సీఎం రమేష్‌ను ఢీ కొట్టేదెలా?
x
Source: Twitter

సీఎం రమేష్‌ను ఢీ కొట్టేదెలా?

ఎన్నికల బరిలో సీఎం రమేష్‌కు ఎలా ఢీకొట్టాలో వైసీపీకి అంతుబట్టడం లేదు. సంధిస్తున్న అన్ని అస్త్రాలు నిర్వీర్యమవుతున్నాయి.


(శివరామ్)

విశాఖపట్నం: అనకాపల్లి లోక్‌సభకు పోటీ చేస్తున్న కూటమి అభ్యర్ది, బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్‌పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ సంధించే అస్త్రాలేవీ పనిచేయడం లేదు. ఆర్ధికంగా బలవంతుడు, వెలమ కులానికి చెందిన సీఎం రమేష్ అనకాపల్లి అభ్యర్దిగా వచ్చీ రాగానే తన పరిధిలోకి అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించి అక్కడి సమస్యలు , అసమ్మతి గొడవలు పరిష్కరిస్తుండడంతో వైఎస్సార్ కాంగ్రెస్ ఆ నియోజకవర్గాన్ని సీరియస్‌గా తీసుకొంది. రమేష్ బీజేపీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడనే భావనతో ఇక్కడ ఎలాగైనా గెలవాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. అందుకోసమే 175 అసెంబ్లీ, 24 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్దులను మార్చి 16న ప్రకటించిన వైసీపీ అనకాపల్లి ఒక్కదానినే పెండింగ్‌లో పెట్టింది. బీజేపీ సీఎం అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత ఆచీతూచీ , అన్ని బేరీజులు వేసుకొని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడుని మాడుగుల అసెంబ్లీ నుంచి అనకాపల్లి పార్లమెంటుకు మార్చింది.

లోకల్ వర్సెస్ నాన్ లోకల్

ఉత్తరాంధ్రకు సంబంధంలేని సీఎం రమేష్ ఎక్కడో కడప నుంచి వచ్చి పోటీ చేస్తే ఎలా అని వైఎస్సార్ కాంగ్రెస్ లోకల్ ఫీలింగ్‌ను తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణతో పదేపదే మాట్లాడించింది. అయితే అనుకున్నంతగా ఆ అంశాన్ని జనం పెద్దగా పట్టించుకోలేదు. ఇదే వైసీపీ 2014లో కడప నుంచి వైఎస్ విజయమ్మను తీసుకువచ్చి విశాఖలో పోటీ పెట్టలేదా? నెల్లూరుకు చెందిన విజయసాయిరెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి.. ఆ ఐదేళ్ల పాటు ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జులుగా ఎందుకు ఉన్నారు? స్థానిక బీసీ నేతలు వైసీపీకి కనపడలేదా? అన్న ఎదురు ప్రశ్నలు రావడంతో ఆ అంశం కనుమరుగైపోయింది.

ఫ్యాక్షనిస్ట్ ముద్ర వేసే ప్రయత్నం

చోడవరం పోలీసు స్టేషన్‌లో సీఎం రమేష్‌పై కేసు పెట్టడం, వెంటనే 41ఏ నోటీసులు పంపి హాజరు కమ్మనడం వంటివి చేసినా పెద్దగా ఫలితం లేకపోవడం వైసీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. అసలు అనకాపల్లితో సంబంధంలేని సీఎం రమేష్‌కు కేసులు, నోటీసుల ద్వారా వైసీపీ పెద్దలే అనకాపల్లి నియోజకవర్గంలో రమేష్‌కు లేనిపోని ప్రచారం కల్పించి హీరోను చేస్తున్నారని ఆ పార్టీ నేతలే కలవర పడే పరిస్థితులు వచ్చాయి. ఆరు రోజుల క్రితం చోడవరం లో టైల్స్ వ్యాపారి బుచ్చి బాబు షాపుపై జీఎస్టీ దాడి జరిగినప్పుడు స్థానిక తెలుగుదేశం అభ్యర్థి , మాజీ శాసనసభ్యుడు సన్యాసిరాజు పిలవడంతో సంఘటనా స్ధలానికి సీఎం రమేష్ వెళ్లారు. నిబంధనల మేరకే దాడి చేశారా?నోటీసులు ఇచ్చారా అని సీఎం రమేష్ వారిని ప్రశ్నించారు. జీఎస్టీ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినప్పుడు తాను చర్చలో పాల్గొన్నానని, నోటీసు ఇవ్వకుండా దాడి చేసే అవకాశం చట్టంలో లేదని రమేష్ చెప్పడంతో అధికారులు నీళ్లు నమిలారు. చోడవరం శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ తమను కోటి రూపాయలు డిమాండు చేశారని , ఇవ్వని కారణంగానే జీఎస్టీ అధికారులతో దాడులు చేయించారని వ్యాపారి కుటుంబ సభ్యులు బహిరంగంగానే మీడియా ముందు చెప్పారు. కేవలం రాజకీయ వేధింపులలో భాగమే ఇదంతా అని ఆరోపించారు.

అనవసరంగా సమస్యను పెంచారా?

ఆ వ్యవహారానిన అక్కడకే పరిమితం చేయాల్సిన వైసీపీ నేతలు అందుకు విరుద్ధంగా జీఎస్టీ అధికారులతో మరుసటి రోజు పోలీసులకు సీఎం రమేష్, చోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సన్యాసి రాజు తదితరులపై ఫిర్యాదు చేయించారు. అదే రోజు ధర్మశ్రీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సవాళ్లు విసిరి సమస్యను సాగదీశారు. దీనికి కొనసాగింపుగా ఆదివారం చోడవరం పోలీసులు సీఎం రమేష్, రాజు తదితరులకు ఆ నెల తొమ్మిదవ తేదీన హాజరు కావాల్సిందిగా 41 ఎ నోటీసులు జారీ చేశారు. ఇలా నోటీసులు జారీ చేయడం ద్వారా కూటమి అభ్యర్దులకు ఎన్నికల సమయంలో సువర్ణ అవకాశం కల్పించి నట్టైంది. ఒకరోజు ముందే ఎనిమిదవ తేదీన ఎటువంటి హడావుడి లేకుండా సీఎం రమేష్ హుందాగా పోలీసు స్టేషన్‌కు స్వయంగా వెళ్లి నోటీసు తీసుకొన్నారు. దీంతో ధర్మ శ్రీ వ్యూహం బెడిసి కొట్టినట్లు అయింది. సీఎం రమేష్‌ను రాయలసీమ ఫ్యాక్షన్ వాదిగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నం విఫలం అయింది.

వెలమ వర్సెస్ కొప్పుల వెలమ

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కొప్పుల వెలమ, బీసీలు కాగా, కడప , చిత్తూరు జిల్లాలకు చెందిన వెలమలు ఓసీలు. సీఎం రమేష్.. ఓసీ కావడంతో దానిని ఎన్నికల అస్త్రంగా మార్చే ప్రయత్నం వైసీపీ చేసింది. అనకాపల్లి పార్లమెంటులో కొప్పల వెలమలు మెజారిటీ కులస్థులు కావడంతో దీనిని ప్రచారం చేద్దామనుకున్నారు. అయితే , కొప్పుల వెలమ పెద్దలైన చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి , గండి బాబ్జీ వంటి వారంతా తెలుగుదేశంలో వుండడంతో వారి ప్రోద్భలంతో కొప్పుల వెలమ సంఘం సమావేశాన్ని అనకాపల్లిలో రెండు రోజుల క్రితం నిర్వహించి సీఎం రమేష్‌కు మద్దతు ప్రకటింపజేయడంతో అదీ కుదరలేదు. దీంతో సీఎం రమేష్‌ను ఎదుర్కొనే కొత్త అస్త్రాల కోసం వైసీపీ అన్వేషిస్తోంది.

అవసరమైతే అభ్యర్థి మార్పు

ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్నప్పటికీ ఇంతకాలం తన సొంత నియోజక వర్గమైన మాడుగులకే పరిమితమైన బూడి ముత్యాల నాయుడును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా సానుకూల స్పందన రాకపోవడంతో వైసీపీ అభ్యర్ధిని మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వెలమల నుంచి అనుకున్నంతగా మద్దతు రానందున నియోజకవర్గంలో మరో బలమైన కులమైన కాపుల నుంచి లేదా అస్సలు సీటు ఇవ్వని గవర కులస్థుల నుంచి అభ్యర్దలు కోసం అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత ఎంపీ డాక్టర్ సత్యవతి గవర సామాజిక వర్గానికి చెందినవారే. గత ఎన్నికల్లో ఎంపీతో పాటు ఏడు అసెంబ్లీలలో ఏకపక్షంగా వైసీపీకి విజయాన్ని అందించిన అనకాపల్లి ఈ సారి అంత తేలికగా కొరుకుడుపడేటట్లు కనిపించడం లేదు.

Read More
Next Story