగ్గలం వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా డిమాండ్ ను గాలికి వదలిశారు. పొరపాటయింది. కాంగ్రెస్ తో చేతులు కలిపి ఉండాల్సింది కాదు, అని చంద్రబాబు చెంపలేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడుగాని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడిందే లేదు.

ఈ రోజు వచ్చిన వైసిసి సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ ని చూస్తే ఎవరికైనా ఈ చరిత్ర మొత్తం గుర్తుకొస్తుంది. తెలుగువాళ్లు ప్రత్యేక హోదాను మర్చిపోవాల్సిందే. ప్రధాని మోదీ కళ్లలోకి చూసి ఏదయినా పెద్ద డిమాండ్ చేసే ధైర్యం ఉన్న లీడర్లు ఇపుడు దేశంలోనే లేనట్లున్నారు.

మోదీ వేటకు విలవిల అని ఆంధ్రజ్యోతిలో లో రాధాకృష్ణ రాసింది అక్షరాలా నిజం.

“గడచిన దశాబ్ద కాలంగా దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, భారతీయ జనతా పార్టీతో తీవ్రంగా విబేధించిన వారే కాదు, అతిగా అంటకాగిన వారు కూడ బతికి బట్ట కట్టలేని పరిస్థితి... మోదీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడూ గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయ చేసుకోగలుగుతున్నారు. ధిక్కరించిన వారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి.”

ఈ పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు గాని,జగన్మోహన్ రెడ్డి గాని, పవన్ కల్యాణ్ గాని ప్రధాని మోదీకి ఇష్టం లేని ప్రత్యేక హోదా ఇచ్చితీరాలని ఆయన కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగే అవకాశం ఉందా?

అందుకే తెలుగు ప్రధాన పార్టీల రాజకీయాలను చూస్తే నల్లబాలు గురొస్తాడు.


Read More
Next Story