TTD Parakamani | పరకామణిలో చోరీ : చిన్నిబుర్రలో ఎన్ని కుట్రలో..
తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి రెండు అవకాశాలు కలిసొచ్చాయా? కరెన్సీ, వజ్రాలు ఎక్కడ దాచాడు? దీనిని విజిలెన్స్ గుర్తించలేదా?
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ సా...గుతూనే ఉంది. ఇదిలావుంటే.. పరకామణిలో చోరీ వ్యవహారం తెరపైకి వచ్చింది. పెద్దజీయర్ మఠానికి ఉన్న తనిఖీ నుంచి సడలింపు చోరీకి చక్కగా ఉపయోగపడిందా? చోరీ చేసిన కరెన్సీ, వజ్రాలు ఎక్కడ దాచాడనేది పరిశీలిస్తే, నోళ్లబెట్టక తప్పదు.
శ్రీవారి హుండీ కానుకలు లెక్కింపు పూర్తయ్యంది. బయటికి వచ్చే సమయంలో పెద్దజీయర్ మఠం నుంచి ప్రతినిధిగా వెళ్లిన సీవీ. కుమార్ ను అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవిఎస్ఓ) సతీష్ కుమార్ తనిఖీ, ఆయన బృందం చేసింది. ఆయన లోదుస్తుల్లో దాచుకున్న వంద డాలర్లకు సమానమైన తొమ్మిది అమెరికన్ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నాం. దీని విలువ భారత కరెన్సీలో రూ. 72 వేలు.
2023 ఏప్రిల్ 29న ఏవీఎస్ఓ ఫిర్యాదు మేరకు తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఐసీపీ 379, 381 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా, గత ఏడాది జరిగిన ఈ ఘటన సద్దుమణిగింది. బీజేపీ నేత వల్ల మళ్లీ డొంక కదిలింది.
తిరుమల పరకామణి నుంచి కనుగప్పి చీమ కూడా లోపలికి వెళ్లలేదు. అలాగే బయటికి రాలేదు. అని ఇప్పటి వరకు అందరికీ ఉన్న నమ్మకం. జీయర్ మఠం ప్రతినిధి విదేశీ కరెన్సీ చోరీ చేసిన తీరు కలకలం రేపింది. నమ్మలేని కొన్ని వ్యవహారాలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.
సాధారణంగా..
తిరుమల పెద్దజీయర్ స్వామికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. శ్రీవారి కైంకర్యాలు పర్యవేక్షించే ఆయనతో పాటు పరివారానికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే శ్రీవారి కైంకర్యాలు నిర్వహించడంలో పెద్దజీయర్ కమాండర్ లాంటి సేవకుడు. వారికి తనిఖీలు ఉండవు. వారి కొలువులో పనిచేసే వారిలో ఓ వ్యక్తి దీనిని అవకాశంగా మలుచుకున్నారు. శ్రీవారి కైంకర్యాలను పర్యవేక్షించే అధికారం పెద్దజీయర్ మఠానికి ఉంది. అదే సందర్భంలో పరకామణికి మఠం ప్రతినిధిగా వెళ్లే వారికి కొన్ని సడలింపులు ఉన్నాయి. ఈ వ్యవహారమే మఠం ఏకాంగి చేతివాటం ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడినట్లు భావిస్తున్నారు.
ఏమి చేశారు..?
సాధారణంగా సరుకులు. కూరగాయలకు వెళ్లడానికి చేతి సంచి వాడడం సహజం. ప్లాస్టిక్ యుగం కాబట్టి, ఆ తరహా సంచులు వినియోగిస్తున్నాం. చేతిలో బరువు ఎందుకని శరీరంలో సంచి కుట్టించుకోలేం కదా. ఇది అందరికీ సాధ్యం కాదు.
తిరుమల శ్రీవారి హుండీ కానుకలు లెక్కించే పరకా మణికి వెళ్లే వ్యక్తి ఆ పని చేశారనే ప్రచారం సాగుతోంది. విదేశీ కరెన్సీ, వజ్రాల చోరీ చేయాలనే ఆలోచన మదిలో మెదలింది. సులువైన మార్గం కోసం ఆలోచన చేసిన ఆ వ్యక్తి సర్జరీతో శరీరంలోనే సంచి కుట్టించున్నాడంట. మర్మాంగాలకు పక్కన తొడల వద్ద ఓ సంచి ఏర్పాటు చేసుకుంటే..! ఇక మాటలు ఉండవు. చోరీకి హద్దులు ఉండవు. ఈ విషయం విజిలెన్స్, పోలీసు అధికారులు పసిగట్టలేదా? గుర్తించినా, ఔదార్యం ప్రదర్శించారా? ఇదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఎంత వాస్తవికత ఉందనేది అధికారులే తేల్చాలి.
శ్రీవారి ఆలయంలో హుండీ కానుకలు లెక్కించడానికి పెద్ద వ్యవస్థ ఉంది. వారితో పాటు శ్రీవారికి కైంకర్యాలు పర్యవేక్షించే పెద్దజీయర్ మఠం నుంచి కూడా ఓ ప్రతినిధి హాజరుకావడం ఆనవాయితీ. ఆ కోవలో సుదీర్ఘకాలంగా జీయర్ మఠంలో ఏకాంగి (గుమస్తా)గా పనిచేస్తున్న సివి. కుమార్ వెళ్లేవారు. శ్రీవారి సేవకులు, బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, టీటీడీ ఉద్యోగులను విజిలెన్స్ అధికారులు, టీటీడీ సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేసిన తరువాత లోపలికి అనుమతిస్తారు.
పరకామణికి వెళ్లే వారు బనియన్, తెల్లపంచె మాత్రమే ధరించాలి. లోదుస్తులు ఉండకూడదు. ఇవన్నీ పరిశీలించిన తీరువాతే అనుమతిస్తారు. కానుకల లెక్కింపు పూర్తయ్యాక కూడా తనిఖీ చేశాకే బయటికి పంపిస్తారు. దీనికి తోడు పరకామణి కేంద్రంలో పైన చుట్టూ సీసీ కెమెరాల నిఘా ఉంటుది. ఈ తతంగాన్ని కంట్రోల్ రూంలో సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. అయినా, ఆ వ్యక్తి చోరీకి పాల్పడిన తీరు అనేక ధర్మసందేహాలకు తెరతీసింది.
మద్రాసులో సర్జరీ
జీయర్ మఠం ప్రతినిధిగా కొన్ని సంవత్సరాల నుంచి రవికుమార్ పరకామణి డ్యూటీకి వెళుతున్నట్లు ప్రచారంలో ఉంది. మిగతా వారి మాదిరి మఠం నుంచి వెళ్లే వారికి తనిఖీలు లేకపోవడం వల్ల రవికుమార్ బుర్రలో ఓ ఆలోచన మెదిలినట్లు భావిస్తున్నారు. చెన్నైకి వెళ్లిన రవికుమార్ తన తొడలమధ్య సర్జరీ చేయించుకుని, ఓ సంచి కుట్టించుకున్నట్లు కొన్ని ఆరోపణలు ప్రచారంలోకి వచ్చాయి. టీటీడీ సిబ్బందే కాదు. తిరుమల మీడియా ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని కథలు కథలుగా చెప్పకుంటూ ఉన్నారు.
పరమాణి కేంద్రంలో సీపీ కెమెరాలు కూడా ఉంటాయి. కానుకలు లెక్కించే సమయంలో ఏమాత్రం చేతివాటం ప్రదర్శించినా, కెమెరాలకు ఇట్టే దొరికిపోతారు. అయితే రోజులు, నెలలు, సంవత్సరాల పాటు శ్రీవారి హుండీకి భక్తులు సమర్పించిన విదేశీ కరెన్సీ, వజ్రాలు, బంగారు కూడా చోరీ చేసి, తీసుకుని వెళుతున్న వ్యవహారం సీపీ కెమెరాలు ఎందుకు పసిగట్టలేకపోయాయి? చోరీ చేసిన సొమ్ముతో పట్టుబడిన తరువాత కూడా నిందితుగు రవికుమార్ పై వచ్చిన ఆరోపణలు తేటతెల్లం చేయడానికి టీటీడీ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది ఎందుకు బయటపెట్టలేకపోయారు? దీని వెనుక రాజకీయ పెద్దలు, అధికారులు ఎవరు ఉన్నారనేది ప్రస్తుతం చర్చకు వచ్చాయి.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు సభ్యుడు జీ. భానుప్రకాశ్ రెడ్డి ఏమంటున్నారంటే...
"పెద్దజీయర్ మఠం నుంచి ప్రతినిధిగా వెళ్లిన రవికుమార్ అనే వ్యక్తి పోగు చేసిన ఆస్తులు చూస్తే, ఇది ఒక రోజు సాగిన వ్యవహారం కాదనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది" అని టీటీడీ బోర్డు సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో "విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని, టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుతో పాటు ఈఓ శ్యామలరావును కోరాను" అని భాను తెలిపారు. రవికుమార్ కు అండగా ఎవరు నిలిచారనే విషయంలో కేసు దర్యాప్తు చేయాలని డీజీపీకి కూడా రెండు రోజుల కిందట ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
చోరీ చేసిన సొమ్ముతోనే తిరుపతిలో రవికుమార్ భారీగా అపార్టుమెంట్లు నిర్మిస్తే, అందులో పది ప్లాట్లు టీటీడీకి గిఫ్ట్ గా తీసుకోవడం ఏమిటి?
తిరుమల FIR No 24/2023లో నమోదు చేసిన ఈ కేసును లోక్ అదాలత్ లో రాజీ చేసుకునే అధికారం ఎవరిచ్చారు? అని కూడా భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.
టీటీడీ విజిలెన్స్ విభాగం డీఎస్పీ స్థాయి అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసు రాజీ కోసం ఒత్తిడి తెచ్చిన సివిల్ పోలీస్ అధికారి ప్రమేయంతో పాటు, శ్రీవారి కానుకలు చోరీ చేసిన వ్యక్తికి అండగా నిలిచిన రాజకీయ పెద్దల ( ముగ్గురు రెడ్లు) సంగతి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? టీటీడీ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.
Next Story