'వర'మైన తంబిల మంత్రం..!
తమిళ మంత్రం వరప్రసాద్ కు వరమైందా!? ఉదయం బిజెపిలో చేరిన ఆయనకు సాయంత్రానికి టికెట్ దక్కడానికి అదే కారణమా!?
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: పొద్దున్నే బీజేపీలో చేరారు. సాయంత్రానికి అభ్యర్థిత్వం ఖరారు చేయించుకున్నారు. తిరుపతి ఎస్సీ రిజర్వుడు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఎమ్మెల్యే వెలగపల్లి ప్రసాదరావు దక్కించుకున్నారు. దీని వెనక తమిళనాడు నుంచి సాగించిన లాబీయింగ్ ఫలితం ఇచ్చిందని తెలిసింది. దీని వెనక పెద్ద కథ ఉన్నట్లు సమాచారం.
వెలగపల్లి ప్రసాదరావు నెల్లూరు జిల్లా గూడూరు ఎస్సీ రిజర్వుడు శాసనసభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ పార్టీ ఈ ఎన్నికలకు టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన గత కొన్ని నెలల నుంచి ఏదో ఒక పార్టీలో చేరాలని ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా గత నెలలో ఆయన ప్రకటించారు.
కలిసొచ్చిన తంబిల సహకారం!
తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేయడమే ఆయనకు లాభించిందని తెలుస్తోంది. ఆ పరిచయాలు, గతంలో ఎంపీగా పనిచేసిన సమయంలో, ఏర్పడిన అనుబంధం కూడా ఆయనకు తోడ్పాటు అందిచ్చాయని సమాచారం. వీటన్నిటికీ తోడు తమిళనాడులో నివాసం ఉండే వెలగపల్లి ప్రసాదరావు ఆ రాష్ట్ర బిజెపి నాయకులు, సహచర మాజీ ఐఏఎస్ లతో సత్సంబంధాలు కలిగిన ప్రసాద్ రావు వీటన్నిటిని సకాలంలో సక్రమంగా వినియోగించుకున్నట్లు భావిస్తున్నారు. రోజుల వ్యవధిలో ఈ కార్యక్రమాలను చక్కదిద్దుకున్న ఎమ్మెల్యే వరప్రసాదరావు తిరుపతి ఎంపీ సీట్ సాధించుకోవడంలో సఫలమై తనను తిరస్కరించిన వైఎస్ఆర్సిపి కి ఛాలెంజ్ విసిరినట్లు భావిస్తున్నారు.
తమిళనాడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి
రాజకీయాల్లోకి రాకముందు వెలగపల్లి ప్రసాదరావు తమిళనాడు బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా 1983 నుంచి ఉద్యోగ సేవలు ప్రారంభించారు. 2007 వరకు తమిళనాడు లోని వివిధ జిల్లాలతో పాటు ఉన్నత స్థాయిలో ఆయన పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం వెలగపల్లి ప్రసాదరావు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా తిరుపతి ఎంపీ సీటు నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరిన ఆయన 2014 ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆయనను గూడూరుకు బదిలీ చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించారు.
వీడని పట్టు..
దీంతో ఆయన రాజకీయాల్లో కొనసాగాలని దృఢ సంకల్పంతో ఐఏఎస్ అధికారిగా తమిళనాడులో ఉన్న పరిచయాలు, ఆ రాష్ట్ర బీజేపీ నేతలతో ఉన్న సంబంధాలు, ఎంపీగా పని చేసినప్పుడు ఢిల్లీలో ఏర్పడిన పరిచయాలను ఆలంబనగా చేసుకొని చురుగ్గా ప్రయత్నాలు చేయడంతో తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు.
కలిసొచ్చే అంశాలే..
రెండుసార్లు ఎంపీగా తిరుపతి నుంచి పోటీ చేసిన వెలగపల్లి ప్రసాదరావు ఒకసారి గెలిచారు. దీంతో ఎస్సీ, మాల సామాజిక వర్గానికి చెందిన వెలగపల్లి ప్రసాదరావుకు ఈ ఎంపీ స్థానంలోని ఏడు నియోజకవర్గాల్లో నాయకులు, ఎమ్మెల్యేలతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నెల్లూరు జిల్లా నుంచి గూడూరు, సూళ్లూరుపేట చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం ఎస్సీ రిజల్ట్‌గా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న వెంకటగిరి, చిత్తూరు జిల్లాలోని తిరుపతి చంద్రగిరి, శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజకవర్గాల్లో వైయస్సార్సీపి నుంచి తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి వల్ల అనేక అంశాలు తనకు లభిస్తాయని వెలగపల్లి ప్రసాదరావు ధీమాగా ఉన్నారు.
సాత్వికుడు గురుమూర్తి
తిరుపతి ఎస్సీ పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి మళ్ళీ పోటీ చేస్తున్నారు. అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన గురుమూర్తిది శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం. వైఎస్ఆర్సిపి నాయకులతోపాటు ఎమ్మెల్యేలు అందరితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. సాత్వికుడుగా ఆయనకు పేరు ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో ఆయనపై ఒక్క అవినీతి మరక లేదు. తన వద్దకు వచ్చే వారికి లేదు కాదనకుండా పనిచేసే పంపిస్తుంటారని ఆయనకు గ్రామాల్లో పేరు ఉంది.
తిరుపతి పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాథమిక నిర్వహిస్తున్నారు. తమతో పాటు ఎంపీ గురుమూర్తి బాధ్యత కూడా ఆ ఎమ్మెల్యేలే భరించడానికి సిద్ధంగా ఉంటారనేది పార్టీ నాయకులు వినిపించే మాట. అధికార పార్టీలోనే ఉన్న గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపల్లి ప్రసాదరావు, తిరుపతి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. వీరిద్దరి మధ్య పోరాటం అనడం కంటే పార్టీల మధ్య సాగే ఎన్నికల పోరులో ఎవరిని విజయం వరిస్తుందనేది వేచి చూద్దాం.
'మునికి' శాపమైంది..!
యాదృచ్ఛికంగా జరిగే కొన్ని సంఘటనలు.. తలరాతలు మారుస్తుంటాయి. ఆ విధంగా ఒక నాయకుడికి రెండుసార్లు ఒకే వ్యక్తి వల్ల రాజకీయంగా దెబ్బ తగిలింది. గమ్మత్తుగా ఉండే ఈ సంఘటన ఎలా జరిగిందంటే.. సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన రోజులవి. తిరుపతిలో ఆ పార్టీ క్లబ్ కట్టారు. సినీ అభిమానులు మంచి జోష్ మీద ఉన్నారు. అదే సమయంలో తిరుపతి నగరానికి చెందిన ముని బాలసుబ్రమణ్యం, కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన పెనుబల చంద్రశేఖర్ తిరుపతి ఎస్సీ పార్లమెంటు స్థానం నుంచి వచ్చారు. అందులో ముని బాల సుబ్రహ్మణ్యం పేరు ప్రముఖంగా వినిపించింది. అనుహ్యంగా తెర మీదికి వచ్చిన తమిళనాడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెలగపల్లి ప్రసాదరావు ప్రజారాజ్యం ఎంపీ సీటు దక్కించుకున్నారు. దీంతో ముని బాలసుబ్రమణ్యంకు దారులు మూసుకుపోయిన చురుకైన కార్యకర్తల పని చేశారు. ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.
బిజెపిలో మళ్ళీ..
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ముని బాలసుబ్రమణ్యం.. బిజెపిలో చేరారు. అప్పటి నుంచి చురుగ్గా పనిచేస్తున్న ఆయన సత్యవేడు బిజెపి సమన్వయకర్తగా ఉన్నారు. ఈసారి ఎన్నికల కోసం తిరుపతి ఎస్సీ రిజర్వుడ్ పార్లమెంటు స్థానాన్ని ఆయన ఆశించారు. విజయవాడలో స్క్రీనింగ్ తర్వాత ఆయన పేరు ఒకటే ఢిల్లీకి ప్రతిపాదన వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మళ్లీ వెలగపల్లి ప్రసాద్ రూపంలో దురదృష్ట దేవత ముని బాల సుబ్రమణ్యంను వెంటాడింది. ఎంపీ సీటు ఆశించిన ముని బాలసుబ్రమణ్యంకు మళ్లీ నిరాశే ఎదురైంది. " పార్టీ కోసం పని చేస్తా. నాకు అదృష్టం ఉన్నప్పుడు అవకాశం వస్తుంది" అని ముని బాలసుబ్రమణ్యం ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కాలం చెప్పే సమాధానం కోసం ఎదురు చూద్దాం.