బాగా చదువుకున్న యువతరం డబ్బు కోసం బెట్టింగ్ యాప్ లను ఆశ్రయిస్తున్నారు. ఈ ఉచ్చులో చిక్కుకున్న తరువాత దిక్కుతోచని స్థితికి వెళ్లిపోతున్నారు.
బెట్టింగ్ అనేది ఒక విధంగా వ్యసనం. చట్ట వ్యతిరేకం. ప్రపంచం ఒక చిన్న కంప్యూటర్ లో కనిపిస్తుండటంతో విదేశాలకు చెందిన సైబర్ మోసగాళ్లు బెట్టింగ్ యాప్ లను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో బెట్టింగ్ లు కడుతూ తమ డబ్బులు పోగొట్టుకొని ఆ బెట్టింగ్ యాప్ లకు బానిసలుగా చదువుకున్న యువతరం మారుతోంది. కేవలం మెదడుకు పనిచెప్పి ఈజీ డబ్బు సంపాదించడం కోసం రేయింబవళ్లు కూర్చుని ప్రత్యేక సాఫ్ట్ వేర్ తయారు చేస్తున్నారు. విదేశాల్లో తయారు చేసిన బెట్టింగ్ యాప్ లను భారత దేశం నిషేధించాలి. ఈ బెట్టింగ్ లను ప్రోత్సహించే వారిని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది.
సోషల్ మీడియాలో ప్రకటనలతో ఆకర్షణ
సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ గురించి ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపుతారు. యువతను ఎక్కువగా ఆకర్షించే విధంగా ప్రకటనలు ఉంటున్నాయి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ యాప్స్ కు ప్రోత్సాహం లభిస్తోంది. స్నేహితులు, కుటుంబ సభ్యులకు బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పడం ద్వారా ప్రజలను ఆకర్షిస్తారు. మొదట్లో చిన్న మొత్తంలో డబ్బు గెలుచుకోవడం ద్వారా ప్రోత్సహిస్తారు. క్రమంగా ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టేలా చేస్తారు.
ఆన్లైన్ గేమ్స్
ఆన్లైన్ గేమ్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహిస్తారు. ఆట మధ్యలో బెట్టింగ్ యాప్స్ గురించి ప్రకటనలు చేస్తారు. ఆటలో గెలిచిన వారికి బెట్టింగ్ యాప్స్ లో డబ్బు జమ చేస్తారు.
రుణ సౌకర్యాలు కల్పిస్తారు..
బెట్టింగ్ యాప్స్ లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి రుణాలు ఇస్తారు. ఎక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడం ద్వారా ప్రజలను ఆర్థికంగా ఇబ్బంది పెడతారు. డబ్బులు కట్టలేకపోతే బెదిరింపులకు గురిచేస్తారు.
బెట్టింగ్ యాప్స్ లో కొన్ని సైకలాజికల్ ట్రిక్స్ ని ఉపయోగిస్తారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నమ్మబలుకుతారు. ఓడిపోయినప్పుడు తిరిగి గెలవచ్చని ఆశ కల్పిస్తారు. ఈ విధంగా బెట్టింగ్ సంస్థలు అనేక రకాలుగా ప్రజలను తమ వలలో వేసుకుంటున్నాయి.
బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాలు
బెట్టింగ్ లో డబ్బులు కోల్పోతే ఆర్థికంగా చితికిపోయి ప్రమాదపు అంచులకు వెళ్లిపోతారు. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలు వస్తాయి. బెట్టింగ్ అలవాటు వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు, బంధాలు తెగిపోతున్నాయి. డబ్బులు పోగొట్టుకున్నవారు నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. అప్పులు చేయడం, ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకోవడం వంటివి జరుగుతాయి.
బెట్టింగ్ యాప్స్ కు ఎలా దూరంగా ఉండాలి..
బెట్టింగ్ యాప్స్ ను డౌన్‌లోడ్ చేయవద్దు. బెట్టింగ్ ప్రకటనలకు దూరంగా ఉండండి. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు బెట్టింగ్ కు పాల్పడుతుంటే వారిని వారించండి. బెట్టింగ్ వ్యసనం నుంచి బయటపడటానికి సహాయం అందించే సంస్థలను సంప్రదించండి.
ఎన్నో సమస్యలు..
పనిలో తప్పులు చేయడం, ఆలస్యంగా ఇంటికి రావడం వంటివి జరుగుతాయి. ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. ఒత్తిడి వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. పోషకాహారం తీసుకోకపోవడం వల్ల బలహీనపడతారు. కుటుంబ సభ్యులతో గొడవలు, విడాకులు వంటివి జరుగుతున్నాయి. పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. బెట్టింగ్ బానిసత్వం ఒక తీవ్రమైన సమస్య. దీని నుంచి బయటపడటానికి మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం చాలా అవసరం.
కొందరు యూటూబర్ల మోసం..
యూట్యూబ్ లో వ్యూస్ తగ్గి డబ్బులు రాకపోతే ఫాలోవర్స్ ని మోసం చేయడం అనేది చాలా తీవ్రమైన సమస్య. చాలా మంది యూట్యూబర్లు డబ్బు సంపాదించడానికి తమ ఫాలోవర్స్ ని మోసం చేస్తున్నారు. చాలా మంది యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహిస్తూ తమ ఫాలోవర్స్ ని బెట్టింగ్ కు బానిసలు చేస్తున్నారు. దీని వల్ల ఎంతో మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. కొంతమంది యూట్యూబర్లు తమ ఫాలోవర్స్ వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీని వల్ల ఫాలోవర్స్ వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
యూ ట్యూబ్ నియంత్రణ
యూ ట్యూబ్ మోసపూరిత కంటెంట్ ని నియంత్రించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఫాలోవర్స్ కి మోసపూరిత కంటెంట్ గురించి అవగాహన కల్పించాలి. ఫాలోవర్స్ ని మోసం చేసే యూట్యూబర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఫాలోవర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్ లో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఎటువంటి పెట్టుబడులు పెట్టాలన్నా లేదా ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ చెయ్యాలన్నా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
యూట్యూబ్ లో వ్యూస్ తగ్గి డబ్బులు రాకపోతే ఫాలోవర్స్ ని బెట్టింగ్ కు బానిసలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేరాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం తెలియజేయాలి?
చట్టం గురించి కూడా అవగాహన అవసరం
యూట్యూబ్ ఫాలోవర్స్ ను బెట్టింగ్ కు బానిసలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న నేరాల గురించి కొన్ని చట్టపరమైన అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మోసం (Section 420, IPC) ఎవరైనా వ్యక్తి ఇతరులను మోసగించి, వారి నుంచి డబ్బు లేదా ఆస్తిని పొందినట్లయితే, అది సెక్షన్ 420 కింద నేరంగా పరిగణించబడుతుంది. యూ ట్యూబర్లు తమ ఫాలోవర్స్ ను బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసగించి, వారి డబ్బును దోచుకుంటే, ఈ సెక్షన్ వర్తిస్తుంది.
ఆర్థిక మోసం (Section 415, IPC) ఎవరైనా వ్యక్తి ఇతరులను తప్పుదారి పట్టించి, వారి నుంచి ఆర్థిక ప్రయోజనం పొందినట్లయితే, అది ఆర్థిక మోసంగా పరిగణించబడుతుంది. యూ ట్యూబర్లు తప్పుడు ప్రకటనలు చేస్తూ, ఫాలోవర్స్ ను ఆర్థికంగా మోసగిస్తే, ఈ సెక్షన్ వర్తిస్తుంది. సమాచార సాంకేతిక చట్టం (Information Technology Act, 2000) ఈ చట్టం ఆన్లైన్ నేరాలను నియంత్రిస్తుంది. యూట్యూబర్లు ఆన్లైన్ లో మోస పూరిత కార్యకలాపాలకు పాల్పడితే, ఈ చట్టం ప్రకారం శిక్షించబడతారు. ఇందులో ముఖ్యంగా సెక్షన్ 66D, ఇది కంప్యూటర్ రిసోర్సెస్ ద్వారా మోసం చేయటం గురించి తెలియచేస్తుంది. పబ్లిక్ గాంబ్లింగ్ చట్టం (Public Gambling Act, 1867) ఈ చట్టం జూదం, బెట్టింగ్ కార్యకలాపాలను నియంత్రిస్తుంది. కొన్ని రాష్ట్రాలలో ఈ చట్టం ప్రకారం ఆన్లైన్ గాంబ్లింగ్ నేరం. వినియోగదారుల రక్షణ చట్టం (Consumer Protection Act, 2019) యూ ట్యూబ్ ద్వారా తప్పుదోవ పట్టించే ప్రకటనలు వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తే, ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.
బెట్టింగ్ మోసాలపై ఐపీఎస్ సజ్జన్నార్ సూచనలు
ఐపీఎస్ సజ్జన్నార్ బెట్టింగ్ మోసాలపై చాలా సీరియస్ గా స్పందించారు. ముఖ్యంగా యువతని బెట్టింగ్ యాప్స్ కి బానిసలుగా మారుస్తూ, వారి భవిష్యత్తుని నాశనం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆయన చెప్పిన కొన్ని ముఖ్యమైన అంశాలు.
దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, అలాంటి యువతను తప్పుదోవ పట్టించే వారిని ఉపేక్షించకూడదని ఆయన అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించే సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. బెట్టింగ్ మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైనా నష్టపోతే, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రోమోట్ చేసే వారి సోషల్ మీడియా అకౌంట్స్ ని అన్ ఫాలో చెయ్యాలని, రిపోర్ట్ చెయ్యాలని సజ్జనార్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు. సజ్జన్నార్ కృషి కారణంగా చాలా మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నుండి వెనక్కి తగ్గారు.
బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న 11 మంది సెలబ్రెటీలపై కేసులు
సామాజిక మాధ్యమాలు వేదికగా మోసపూరిత ప్రకటనలు చేస్తున్న వారిపై మియాపూర్ కు చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, రీతూ చౌదరి, హర్షసాయి మరికొందరు ఉన్నారు. తాము పందేలు కాసి ఖరీదైన కార్లు, సెల్ ఫోన్స్ కొనుగోలు చేశామని, విలాస వంతమైన జీవితం గడుపుతున్నామంటూ యూటూబ్, ఇన్స్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ ల ద్వరా బెట్టింగ్ యాప్ లకు ప్రచారం కల్పిస్తున్నారు. ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.
ఇన్‌ప్లూయెన్సర్స్ ప్రభావం
సోషల్‌మీడియాలో ఇన్‌ప్లూయెన్సర్స్ ప్రభావం నేడు సామాన్య ప్రజలపై చాల ఉంటుంది. ఈ నేపధ్యంలో పలు వ్యాపార సంస్తలు తమ వ్యాపారాభివృద్దికి ఇన్‌ప్లూయెన్సర్‌తో ప్రకటనలు ఇప్పిస్తున్నారు. సాధారణంగా వ్యాపార ప్రకటనలు ఇస్తే తక్కువ మొత్తంలోనే ఆదాయం ఉంటుంది. అదే నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను మార్కెటింగ్ చేస్తే భారీగా ఆదాయం ఉంటుంది. ఈ నేపధ్యంలోనే పలువురు ఇన్‌ప్లూయెన్సర్స్ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన లింక్‌లు తమ సోషల్‌మీడియా ఖాతా ద్వారా తమ ఫాలోవర్స్‌కు చేరే విధంగా మార్కెటింగ్ చేస్తున్నారు. కొందరికి లక్షల్లో వ్యూవర్స్ ఉంటున్నారు.
అందులో కనీసం 10 శాతం మంది అయినా ఆ లింక్‌ను క్లిక్ చేయడంతో బెట్టింగ్ యాప్‌లకు భారీగానే ఆదాయం వస్తుంది, అందులో కొందరు కమిషన్లు తీసుకుంటూ మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్స్ ఇతర రాష్ర్టాలు, దేశాల వేదికగానే కొనసాగుతున్నాయి. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్స్ ఇస్తూ కొంత మంది సోషల్‌మీడియా ఇన్‌ప్లూయెన్సర్స్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇలా సంపాదించిన మనీని విచ్చలవిడిగా కష్టపెడుతూ తాము స్వచ్చంగా సంపాదించామనే బిల్డఫ్ ఇస్తుంటారు. అయితే పోలీసులు ఈ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు, ఇన్‌ఫ్లూయెన్సర్ప్‌పై లోతైనా దర్యాప్తు జరిపితే ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
నెల రోజుల్లో జిల్లాకో సైబర్ క్రైం స్టేషన్
ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లా కేంద్రాల్లో ఒక్కో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ప్రతి జిల్లాలోనూ పోలీసు విభాగంలో ఐటీ క్యాడర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి 200 మంది సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కానిస్టేబుళ్లను ఎంపిక చేసి కాన్పూర్, మద్రాస్ ఐఐటీ ల నుంచి ఆరు నెలల సర్టిఫికేట్ కోర్స్ ను నేర్పిస్తారు. సైబర్ నేరాలపైనే వీరు చదువుకుంటారు. ఆ తరువాత వీరు ఏపీలో మిగిలిన వారికి శిక్షణ ఇచ్చేందుకు మాస్టర్ ట్రైనర్స్ గా ఉపయోగ పడతారు. సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ యూనిట్స్ లో అంతర్బాగంగా సైబర్ ఫోరెన్సిక్ విభాగం కూడా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో 2023తో పోలిస్తే 2024లో 52.4 శాతం ఫిర్యాదులు, 34.3 శాతం కేసులు పెరిగినట్లు రాష్ట్ర పోలీస్ విభాగం తెలిపింది. కోల్పోయిన సొత్తు కూడా 610 శాతం పెరిగిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.