మొత్తం పది మంది ఎమ్మెల్యేలు, ఇందులో ఒకరు రాజీనామా చేశారు. మరో తొమ్మిది మంది పార్టీ నేతలను తిరస్కరించారు.


తిరుగుబాటు ఎమ్మెల్యేలది, టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన ఎమ్మెల్యేలదీ ఒకటే మాట. ఈ పదవి ఉంటే ఎంత? పోతే ఎంత? రెన్నళ్ల ముచ్చట. దీనికోసం ఓపెద్ద హడావుడి. నోటీసులు, పిలుపులు, పంచాయతీలు. ఆతరువాత అనర్హత వేట్లు. ఇవేకదా ఈ ప్రభుత్వం చెప్పదలుచుకున్నది. ఓయబ్బ ఇలాంటివెన్నో చూశాము. అందులో ఇదొకటి. ఇదీ నేటి ఎమ్మెల్యేల మాట.

ఆ ఎమ్మెల్యే రాజీనామా చేసి రెండేళ్లు..


ఇంతకూ ఇదంతా ఏందనుకుంటున్నారా.. అదే ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు. పదవులు లేకుండా ఎలా ఉంటారో చూద్దామని ప్రభుత్వ ఆనందం. తనకు ఎమ్మెల్యే పదవి వొద్దని రాజీనామా చేసి సుమారు రెండేళ్లు. ఇప్పటి వరకు ఆయన రాజీనామా విషయమే స్పీకర్‌కు గుర్తుకు రాలేదు. పైగా ఆయన ఆటాడుకోవడానికి రాజీనామా చేయలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజీనామా ఇచ్చారు. అప్పుడు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మరిచిపోయినట్లుంది అనుకున్నారు ఆయన కూడా. రెండేళ్లు పట్టించుకోని స్పీకర్‌ ఇప్పుడు ఎందుకు రాజీనామా ఆమోదించారో చెప్పాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్‌ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. ఆ ఎమ్మెల్యే పేరు గంటా శ్రీనివాసరావు, విశాఖపట్నం వెస్ట్‌ ఎమ్మెల్యే. ఆయన 2021 ఫిబ్రవరి 12న రాజీనామా చేస్తే 2023 జనవరి 23న ఆమోదించారు. మన చట్ట సభ తీరు ఎంత విచిత్రంగా ఉదో తెలిసింది కదా.
టీడీపీ నుంచి వచ్చినవారు ఇప్పుడే గుర్తుకొచ్చారు..


తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు నలుగురు ఎమ్మెల్యేలు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో వీరి చేరికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అంగీకరించలేదు. మీరు రాజీనామా చేస్తేనే మా పార్టీలోకి రండి. లేకుంటే వద్దని మాటవరసకు చెప్పారు. ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా. 2014ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని అక్కున చేర్చుకున్న చంద్రబాబు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లో వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగానే చెలామణి అయ్యారు. అది గుర్తుకు వచ్చిన జగన్‌ రాజీనామా చెయ్యకుండ వద్దన్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుగానే ఇప్పటి వరకు చెలామణి అవుతూ వచ్చారు. వారు ఎవరో తెలుసా.. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్‌రావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. విశాఖపట్నం సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌.
సీఎంను ప్రశిస్తూ వచ్చిన ఆ నలురుగురు


వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్‌ జగన్‌తో డిఫర్‌ అయిన మరో నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లో చేరలేదు. సీఎం పోకడను ప్రశ్నిస్తూ ఈ ఐదేళ్లూ గడిపారు. ఇప్పుడు వారికి పోయేదేముంది. ఎన్నికలకు రెండు నెలల ముందు వీరందరిపై చర్యలు తీసుకుంటే ఏమవుతుంది. ఉంటే ఎంత, పోతే ఎంత? ఇదీ ఇప్పుడు అధికారపక్షంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల మాట. వీరెవరో తెలుసా.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి.
ప్రతి పక్షం నుంచి వచ్చి అధికారపక్షం పంచన చేరిన ఎమ్మెల్యేల మనసులో మాట కూడా ఉంటే ఎంత? పోతే ఎంత? ఎందుకంటే వారు కూడా ఏదో చేద్దామని వచ్చి విసిగిపోయారు. ఇక జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఈయన 2019లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి ఎన్నికయ్యారు. ఈయన కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. అధికారికంగా కాకపోయినా అనధికారికంగా ఈ ఐదేళ్లూ ఆ నియోజకవర్గంలో ఆయన పెత్తనమే చెల్లింది. ఇప్పుడు ఈయన సీటు కూడా చినిగింది. అయితే వీళ్లెవరికీ ఎటువంటి బాధలేదు. ఎప్పుడో వెయ్యాల్సిన వేటు ఇప్పుడెందుకు వేస్తున్నారనే ఆశ్చర్యం తప్ప.
Next Story