మలయప్పను పుష్పాలు, పత్రాలు ఎలా అభిషేకిస్తాయంటే..
x
పుష్పయాగం నిర్వహిస్తున్న అర్చకులు

మలయప్పను పుష్పాలు, పత్రాలు ఎలా అభిషేకిస్తాయంటే..

తిరుమలలో పుష్పయాగం కనువిందు చేయనుంది. ఇందుకు ఎన్ని టన్నులు పూలు వాడతారో తెలుసా? ఆ పువ్వులే దేవతలకు దూపంగా ఎలా మారుతాయో.. చూద్దాం రండి..


ప్రకృతి సోయగానికి చిరునామా తిరుమల. ఇక్కడ కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి వారిని భక్తులు ఆరాధిస్తారు. పువ్వులు, ఆకులు కూడా స్వామివారిని అభిషేకిస్తాయి. ఏటా కార్తీకమాసం శ్రవణ నక్షత్రంలో శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారి ఉత్సవమూర్తులైన ఉభయవేరులతో మలయప్ప స్వామికి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందుకోసం..


తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు టన్నుల కొద్దీ పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్తీకమాసంలో శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.

ఎన్ని రకాల పుష్పాలు వాడతారంటే

ఏటా కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రం పర్వదిన సందర్భంగా తిరుమల లో పుష్ప యాగాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి ఏడు టన్నుల పువ్వులు, సుగంధ పరిమాలతో కూడిన 14 రకాల పువ్వులు, ఆరు రకాల పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి వేడుకగా పుష్పార్చన చేస్తారు. ఈ పుష్పయాగంలో విరజాజి, మరువం, దవనం, మల్లెపూలు, సంపంగి, మూడు రకాలైన గులాబీలు, చేమంతి పూలు, ప్రత్యేకమైన కదిరి పచ్చ, బిల్వ, కనకాంబరం, కమలం, మొగిలి పూలను వినియోగిస్తారు.
వీటిలో కొన్ని సీజనల్ వారిగా లభించే పుష్పాలే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ పువ్వుల మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. అందులో తిరుమల తోపాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో స్వామి వారి పూజలకు అవసరమైన పువ్వులు అందివ్వడానికి దాతలు ఏటా ముందుంటారు. తిరుమల శ్రీవారికి తమిళనాడు, కర్ణాటక తో పాటు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన దాతలు ఈ పుష్పాలను సమకూరుస్తారు.
కనువిందుగా...

కొత్తగా అల్లిన వెదురు బుట్టల్లో (గంపలు) రకరకాల పుష్పాలతో నింపుతారు. కొన్ని బుట్టల్లో పత్రాలు (ఆకులు) కూడా నింపుతారు. వాటిని టీటీడీ ఈఓ, అదనపు ఈఓ అధికారులు, సిబ్బంది, కొంతరు భక్తులు మేళతాళాల మధ్య ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు తీసుకుని వస్తారు. ఆ ప్రదర్శన చూడడానికి రెండు కళ్లు చాలవు అనేంత ఆకర్షణగా ఉంటుంది. పువ్వులతో నింపిన గంపటన్నీ ఆలయం సమీపంలోని గొల్లమండపం వద్ద పేరుస్తారు. వాటిని టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేసిన అనంతరం, అధికారులు, సిబ్బంది వరుసగా ఆలయంలోకి చేర్చడంతో అర్చకులు మలయప్పస్వామి విగ్రహాల ముందు ఉంచి హారతి సమర్పించిన తరువాత పుష్పయాగం ప్రారంభం అవుతుంది.
ఈ యాగం ఎందుకు..

ప్రతి సంవత్సరం కార్తీకమాసం శ్రవణా నక్షత్రంలో తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. దీని వెనుక ఓ చరిత్ర ఉంది. 15వ శతాబ్దంలో ఆచరణలో ఉన్న ఈ పుష్పయాగం ప్రధాన ఉద్దేశం ఒకటే అని ఆలయ పండితులు చెబుతారు. "దేశం సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా విరాజిల్లాలని" ఆకాంక్షిస్తూ పుష్పయాగం నిర్వహించే వారని టీటీడీలోని శాసనాలు చెబుతున్నాయి. అప్పట్లో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగిన ఏడో రోజు స్వామివారికి పుష్పయాగం నిర్వహించేవారని చెబుతోంది. కాగా, 1980 నవంబర్ 14న ఈ ఉత్సవాన్ని టీటీడీ పునరుద్ధరించింది. ఆ మధ్యకాలంలో ఈ యాగం ఆగినట్లు పండితులు చెబిసున్న మాట.
శ్రీవారి జన్మనక్షత్రంలో...

కార్తీక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం రోజు శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు టీటీడీ వేదపందితులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఉభయదేవేరులతో మలయప్ప స్వామివారిని పల్లకిపై ఆశీనులను చేసి సర్వభూపాల వాహనంలో వేంచేపు చేస్తారు. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉన్న కళ్యాణ మండపంలో మలయప్పస్వామివారి విగ్రహాలను ఆశీనులను చేస్తారు. అంతకుముందే స్వామి, అమ్మవార్ల ఉత్సవాలను పట్టువస్త్రాలు ఆభరణాలతో అలంకరించి వేదమంత్రాల మధ్య పుష్పకైంకర్యం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు స్వామివారిని ఏమని ప్రార్థిస్తారంటే.
" బ్రహ్మోత్సవాల వేళ అర్చకులు లేదా సిబ్బంది వల్ల, భక్తులతో జరిగిన దోషాలు ఉంటే మన్నించండి. ఆ పాపాల నుంచి విముక్తులను చేయండి" అని వేద పండితులు శ్రీవారికి నివేదన సమర్పిస్తారు. అంటే ఉత్సవాల వేళ జరిగిన దోషాల నివారణ కోసం ఈ పుష్పయాగం నిర్వహిస్తారనేది కూడా తిరుమల వేద పండితులు చెప్పే మాట.

పుష్పయాగానికి ముందు... పువ్వులకు అధిపతి అయిన దేవుడు పుల్లడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చిస్తారు.
మలయప్పమూర్తులకు వేద పండితులు నాలుగు వేదాలతో సమర్పణ చేస్తూ వేదపఠనం చేస్తారు. తాయర్లు మలయప్పమూర్తుల విగ్రహాల పాదాల నుంచి హృదయం వరకు పుష్పాలతో మునిగేంత వరకు పుష్పారాధన చేయడం ఈ కార్యక్రమంలో విశేషణం.
ఏడు టన్నుల పత్రాలు పుష్పాలతో నివేదన పూర్తి కాగానే, స్వామివార్లకు ధూపదీప నీరాజనాలు సమర్పిస్తారు. ఆ తర్వాత పుష్పాలను పూర్తిగా తొలగిస్తారు. ఈ పుష్పయాగంలో 20 సార్లు సుగంధ భరిత పుష్ప జాతులతో కైంకర్యం నిర్వహించడం ప్రత్యేకత. ఈ క్రతువు పూర్తి కాగానే, పత్రాలు పుష్పాలను పక్కకు తొలగిస్తారు. అనంతరం దేవేరులతో కలిసి మలయప్ప స్వామి వారు సహస్ర దీపాలంకరణ సేవలో పూజలు అందుకుంటారు. ఆ తర్వాత నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. దీంతో పుష్పయాగం అనే ఘట్టం పూర్తవుతుంది. ఇదిలా ఉంటే...

పువ్వులే దూపమై...
పుష్పయాగంతో పాటు నిత్యం స్వామివారి అలంకరణకు ఉపయోగించే పువ్వులు కూడా మరో రూపంలో దేవదేవుడి సేవలోనే తరిస్తాయి. ఎలాగంటే..
తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో పరిమళభరితమైన అగరబత్తీల తయారు చేస్తున్నారు. ఇందుకోసం ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను టీటీడీ ఉద్యానవన విభాగం సిబ్బంది ఎస్వీ గోశాలలోని అగరబత్తుల తయారీ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది వీటిని రకరకాల రకాల వారీగా పుష్పాలను వేరుచేసి వాటి డ్రైయింగ్ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి, పిండిగా మారుస్తారు. ఆ పిండికి నీరు కలిపి కొన్ని పదార్థాలతో మిక్సింగ్ చేస్తారు. ఈ మిశ్రమాన్ని అగరబత్తీలు తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక యంత్రంలో 16 గంటల పాటు ఆరబెట్టిన తర్వాత మరో యంత్రంలో ఉంచి సువాసన వెదజల్లే ద్రావకంలో ఉంచుతారు. వాటన్నింటినీ తిరుమలతో పాటు, టీటీడీ ఆలయాల సమాచార కేంద్రాల వద్ద విక్రయిస్తన్నారు. తద్వారా టీటీడీకి ఆదాయం వస్తోంది.
Read More
Next Story