తిరుమల శ్రీవారి సన్నిధిలో తన మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును సీఎం ఎన్. చంద్రబాబు కుటుంబం శుక్రవారం జరుపుకుంది. స్వామివారి దర్శనం తరువాత తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో ఆయన కుటుంబం యాత్రికులకు అన్నప్రసాదాలు వడ్డించారు. తద్వారా మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు మొక్కును చెల్లించారు. దీనికోసం టీటీడీ ( TTD) కి రూ. 44 లక్షలు విరాళంగా అందించారు.
సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. దీనికోసం సీఎం చంద్రబాబు ( CM Chandrababu ) తన భార్య నారా భువనేశ్వరి, కొడుకు, మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ తో కలసి గురువారం రాత్రి విజయవాడ నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లారు. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులకు టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. రాత్రికి తిరుమల (TIRUMALa ) లోనే పద్మావతి అతిథిగృహాల సముదాయంలో బస చేశారు.
క్యూ కాంప్లెక్స్ నుంచి...
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సీఎం ఎన్. చంద్రబాబు ఆయన కుటుంబీకులు యథావిధిగానే వీఐపీల కోసం కేటాయించిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ( Vaikuntam Q Complex VQC -1) నుంచి దర్శనానికి శుక్రవారం ఉదయం 8.10 గంటలకు ఆలయంలోకి వెళ్లారు.సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మహద్వారం నుంచి కాకుండా, క్యూకాంప్లెక్స్ నుంచి మాత్రమే వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు అనే మాటను మరోసారి నిరూపించారు.
శ్రీవారి దర్శనం తరువాత సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబీకులకు రంగనాయకులు మండపంలో వేదపండితులు వేదాశీర్వదం అందించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ శ్యామలరావు వారికి శ్రీవారి ప్రసాదాలు అందించడంతో పాటు శేషవస్త్రాన్ని బహూకరించారు. ఉదయం 9.28 గంటలకు శ్రీవారి దర్శననం అనంతరం సీఎం చంద్రబాబు కుటుంబం ఆలయం నుంచి వెలుపలికి వచ్చింది.
ఒకరోజు దాత దేవాన్ష్
తిరుమలలో యాత్రికులకు తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదాలు వడ్డిస్తున్న విషయం తెలిసిందే. దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తుంది. దీనికోసం నిత్యాన్నదాన ట్రస్టు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తన మనవడు నారా దేవాన్ష్ (11) ( Nara Devansh) పుట్టినరోజు కోసం సీఎం చంద్రబాబు తిరుమలకు వచ్చారు. అన్నదాన సత్రంలో యాత్రికులకు ఒకరోజు అన్నప్రసాదాలు వడ్డించడానికి ఒక రోజుకు 44 లక్షలు ఖర్చు అవుతుంది. తన మనవడు పుట్టిన రోజు సందర్బంగా సీఎ చంద్రబాబు ఆ మొత్తం విరాళంగా టీటీడీకి అందించారు. ఈ మేరకు టీటీడీ (TTD ) అన్నదానసత్రంలో దేవాన్ష్ పేరును ప్రకటించారు.
శ్రీవారి దర్శనం తరువాత సీఎం చంద్రబాబు, భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు నారా దేవాన్ష్ తో కాలసి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకున్నారు. అప్పటికే అన్నదాన సత్రంలో ఉన్న యాత్రికులకు సీఎం చంద్రబాబు కుటుంబం అల్పాహారం వడ్డించడం ద్వారా మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు మొక్కును చెల్లించారు.