శాసన సభలో ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఏక పక్షంగా సాగింది. శాసన మండలిలో విపక్షం ఉండటం వల్ల పలు అంశాలపై పట్టుబట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిసాయి. శీతాకాల సమావేశాలను బడ్జెట్ సమావేశాలుగా కూటమి ప్రభుత్వం నిర్వహించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. శాసన సభలో జరిగిన విజన్ డాక్యుమెంట్ – 2047 అంశంపై చర్చ అనంతరం నిరవధికంగా వాయిదా వేశారు. అంతకుముందే శాసన మండలిని ఛైర్మన్ కొయ్యే మేషేన్ రాజు నిరవధిక వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నవంబరు 11న ప్రారంభమయ్యాయి. మొత్తం 59 గంటల 55 నిముషాల పాటు సభా కార్యకలాపాలు కొనసాగాయి. 10 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 21 బిల్లులు ఆమోదం పొందాయి. మూడు ప్రభుత్వ తీర్మానాలకు ఆమోదం లభించింది. అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాలపై జరిగిన చర్చల్లో 120 మంది సభ్యులు పాల్గొని చర్చించారు. శాసన సభలో ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఏక పక్షంగా సాగింది. శాసన మండలిలో విపక్షం ఉండటం వల్ల పలు అంశాలపై పట్టుబట్టారు.