58 ఏళ్ల పాటు అందరి ముఖ్యమంత్రుల కాలంలో చేసిన అప్పులకు చెల్లిస్తున్న వడ్డీని కూడా మంత్రి లోకేష్ ప్రస్తావించారు.
సీఎం చంద్రబాబు కొడుకు, మంత్రి నారా లోకేష్ మరో సారి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జగన్ పాలన గురించి, జగన్ హయాంలో చేసిన అప్పులు గురించి నేటికీ కూటమి ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జగన్ హయాంలో చేసిన అప్పులు గురించి కాకుండా వాటికి చెల్లిస్తున్న వడ్డీల గుర్తించి మంత్రి లోకేష్ ప్రస్తావించండం గమనార్హం.
అసలు లోకేష్ ఏమన్నారంటే..
రాష్ట్రంలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి çసృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అందినకాడికి అప్పులు చేశారు. 58 ఏళ్లపాటు అందరు ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పుపై 2019 నాటికి రూ.14,155 కోట్లు వడ్డీ చెల్లిస్తుండగా.. జగన్ రెడ్డి పాలించిన ఐదేళ్ల కాలానికి.. అంటే 2024 నాటికి అప్పులపై కట్టాల్సిన వడ్డీ రూ.24,944 కోట్లకు చేరింది. అంటే అందరు ముఖ్యమంత్రులు చేసిన అప్పుపై కట్టిన వడ్డీ కంటే ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసిన అప్పుపై కట్టే వడ్డీనే సుమారు రూ.11వేల కోట్లు అధికం. జగన్ రెడ్డి ఎంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించారో ఈ గణాంకాలే నిదర్శనం. అంటూ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.
అయితే ఎవరి కాలంలో ఎంత అప్పులు ఉన్నాయి. వాటికి ఎంత వడ్డీల కింద చెల్లిస్తున్నారు. అనే వివరాలను సంవత్సరాల వారీగా వెల్లడించ లేదు. అలా సంవత్సరాలు వారీగా, కనీసం ముఖ్యమంత్రుల వారీగా అయినా పూర్తి స్థాయిలో వివరాలను బహిర్గతం చేసి ఉంటే అందరికీ తెలిసే అవకాశం ఉండేది. దీంతో పాటుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారింలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు సీఎం చంద్రబాబు ఎంత మేరకు అప్పులు చేశారు, ఆ అప్పులకు చెల్లిస్తున్న వడ్డీ ఎంత అనే వివరాలైన వెల్లడించి ఉంటే బాగుండేది. ఎవరి హయాంలో ఎంత అప్పులు చేశారు. వాటికి చెల్లిస్తున్న వడ్డీల కోసం ఎంత చెల్లిస్తున్నారనే వివరాలు ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండేది.
దీనికి తోడు మంత్రి లోకేష్ చేసిన విమర్శలకు, సీఎం చంద్రబాబు చేస్తున్న విమర్శలకు విలువ పెరిగేది. అలా కాకుండా జగన్ హయాంలో 2020–21, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలను వ్లెడించారు. పూర్తి స్థాయిలో వివరాలను వెల్లడించి ఉంటే కూటమి ప్రభుత్వం మీద, సీఎం చంద్రబాబు మీద ప్రజల్లో విశ్వసనీయత పెరిగి ఉండేదని కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరో వాదన కూడా వినిపిస్తోంది. సూపర్ సిక్స్ పథకాల అమలు చేయడం లేదనే విమర్శలు ప్రజల్లో వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వీటి నుంచి బయట పడేందుకు ఆంధ్రప్రదేశ్‌ను జగన్‌మోహన్‌రెడ్డి అప్పుల్లో ముంచేశారని, దానికి కడుతున్న వడ్డీలే వేల కోట్లుల్లో ఉన్నాయని చెప్పి తప్పించుకునే మార్గాలను ఎంచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Next Story