YSR Family

పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలు బద్ద శత్రువులుగా మారితే ఆ తల్లి మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.


‘అమ్మను మించి దైవమున్నదా... ఆత్మను మించి అద్దమున్నదా.. జగమే పలికే శాశ్వత సత్యమిది. ఈ పాట 20వ శాతాబ్దం సినిమా కోసం ప్రముఖ రచయిత సి నారాయణరెడ్డి రచించిన పాట. తల్లి ప్రేమను తెలపడంలో అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది. ఇది తల్లీ పిల్లల సంబంధాలకు అద్దం పట్టే పాట. ఈ పాట సరిగ్గా నేడు వైఎస్సార్‌ కుటంబంలో జరుగుతున్న రాజకీయ చదరంగానికి సరిపోతుందనడంలో సందేహం లేదు. ఈ చదరంగంలో ఎవరు పావో.. తెలిసేది కూడా అమ్మకే. అలాగని నువ్వు పావుగా మారుతావని అమ్మ చెప్ప లేదు కదా... అందుకేనేమో.. అమ్మ విజయమ్మ తన బిడ్డలిద్దరినీ దీవించి.. ఆశీర్వదించి రాజకీయ యుద్దానికి పంపింది. ఈ యుద్దంలో గెలుపు ఓటములు ఓటర్ల చేతిలో ఉంటాయి.

సమరానికి సిద్దమైన అన్నా చెల్లెలు
వైఎస్‌ విజయమ్మ కొడుకు.. కూతురైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైఎస్‌ షర్మిల ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఒకరిది వైఎస్‌ఆర్‌సీపీ.. మరొకరిది కాంగ్రెస్‌ పార్టీ. కొడుకు అసెంబ్లీకి పోటే చేస్తుంటే.. కూతురు పార్లమెంట్‌కు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ పులివెందుల కాగా పార్లమెంట్‌ కడప. ఈ రెండూ నియోజక వర్గాలు ఒకప్పుడు తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి గెలిచి ప్రజలతో మమేకమైన నియోజక వర్గాలు. ఈనియోకవర్గాల చుట్టూ కంచుకోటలు నిర్మించారని చెప్పొచ్చు. ఇక్కడ ఒక్క మాట మనం మాట్లాడుకోవాలి. కడప పార్లమెంట్‌ నియోజక వర్గం చిన్నాన్న కంచుకోట. ఆయన ఆ కంచుకోట పరిధిలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు షర్మిల ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ప్రధాన కారణం చిన్నాన్నను చంపాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఓడించడం. ఇది షర్మిల అన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదు. అయినా షర్మిల తన పట్టు వదల్లేదు. కొడుకు, కుమార్తెలిద్దరూ పట్టు వదలకుండా అడుగులు ముందుకు వేశారు. తాడోపేడో తేల్చుకోవాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు.
ఆ తల్లి మనస్సు ఎంత తల్లడిల్లుతోందో..
అయితే ఈ ఎపిసోడ్‌లో ఇద్దరి మనస్సులు ఎరిగిన ఆ తల్లి విజయమ్మ మనసు ఎంత తల్లడిల్లుతోందో. తల్లి మనసును తెలుసుకోలేని అమాయకులైతే కాదు కొడుకు జగన్‌.. కూతురు షర్మిల. వారి మనసుల్లో కూడా ఎంత బడబానలాగ్ని ఉందో ఎవరికీ తెలియదు. అది వాళ్ల మనస్సాక్షికి మాత్రమే తెలుసు. తన చిన్నాన్న చావుకు బందువులే కారణమని గట్టిగా నమ్ముతోంది షర్మిల. వరుసకు తమ్ముడైన అవినాష్‌.. చిన్నాన్నను హతమారుస్తాడా? అని ఆలోచిస్తున్నాడు జగన్‌. ఆలోచనలు వేరైనా ఆవేదన మాత్రం ఇద్దరి మనసుల్లోను ఒకటే. మమ్మల్ని ఎందుకు వేరు చేశావు.. దేవుడా.. అనేది వారి మనసులోని మాట కావొచ్చు. రాగద్వేషాలకు అతీతమైనది రాజకీయం. అది లేనిదే కొందరు జీవితం లేదనుకుంటారు. అటువంటిదేదైనా వీరి శరీరాలను ఆవహించేదేమో.. కానీ తల్లి మనసుకు మాత్రం నచ్చ జెప్పలేకపోతోంది.
వైఎస్సార్‌ బతికుంటే..
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికున్నప్పుడు జగన్‌.. షర్మిల ఎంత అన్యోన్యంగా ఉండే వాళ్లో అందరికీ తెలుసు. తండ్రి వైఎస్‌ఆర్‌.. తొడపై చెల్లి కూర్చుంటే తండ్రి భుజంపై జగన్‌ వాలిపోయే వారు. వారిద్దరి నవ్వులను చూస్తూ వైఎస్‌ఆర్‌తో పాటు విజయమ్మ కూడా ఎంతో పొంగిపోయేవారు. అంత ఆనందం.. ఆ కుటుంబంలో ఉండేది. అప్పుడప్పుడు అన్నదమ్ముల పిల్లలతో పాటు పెద్దలు కూడా కలిసి ఫొటోలు దిగే వాళ్లు. ఇడుపుల పాయ ఎస్టేట్‌కు వైఎస్‌ఆర్‌ వచ్చారంటే ఆనందానికి అవదులుండవు. అంత అన్యోన్యంగా ఉన్న అన్నా చెల్లి తండ్రి చనిపోయిన తరువాత కూడా కొంతకాలం కలిసే ఆనందంగా గడిపారు. ఏమైందో ఏమో కాని ఆలాఫ్‌ సడన్‌గా బద్ద శత్రువులుగా మారిపోయారు. ఇక్కడ వదిలేసి తెలంగాణకు వెళ్లిపోయింది. అక్కడ ఒక పార్టీ స్థాపించి ప్రస్థానం ప్రారంభించింది. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి తిరిగి ఆంధ్రకు వచ్చింది. అన్న పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు నిర్ణయించుకుంది. దానికోసం అమ్మ విజయమ్మ దగ్గర షర్మిల ఆశీర్వాదం తీసుకుంది. ఇడుపులపాయలోని తండ్రి ఘాట్‌ వద్దకు తల్లితో పాటు వెళ్లి ఆయనకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ఆ తరువాత అభ్యర్థులను ప్రకటించింది. అన్నపై రాజకీయ సమరానికి శంఖం పూరించింది. అయితే అంతకు ముందే జగన్‌ కూడా తల్లి విజయమ్మను కలిసాడు. ఆశ్వీర్వాదం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు.
బిడ్డలిద్దరినీ ఆశీర్వదించిన తల్లి
బిడ్డలిద్దరినీ ఆశీర్వదించిన తరువాత ఒకరిపై ఒకరు సమరానికి కాలుదువ్వుతుంటే తల్లి మనసు ఎన్ని ముక్కలై ఉంటుందో కదా.. ఎంత వేదనకు గురై ఉంటుందో కదా.. ఒక్క సారి గతమంతా గురుకొచ్చి కళ్లముదం మెదలాడి ఉంటుంది కదా. వైఎస్‌ఆర్‌ బతికుంటే ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కాదు కదా అని బోరున మనసులో ఏడ్చి వెక్కి వెక్కి ఏడ్చి ఉండొచు. అయినా ఆ తల్లి వాటన్నింటినీ దిగమింగుకొని ఇద్దరిని సమానంగా దీవించి.. ఆశీర్వదించి పంపడం ఆమెకు ఎంత గుండెనిబ్బరం కావాలి. బంధువులు, వైఎస్‌ఆర్‌ అభిమానుల్లోనూ ఇదే విషయం ఆవేదనకు గురిచేస్తోంది.
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా మూడో సారి బరిలోకి దిగారు. ఎలాగైనా భారీ మెజారిటీతో గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. కడప పార్లమెంట్‌ నుంచి పోటీకి దిగిన షర్మిల కూడా ఇదే పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా కడపలో గెలిచి తీరాలనే సంకల్పంతో అడుగు వేశారు. అయితే చిన్నాన్న హత్య ఉదంతం అటు ఓటర్ల మనసుల్లోను.. ఇటు అభ్యర్థుల మనసుల్లోను వెంటాడుతూనే ఉంది. వైఎస్‌ వివేకా హత్య ఉదంతం గెలుపు ఓటములను నిర్థారిస్తుందా.. లేక వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనను ఓటర్లు పరిగణలోకి తీసుకుంటారా?. చిన్నాన్న హత్య ఉదంతంపై ఎందాకైనా పోరాటం సాగుతుందంటున్న వైఎస్‌ షర్మిలకు మద్దతు తెలిపి ఆమెవైపు నిలబడతారా? ఏమి జరుగుతుంది?. ఎలా ఉండబోతోంది?. అనేది మరి కొన్ని రోజుల్లో తేలి పోతుంది.
Next Story